Visakhapatnam: కల సాకారమయ్యే వేళ.. రైల్వే డివిజన్ కు ముహూర్తం ఖరారు.. ప్రధాని మోడీ చేతుల మీదుగా..
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఉత్తరాంధ్ర జీవ నాడిగా భావిస్తున్న విశాఖ రైల్వే డివిజన్ కల నెరవేరే సమయం ఆసన్నమైంది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటుకానున్న దక్షిణ కోస్తా రైల్వేజోన్..
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఉత్తరాంధ్ర జీవ నాడిగా భావిస్తున్న విశాఖ రైల్వే డివిజన్ కల నెరవేరే సమయం ఆసన్నమైంది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటుకానున్న దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు శంకుస్థాపన చేసేందుకు ముహూర్తం కుదిరింది. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రధానితో కలిసి రైల్వేజోన్ శంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రధాని విశాఖ పర్యటనలో భాగంగా వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. నవంబర్ 11న విశాఖ చేరుకోనున్న పీఎం మోడీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి నేరుగా తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి చేరుకుంటారు. కాసేపు ఈఎన్‌సీ అధికారులతో రక్షణ రంగంపై చర్చించి రాత్రి అక్కడే బస చేస్తారు. 12వ తేదీ ఉదయం ఏయూ గ్రౌండ్స్‌కి చేరుకుంటారు. అక్కడ భారీ బహిరంగ సభకు హాజరవుతారు. ఈ వేదిక నుంచే పలు కీలక కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి ప్రధాని మోడీ, సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. రూ.120 కోట్లతో జోన్ ప్రధాన కార్యాలయం నిర్మిస్తారు. విశాఖ శివారు వడ్లపూడిలో రైల్వే అనుబంధ సంస్థ ఆర్‌వీఎన్‌ఎల్ రూ.260 కోట్ల వ్యయంతో నిర్మించిన వ్యాగన్ వర్క్‌షాప్‌ను జాతికి అంకితం చేస్తారు. రైల్వే ల్యాండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఆర్‌ఎల్‌డీఏ) నేతృత్వంలో రూ.446 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న విశాఖపట్నం రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. గంభీరంలో రూ.445 కోట్లతో మొదటి విడతలో నిర్మించిన ఐఐఎం విశాఖపట్నం క్యాంపస్‌నూ ప్రారంభిస్తారు.
అంతే కాకుండా రూ.380 కోట్లతో ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి, ప్రధాని శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటు రైల్వే, ఇతర కేంద్ర సంస్థలకు సంబంధించిన పలు పనులను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ప్రధాని మోడీ, సీఎం జగన్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రధాని పర్యటన సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..