Telangana MLAs: ఎమ్మెల్యేల బేరసారాల ఎపిసోడ్‌పై దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు
ఫామ్‌హౌస్‌లో కొనుగోళ్ల వ్యవహారంలో దర్యాప్తు స్పీడప్ చేశారు పోలీసులు. ఎమ్మెల్యే నుంచి ఫిర్యాదు అందుకున్న వెంటనే ముగ్గురు నిందితులపై కేసులు నమోదు చేశారు. సీక్రెట్ ప్లేస్‌లో లోతుగా విచారించారు. ప్రధానంగా డీల్ వెనుక ఉన్న బిగ్ షాట్స్ ఎవరన్న కోణంలో ప్రశ్నించారు.
యావత్ తెలంగాణ ఫామ్ హౌజ్ పాలిటిక్స్‌ను ఆసక్తిగా గమనిస్తోంది. గంటలు గడిచేకొద్దీ రాజకీయ నేతల గుండెల్లో వేగం పెరుగుతోంది. ఎప్పుడెవరు ఎలాంటి బాంబు పేల్చుతారోనన్న దడ మొదలైంది. అనూహ్య పరిణామాల మధ్య ఫామ్‌హౌజ్ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి. డీల్‌లో భాగంగా తన ఫామ్‌హౌస్‌కు ముగ్గురు వచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారాయన. బీజేపీలో చేరేందుకు కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని, ఎమ్మెల్యేలను తీసుకొస్తే ఒక్కొక్కరికి 50కోట్లు ఇస్తామని డీల్ మాట్లాడారన్నారు. బీజేపీలో చేరాలని స్వామీజీ, నందు, సతీష్ తనపై ఒత్తిడి తెచ్చారని పోలీసులకు కంప్లయింట్ చేశారు.
సీబీఐ, ఈడీలతో దాడులంటూ బెదిరింపులు
మాట వింటే సరి లేదంటే.. సీబీఐ, ఈడీ లతో దాడులు జరుగుతాయని బెదిరించారని కంప్లైంట్‌లో ప్రధానంగా మెన్షన్ చేశారు రోహిత్. ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారంలో ముగ్గురిపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ1 గా ఢిల్లీకి చెందిన సతీశ్ శర్మ అలియాస్ రామచంద్ర భారతి.. ఏ 2 హైదరాబాద్‌కు చెందిన నందకిశోర్.. ఏ 3గా తిరుపతికి చెందిన సింహయాజిపై వేర్వేరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
కోనుగోల్‌మాల్ వెనుక ఉన్నదెవరు?
ఎమ్మెల్యేల బేరసారాల ఎపిసోడ్‌పై దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు.. భారతి, నందు, సింహయాజిలను రహస్య ప్రాంతానికి తరలించారు. కోనుగోల్‌మాల్ వెనుక ఎవరున్నారనే కోణంలో ప్రధానంగా ఆరాతీశారు. ముగ్గుర్ని కలిపి ఓసారి.. వేర్వేరుగా మరోసారి విచారించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఫామ్‌హౌస్‌ను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని పరిశీలించారు. ఇతరులెవర్నీ లోనికి అనుమతించలేదు. ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ఫామ్ హౌస్‌కు డబ్బు తెచ్చారా? తెస్తే ఎక్కడ దాచారనే కోణంలో తనిఖీలు చేశారు.
ముగ్గురు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను విశ్లేషించారు. అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి.. న్యాయపరంగా ముందుకెళ్తామన్నారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం