సంచార బయో టాయిలెట్లుగా పాత ఆర్టీసీ బస్సులు

తెలంగాణలో మూలపడిపోయిన పాత బస్సులు కొత్త అవతారం ఎత్తబోతున్నాయి. పట్టణాల్లో సంచార బయో టాయిలెట్లుగా ఇవి మారబోతున్నాయి.

  • Tv9 Telugu
  • Publish Date - 7:43 am, Mon, 20 July 20
సంచార బయో టాయిలెట్లుగా పాత ఆర్టీసీ బస్సులు

తెలంగాణలో మూలపడిపోయిన పాత బస్సులు కొత్త అవతారం ఎత్తబోతున్నాయి. పట్టణాల్లో సంచార బయో టాయిలెట్లుగా ఇవి మారుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో కొన్ని బస్సులను ప్రారంభించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో పురపాలక శాఖ వీటిని ఏర్పాటు చేయబోతుండగా.. తాజాగా ఖమ్మంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఈ సంచార బయో టాయిలెట్లను ప్రారంభించారు.

ఈ సందర్భంగా పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ”బహిరంగ మలమూత్ర విసర్జన రహిత(ఓడీఎఫ్‌) పట్టణాల రూపకల్పనలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం భారీసంఖ్యలో వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించింది. ఆగస్టు 15 నాటికి ప్రతి వెయ్యి మందికి ఒక పబ్లిక్‌ టాయిలెట్‌ నిర్మించాలని లక్ష్యంగా ముందుకెళ్తున్నాము. అవసరమైన చోట టాయిలెట్‌ ఆన్‌వీల్స్‌ ఏర్పాటు చేయాలన్న మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు వీటిని అందుబాటులోకి తీసుకురానున్నాము. వీటి నిర్వాహణను స్లమ్‌ లెవల్‌ ఫెడరేషన్స్‌ లేదా పట్టణ వికలాంగుల సమితి లేదా మహిళా సంఘాలు, ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీలకు అప్పగించాలని భావిస్తున్నాము” అని అన్నారు.