12 ఏళ్ల నిరీక్షణ.. ఇన్నాళ్లూ ఎక్కడున్నావమ్మా..!

నాలుగేళ్ల వయస్సులో సోదరుడి వెంట స్కూల్‌కు వెళ్లిన ఆ చిన్నారి తప్పిపోయింది. ఏం చేయాలో తెలియక, తన వాళ్లు ఎక్కడున్నారో గుర్తించలేక అష్టకష్టాలు పడింది. అలా వెళ్తూ వెళ్తూ ఓ మహిళ దగ్గరకు చేరింది. చిన్నారిని చూసి మనసు కరిగిన ఆ మహిళ… చేరదీసి ఇంటర్ వరకు చదివించింది. ఆ వైపు కుటుంబసభ్యులు కూడా ఆ చిన్నారి ఆచూకీ కోసం ఏళ్ల తరబడి వెతికారు. కానీ ప్రయోజనం లేకపోవడంతో తమ పాప ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు […]

  • Tv9 Telugu
  • Publish Date - 4:11 pm, Sat, 7 December 19
12 ఏళ్ల నిరీక్షణ.. ఇన్నాళ్లూ ఎక్కడున్నావమ్మా..!

నాలుగేళ్ల వయస్సులో సోదరుడి వెంట స్కూల్‌కు వెళ్లిన ఆ చిన్నారి తప్పిపోయింది. ఏం చేయాలో తెలియక, తన వాళ్లు ఎక్కడున్నారో గుర్తించలేక అష్టకష్టాలు పడింది. అలా వెళ్తూ వెళ్తూ ఓ మహిళ దగ్గరకు చేరింది. చిన్నారిని చూసి మనసు కరిగిన ఆ మహిళ… చేరదీసి ఇంటర్ వరకు చదివించింది. ఆ వైపు కుటుంబసభ్యులు కూడా ఆ చిన్నారి ఆచూకీ కోసం ఏళ్ల తరబడి వెతికారు. కానీ ప్రయోజనం లేకపోవడంతో తమ పాప ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు అని దేవుడిని ప్రార్థించారు. ఇలా 12 ఏళ్లు గడిచాయి. తను పెంచుకున్న తల్లి ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఆ యువతి ఓ ఇంట్లో పనిమనిషిగా చేరింది. అయితే ఆ ఇంటి యజమానికి ఆ అమ్మాయి చరిత్రను తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. దీంతో శోధించి, ఎట్టకేలకు ఆ అమ్మాయి తల్లిదండ్రులను కనుగొన్నాడు. అంతేకాదు ఆ యువతి తల్లిదండ్రులకు వీడియో కాల్‌ చేసి మాట్లాడించాడు. అంతే..12 ఏళ్ల తరువాత తన కన్నవారిని చూసిన ఆమె ఆనందానికి అవధుల్లేవు. సినిమా కథను తలపిస్తోన్న ఈ సంఘటన ఎక్కడో కాదు ఏపీలోనే జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన భవాని 12ఏళ్ల క్రితం సోదరుడి వెంట స్కూల్‌కు వెళ్తూ తప్పిపోయింది. ఆ తరువాత ఆమె కోసం ఎన్నో ఏళ్లుగా వెతికినా ప్రయోజనం లేకపోవడంతో వారు తమ ఆశలు వదలుకున్నారు. కానీ ఇటీవల అనూహ్యంగా సోదరుడి వీడియో కాల్‌లో భవాని ప్రత్యక్షమైంది. పటమటలంకకు చెందిన మోహన్ వంశీ అనే వ్యక్తి… భవానిని ఆమె కుటుంబసభ్యులకు పరిచయం చేశాడు. తన ఇంట్లో పని చేసేందుకు వచ్చిన భవాని చరిత్రను శోధించిన వంశీ, భవాని చెప్పిన ఆధారాలతో సంబంధిత వ్యక్తుల కోసం అన్వేషణ ప్రారంభించాడు. ఎట్టకేలకు అతడి అన్వేషణ ఫలించగా.. ఫేస్‌బుక్ ఆధారంగా భవాని కుటుంబాన్ని కనిపెట్టాడు. వెంటనే వారి కుటుంబసభ్యులకు వీడియో కాల్ చేశాడు. ఆ కాల్‌లో తన కన్నవారిని చూసి తీవ్ర భావోద్వేగానికి గురైన భవాని కంట అప్పటివరకు దాచుకున్న కన్నీళ్లన్నీ బయటకు వచ్చాయి. ఇన్నిరోజులు తను పడ్డ కష్టమంతా మర్చిపోయి, ఆనందంతో వారితో మాట్లాడింది భవాని. వీడియో కాల్‌లో భవానిని చూసి చీపురుపల్లి వాసులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక ఆ యువతి తల్లిదండ్రులను కనుగొన్నందుకు మోహన్ వంశీ కుటుంబం కూడా సంతోషం వ్యక్తం చేస్తోంది.