AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Vaccine Extortion: కరోనా విపత్తును వ్యాపారంగా మల్చుకుంటున్న కంత్రీగాళ్లు.. వ్యాక్సిన్‌ను వదలని కేటుగాళ్లు.. టీవీ9 నిఘాలో అసలు నిజాలు

కరోనా వైరస్‌ కట్టడికి వ్యాక్సిన్ తీసుకువచ్చినా.. అది ఇంకా అందరికి చేరలేదు. మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను ఆసరాగా మార్చుకుంటున్నారు కొందరు సిబ్బంది.

Covid Vaccine Extortion: కరోనా విపత్తును వ్యాపారంగా మల్చుకుంటున్న కంత్రీగాళ్లు.. వ్యాక్సిన్‌ను వదలని కేటుగాళ్లు.. టీవీ9 నిఘాలో అసలు నిజాలు
Covid 19 Vaccine Extortion In Andhr Pradesh
Balaraju Goud
|

Updated on: May 29, 2021 | 1:27 PM

Share

Covid Vaccine Extortion: కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ప్రాణాలు నిలుపుకోవడమే చాలెంజింగ్‌గా మారింది. వైరస్‌ కట్టడికి వ్యాక్సిన్ తీసుకువచ్చినా.. అది ఇంకా అందరికి చేరలేదు. మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను ఆసరాగా మార్చుకుంటున్నారు కొందరు సిబ్బంది. అవకాశం ఉన్న మేర దండుకుంటున్నారు. వ్యాక్సిన్ డిమాండ్ కొందరికి కాసుల వర్షం కురిపిస్తోంది. జనం అవసరాలేంటి? సిబ్బంది నిర్వాహకం ఏంటి? హాస్పిటల్‌లో అసలేం జరుగుతోంది? క్షేత్ర స్థాయి అసలు పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయి.

కరోనా మహమ్మారిని ప్రపంచం మొత్తం ఒక విపత్తు గా చూస్తుంటే మనదేశంలో మాత్రం దీన్ని ఒక వ్యాపారంగా చూస్తున్నారు. ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన కొటేషన్స్‌లో ఇది ఒకటి. ఒకవైపు మహమ్మారి ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు పడుతోన్న ఆందోళనను అదునుగా చేసుకుని కొంతమంది కేటుగాళ్లు కరోనా ఔషదాలను బ్లాక్ మార్కెట్ లో విక్రయించడం మనం ఇప్పటి వరకు చూశాం. టోసిలోజుమాబ్, రెమిడిసివిర్ లాంటి ఇంజక్షన్లను కొందరు లక్షల్లో అమ్మి తమలోని అమానవీయతను బయటపెట్టుకుంటే, మరికొందరు ప్రాణవాయువు ఆక్సిజన్ సిలిండర్లునూ భారీ ధరకు బ్లాక్ మార్కెట్ లో పెట్టి తమలోని కర్కశత్వాన్ని బహిర్గతం చేసుకున్నారు.

ఇలా ఆ పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రాణాపాయ ఔషదాలను బ్లాక్ మార్కెట్ లో అదనపు డబ్బులకు అమ్ముకున్నట్టే… తాజాగా వాక్సిన్ కి కూడా అదే గతి పట్టింది. ప్రభుత్వ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా డబ్బులు ఇస్తే క్యూలతో సంబంధం లేకుండా వాక్సిన్ వేసే సంప్రదాయానికి తెరలేపారు కొందరు వైద్య సిబ్బంది. డోస్ కి రూ. 500 నుంచి రూ. 700 వరకు ఇస్తే చాలు.. ఎవరికైనా వాక్సిన్ వేసేస్తున్నారు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు క్యూలలో ఉండాల్సిన అవసరం లేదు, 45 ఏళ్ళు దాటి ఉండాల్సిన అవసరం అసలే లేదు. ఇక, ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ అని కూడా అక్కర్లేదు. అవసరమైతే బూస్టర్ డోస్ కూడా వేసేస్తున్నారు కొందరు సిబ్బంది. ఇవేం తెలియని అమాయక జనం మాత్రం అమాయకంగా తెల్లవారుఘామునుంచే క్యూలో ఉండి సాయంత్రం వరకు చూసి తమ స్లాట్ టైం రాక వెనుతిరుగుతోన్న సందర్భాలు ఒక వైపు ఉంటే, మరోవైపు రైట్ రాయల్ గా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా వాక్సిన్ వేసుకెళ్తున్న ఘటనలను బహిర్గతం చేయాలని టీవీ9 ప్రయత్నం చేసింది.

ఇదీ దందా… కోవాగ్జిన్ కి అయితే డిమాండ్ ఎక్కువ కాబట్టి డోస్ కి రూ. 700, కొవీషీల్డ్ కి రూ.500.. అదీ తెలిసిన వాళ్ళకే. చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మధ్యలో డబ్బుదేముంది. మీ ఇష్టం ఎంతోకొంత ఇచ్చేయమంటారు, ఇంకా ఎవరైనా ఉంటే తీసుకురండి వేయించేద్దాం అంటారు.

విశాఖలోని ఆరిలోవలోని జీవీఎంసీ ఆధ్వర్యంలో నడిచే ఫస్ట్ రెఫరెల్ హాస్పిటల్‌లో ఆశా వర్కర్‌గా పనిచేస్తోంది. వీళ్లకు ఇక్కడ కేటాయించిన విధులేంటో తెలియదు కానీ వీళ్లు చేసేది మాత్రం ముందుగా తమతో కాంటాక్ట్ అయ్యి అక్కడకు వచ్చే వాళ్ల దగ్గర ఆధార్ కార్డ్స్ తీసుకుని ముందుగా రిజిస్టర్ చేయడం, ఆ తర్వాత క్యూ తో సంబంధం లేకుండా వాళ్లను రైట్ రాయల్ గా తీసుకెళ్లి వాక్సిన్ వేయించేసి 10 నిమిషాల్లో పంపించేయడం.. మంచి డీల్.

ఒక వైపు వాక్సిన్ కోసం సామాన్య ప్రజలు ఆయా కేంద్రాలకు ఉదయం 3, 4 గంటలకే చేరుకుని తమ టర్న్ వస్తుందో రాదోనన్న టెన్షన్ లో సాయంత్రం వరకు ఉండి తమ టర్న్ రాక ఉసురుమంటూ వెనక్కి వెళ్తోన్న సందర్భాలూ అనేకం ఉన్నాయి. అక్కడ తోపులాటలు, గొడవలు, కళ్లు తిరిగి పడిపోవడం, అక్కడ ఉన్న వారిలో పాజిటివ్ ఉండి సూపర్ స్ప్రెడర్స్ గా మారి వైరస్ ను ఎక్కించడం.. ఇవన్నీ సాధారణ ప్రజలకే పరిమితం చేస్తూ ఇలా డోస్ కి ఇంత అని డబ్బులు తీసుకుని క్యూ లైన్‌తో సంబంధం లేకుండా వాక్సిన్ వేయించడం అన్నది కచ్చితంగా అనైతిక చర్యే. డబ్బులేని వారు, ప్రాణ భయంతో క్యూ లైన్‌లో ఉన్నవాళ్లు అమాయకంగా అలానే వేచి చూసి చూసి అలసిపోతుంటే వీళ్లు మాత్రం ఇలా వ్యవహరించడాన్ని సామాన్య జనం తప్పుబడుతున్నారు.

ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకపోవడం. ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది 45 సంవత్సరాల లోపు వాళ్లకు ప్రస్తుతానికి వాక్సిన్ వేయలేము, రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 45 ఏళ్ల పైబడ్డ వాళ్లకు మాత్రమే మొదటి డోస్, ఇప్పటికే వాక్సిన్ వేయించుకున్న వాళ్లకు సెకండ్ డోస్ కి మొదటి ప్రాధాన్యత అని ప్రభుత్వం ఘంటా పధంగా చెబుతూ వస్తోంది. కానీ అవేమీ వాక్సినేషన్ కేంద్రాల్లో పట్టించుకోవడం లేదు. అసలు ఏజ్ కూడా అడగడం లేదు, అక్కడ వాక్సిన్ వేయించుకుంటున్న వాళ్లను చూస్తే కొంతమందికి 18 అయినా నిండాయో లేదో కూడా సందేహం కలుగుతోంది. వాళ్లలో చాలామందికి రిజిస్ట్రేషన్ చేయడం లేదు, కొంతమందికి రిజిస్ట్రేషన్ చేస్తున్నా అవికూడా ఇష్టారాజ్యంగా చేస్తున్నారు.

వ్యాక్సిన్ కోసం క్యూ లో నిలుచున్న సామాన్య జనానికైతే చుక్కలు చూపిస్తారు. ముందు వాళ్ళు రిజిస్ట్రేషన్ కోసం క్యూ లో నిలబడాలి, అదే పెద్ద క్యూ. అది పూర్తయ్యాక మళ్లీ వాక్సినేషన్ కోసం క్యూ పాటించాలి, ఈ రెండు క్యూ లు నిరంతరం కొనసాగుతూ తూ తూ ఉంటాయ్. కానీ డబ్బులిచ్చే వాళ్లకు రిజిస్ట్రేషన్ కి కానీ, వాక్సినేషన్ కి కానీ క్యూ లు ఉండవు. ఇంకా వాళ్ళు ఎక్కువ బిల్డప్ ఇవ్వాలనుకుంటే ఒక ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి అక్కడే రిజిస్ట్రేషన్ చేయించి అక్కడే వాక్సిన్ వేయించి పంపించేస్తారు. లేదంటే బయట చెట్ల కింద కాసేపు వెయిట్ చేయించి ఈ లోపు రిజిస్ట్రేషన్ చేయించి తర్వాత వాక్సిన్ వేస్తారు.

ఇక్కడ జరుగుతున్న తంతు చూస్తుంటే.. ప్రభుత్వ నిబంధనలను ఏ మాత్రం పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. 45 ఏళ్ల పై బడిన వారికే వ్యాక్సిన్ ఇవ్వాలన్న నిబంధనను తుంగలో తొక్కారు సిబ్బంది. సాధారణంగా ఒక వయల్ నుంచి 0.5 ML చొప్పున 12 మందికి వేయొచ్చు. కొన్ని సార్లు అది పదిమందికే సరిపోవచ్చు. ఇలా డబ్బులు తీసుకున్న వారికి 0.5 ML కాకుండా తక్కువ మోతాదులో వేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సరైన ఆడిటింగ్ వ్యవస్థ లేకపోవడంతోనే నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇది ఒక్క ఆరిలోవలో ఒక్క నర్సుకే పరిమితం కాదు. అలా అని అందరూ ఇలానే చేస్తున్నారనీ కాదు.. కొంతమంది చేసే ఇలాంటి అనైతిక చర్యల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడమే కాకుండా… ప్రభుత్వ సూచనలు విని ఇప్పుడు తమకు అనుమతి లేదు కదా అనుకునే 45 ఏళ్ల లోపు వారు కూడా నొచ్చుకునే అవకాశం ఉంది. ఈ కేంద్రం పై గతంలోనూ ఇలాంటి ఆరోపణలు వస్తే మేయర్ తో పాటు అధికారులు కూడా కొందరు సిబ్బందిని చీవాట్లు పెట్టినట్లు తెలిసింది. అయినా వీళ్లు డిమాండ్ చేయకపోయినా డబ్బులు ఇచ్చి వాక్సిన్ వేయించుకునేందుకు ఆసక్తి చూపుతోన్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు ఆశ కలిగిన కొందరు ఇలా తప్పుదోవ పట్టే అవకాశం ఉంది. ఈ లోపాలను తక్షణం సరిదిద్దాల్సిన అవసరం ఉంది.

అరిలోవ రెఫరెల్ సెంటర్‌లో ఏం జరుగుతోంది.. టీవీ9 కళ్లకు కట్టింది. అధికారులూ ఈ తతంగాన్ని చూసే ఉంటారా? ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే.. ఉన్నతాధికారులకు ఇదంతా తెలిసి జరుగుతుందా? తెలియకుండా జరిగిపోతుందా? మరి ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారని టీవీ9 ప్రశ్నిస్తోంది.

Read Also…. Krishnapatnam Anandaiah: మళ్లీ అజ్ఞాతంలోకి ఆనందయ్య.. రహస్య ప్రాంతానికి తరలించిన పోలీసులు.. ప్రముఖుల ఒత్తిడియే కారణమా.. !