Software Thief: చోర కళలో ఆరితేరిన స్టైలిష్ సాఫ్ట్‌వేర్ బాబు.. వీడిన 32 చోరీ కేసుల మిస్టరీ!
సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్న ఓ ప్రబుద్ధుడు విలాసాల కోసం చోరీల బాటపట్టాడు. హైదరాబాద్లోని ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వరుస చోరీలు చేస్తూ పోలీసులకు కంటి మీద కునుకులేకుండా చేశాడు. కట్ చేస్తే చివరికి ..

విశాఖ, ఫిబ్రవరి 7: బాగా చదువుకుని సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్న ఓ ప్రబుద్ధుడు విలాసాల కోసం చోరీల బాటపట్టాడు. హైదరాబాద్లోని ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వరుస చోరీలు చేస్తూ పట్టుబడ్డాడు. అంతే పరువుతోపాటు ఉద్యోగం కూడా ఊడిపోయింది. ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే..
విశాఖపట్నంకి చెందిన మహేష్ రెడ్డి అలియాస్ సన్నీ హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే సదరు సాఫ్ట్‌వేర్ బాబు సైడ్ బిజినెస్‌గా చోరీలు కూడా చేసేవాడు. విలాసాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్న మహేష్ ముసుగు దొంగగా పోలీసులలో పేరుపడ్డాడు. కరడుగట్టిన దొంగ అచ్చి మహేష్ రెడ్డి అలియాస్ సన్నీ చోరీ చేసిన సొత్తుతో బిఎండబ్ల్యూ కారు కొని షికార్లు కొట్టేవాడు. ఇలా విశాఖపట్నంలోనే మహేష్ రెడ్డి పై ఏకంగా 26 చోరీ కేసులు ఉన్నాయి. 15 ఏళ్ల వయసులోనే నాలుగు చోరీలు చేసిన మహేష్.. హోమ్ నుంచి విడుదలయ్యాక మరిన్ని చోరీలు చేయడంలో ఆరితేరి పోయాడు.
కాకినాడ, సర్పవరం, రామచంద్రాపురం, ఇంద్రాల పాలెం, రాజమండ్రి పోలీస్ స్టేషన్లలో సుమారు 32 దొంగతనాల కేసులు ఉన్నాయంటే ఇతగాడి చరిత్ర ఎంత గట్టిదో అర్ధం చేసుకోవచ్చు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 14 నెలల శిక్ష అనుభవించిన మహేశ్వర్ రెడ్డి అవకాశం ఉన్నప్పుడు దొంగతనాలు చేసి హైదరాబాద్లో విలాసవంతంగా జీవనం సాగించేవాడు. తాజాగా ఈ సాఫ్ట్‌వేర్ దొంగని పోలీసులు అరెస్ట్ చేసి 699 గ్రాముల బంగారం, 3.805 కిలోల వెండి, BMW కారు, ఓ స్కూటీ, నేరానికి వినియోగించిన ఐరన్ రాడ్, టోపీ మాస్క్ సీజ్ చేసి జైలుకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




