చేతుల్తో పాలు పితికే ప్రతి పాడి రైతు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి..
గేదె నుంచి పాలు పితికడం రోజువారీ పని అయినా.. సరైన పద్ధతి పాటించకపోతే పాల దిగుబడి తగ్గడమే కాదు, పశువుల ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడుతుంది. కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే నాణ్యమైన పాలు, మంచి ఆదాయం సాధ్యమే. .. ..

గేదెల నుంచి పాలు తీయడం పాడి రైతుల దైనందిన జీవితంలో కీలకమైన భాగం. అయితే, ఈ సాధారణంగా కనిపించే పనిలోనే కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించకపోతే… పాలు తగ్గిపోవడం, పొదుగువాపు వంటి సమస్యలు రావడం సాధారణమే. అందుకే, సరైన పద్ధతిలో పాలు పితికడం ఎంత ముఖ్యమో తెలుసుకోవాలి.
పాలు పితికే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పాలు పితికే ముందు గేదెను ప్రశాంతంగా ఉంచడం అత్యంత అవసరం. ఒత్తిడి లేకపోతేనే పాలు సరిగా ఊరుతాయి. దీనికి కారణం ఆక్సిటోసిన్ హార్మోన్. దూడను 1–2 నిమిషాల పాటు గేదె దగ్గరకు వదిలితే ఈ హార్మోన్ విడుదలై పాలు సులభంగా దిగుతాయి. అలాగే పాలు పితికే వ్యక్తి చేతులు, ఉపయోగించే పాత్రలు పూర్తిగా పరిశుభ్రంగా ఉండాలి. మొదటి కొన్ని చుక్కల పాలను వేరుగా పారబోసడం మంచిది.
పరిశుభ్రతే పాల నాణ్యతకు పునాది
పాలు పితికే ముందు పొదుగును శుభ్రంగా తుడవాలి. మురికి ఉండటం వల్ల బ్యాక్టీరియా పెరిగి పొదుగువాపు (మాస్టైటిస్) వచ్చే ప్రమాదం ఉంటుంది. శుభ్రమైన స్టీల్ పాత్రలోనే పాలు పితకాలి. మంచి పాలు చిక్కగా, స్వచ్ఛంగా, ఎటువంటి దుర్వాసన లేకుండా ఉండాలి. ఇవే పాల నాణ్యతకు సూచనలు.
పాలు పితికే సరైన విధానం
పాలు పితికేటప్పుడు గట్టిగా లాగడం, తొందరపడడం తప్పు. మొత్తం వేళ్లతో నెమ్మదిగా, ఒకే రిథమ్‌లో పిండాలి. ఈ విధంగా పాలు పితికితే పశువుకు నొప్పి ఉండదు, అలాగే పాలు పూర్తిగా దిగుతాయి. చివర్లో మిగిలిన పాలను కూడా పూర్తిగా పిండడం అవసరం. ఇది పొదుగులో పాలు నిల్వ ఉండకుండా కాపాడుతుంది.
ముర్రా జాతి గేదెల ప్రాముఖ్యత
ముర్రా జాతి గేదెలు అధిక పాల దిగుబడికి ప్రసిద్ధి. వీటి పాలలో ఫ్యాట్ శాతం ఎక్కువగా ఉంటుంది. అయితే, గేదె ఎన్ని పాలు ఇస్తుందనేది కేవలం జాతిపైనే కాదు… దానికి ఇచ్చే మేత, సంరక్షణ, వాతావరణంపై కూడా ఆధారపడి ఉంటుంది.
స్థానిక పరిస్థితులకు తగిన జాతి ఎంపిక
గ్రామీణ ప్రాంతాల్లో ఈగలు, దోమలు ఎక్కువగా ఉండటం వల్ల స్థానిక లేదా సంకర జాతి గేదెలను పెంచడం సులభం. ఇవి వాతావరణానికి త్వరగా అలవాటు పడతాయి, వ్యాధులను కూడా బాగా తట్టుకుంటాయి.
పాలు పితికిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పాలు పితికిన వెంటనే పొదుగుకు యాంటీసెప్టిక్ ద్రావణం ఉపయోగించడం మంచిది. ఇది ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. పాలు కింద పడకుండా జాగ్రత్తపడాలి. పాలు పడిన చోట గేదె పడుకుంటే బ్యాక్టీరియా వల్ల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే ప్రతిరోజూ ఒకే సమయానికి పాలు పితకడం ద్వారా మంచి దిగుబడి పొందవచ్చు.
పాలు పితికే ప్రక్రియలో చిన్న మార్పులు.. పెద్ద లాభాలను తీసుకువస్తాయి. సరైన పద్ధతులు పాటిస్తే గేదెల ఆరోగ్యం మెరుగుపడటమే కాదు, పాల నాణ్యత కూడా పెరిగి రైతుకు ఆదాయం పెరుగుతుంది.
