Vijayasaireddy Complaint: చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు… ఎంపీ విజయసాయి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో…
రామతీర్థం ఘటన నేపథ్యంలో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైంది. ఎంపీ విజయసాయి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు...
Vijayasaireddy Complaint: రామతీర్థం ఘటన నేపథ్యంలో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైంది. ఎంపీ విజయసాయి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబుతో పాటు తెదేపా నేతలు కళావెంకట్రావు, అచ్చెన్నాయుడుపై విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. విజయనగరంలో జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్థంలో బోడికొండపై ఉన్న పురాతన కోదండరాముడి విగ్రహ శిరస్సును కొందరు దుండగులు ఇటీవల తొలగించిన సంగతి తెలిసిందే. అయితే సమీపంలో ఉన్న కోనేటిలో రాముడి శిరస్సు లభించింది. దీంతో నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ భాజపాతో పాటు రామభక్తులు అక్కడ నిరసనలు చేపట్టారు.
ఈనేపథ్యంలో రామతీర్థాన్ని పరిశీలించేందుకు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు వస్తానని తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఇంతలోనే వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి శనివారం ఉదయం 11 గంటలకు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి క్షేత్రానికి వెళ్లారు. మరోవైపు చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. అనేక నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు చంద్రబాబు రామతీర్థం చేరుకున్నారు.
అయితే విజయసాయి రెడ్డి కొండపై సంఘటన స్థలాన్ని పరిశీలించి కిందకు దిగి వస్తుండగా, ఆయన వాహనంపై కొందరు రాళ్లు, చెప్పులు, మంచినీళ్ల పొట్లాలు విసిరారు. వైకాపా, తెదేపా, భాజపా కార్యకర్తలు భారీ ఎత్తున రామతీర్థం చేరుకోవడంతో పలువురి మధ్య తోపులాట చోటుచేసుకుంది. తనపై దాడిని నిరసిస్తూ విజయసాయిరెడ్డి గొర్లెపేట వరకు పాదయాత్ర చేపట్టారు. అయితే రాజకీయ ఉద్దేశ్యంతో తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని విజయసాయి రెడ్డి ఆరోపిస్తూ చంద్రబాబు, ఇతర నేతలపై ఫిర్యాదు చేశారు.