Vijayanagaram: కనులు కనులను దోచాయంటే సినిమా స్టైల్‌లో దొంగతనాలకు దిగిన ప్రేమజంట
విలాసవంతమైన జీవనశైలికి అలవాటుపడి అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రేమజంట చివరకు దొంగతనాలకు పాల్పడి పోలీసుల వలలో చిక్కింది. ఉద్యోగాలు ఉన్నప్పటికీ ఖర్చులు జీతాలను మించడంతో నేరబాట పట్టిన ఈ దంపతులు… దేశవ్యాప్తంగా తిరుగుతూ తప్పించుకునే ప్రయత్నం చేసినా చివరకు భువనేశ్వర్‌లో పట్టుబడ్డారు.

విలాసాలకు అప్పులు చేసి పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో మునిగి దొంగతనాలకు దిగింది ఓ ప్రేమ జంట. ఉద్యోగాలు ఉన్నప్పటికీ విలాసాలకు జీతాలు సరిపోకపోవడంతో దొంగతనానికి పాల్పడిన దంపతులు చివరకు పోలీస్ వలకు చిక్కారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు మకాం మారుస్తూ తప్పించుకునే ప్రయత్నంలో చివరకు భువనేశ్వర్‌లో అడ్డంగా దొరికిపోయారు. విజయనగరం జిల్లాలో జరిగిన ఓ ప్రేమజంట నేర ప్రవృత్తి కలకలం రేపుతుంది. బాపట్ల జిల్లా చీరాల మండలం వైకుంఠపురం గ్రామానికి చెందిన దుడ్ల బాలాజీ అనే యువకుడు గతేడాది ఉపాధి కోసం రాజాం వచ్చి ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిగా చేరాడు. అప్పటికే అదే సంస్థలో పనిచేస్తున్న రేగిడి మండలం బాలకవివలస గ్రామానికి చెందిన డోల గాయత్రితో పనిచేస్తున్న సంస్థలోనే పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులకు పరిచయం ప్రేమ వివాహంగా మారింది. పెళ్లి అనంతరం ఇద్దరూ బాలకవివలస గ్రామంలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే స్తోమతను మించి విలాసవంతమైన జీవనం కోసం అప్పులు చేశారు. అలా కాలక్రమేణా ఆర్థిక సమస్యలు తీవ్రమయ్యాయి. దంపతులకు వచ్చే జీతాలు సరిపోకపోవడంతో అప్పుల భారం పెరిగింది. ఈ పరిస్థితుల్లో గతేడాది డిసెంబరు 4న అదే గ్రామానికి చెందిన కిలారి కమల అనే మహిళ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. అలా ఇంట్లో ఉన్న 13 తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. అనంతరం చోరీ చేసిన బంగారంలో కొంత భాగాన్ని బాపట్ల జిల్లా చీరాలలో విక్రయించగా, మరికొంతను శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని ఓ ఫైనాన్స్ సంస్థలో రూ.11 లక్షలకు కుదువ పెట్టారు. తరువాత ఆ మొత్తంతో సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల వరకు అప్పులు తీర్చారు. మిగిలిన డబ్బుతో గ్రామాన్ని విడిచి పారిపోయారు. అలా గ్రామం విడిచి ఢిల్లీకి వెళ్లి స్థిరపడాలనే ఉద్దేశంతో ముందుగా హైదరాబాద్, అక్కడి నుంచి గోవా వెళ్లారు. అక్కడ జీవనోపాధి మార్గాలు దొరకకపోవడంతో చివరకు భువనేశ్వర్‌లో మకాం వేశారు. అయితే తన ఇంట్లో బంగారం పోయిందని బాధితురాలు కమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తరువాత నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. క్రైం సిబ్బంది సహకారంతో హైదరాబాద్, గోవా, భువనేశ్వర్ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల కదలికలను భువనేశ్వర్‌లో గుర్తించిన పోలీసులు అక్కడి పోలీసుల సహకారంతో బాలాజీ, గాయత్రిలను అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి లక్ష నగదు, తన నాలుగు నెలల బిడ్డ కోసం కొనుగోలు చేసిన బంగారు చైన్ తో పాటు నిందితులు ఉపయోగించిన రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కుదువ పెట్టిన బంగారాన్ని ఇంకా రికవరీ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. అయితే నిందితులపై గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని, గాయత్రి గతంలో కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో చిన్నపాటి చోరీలు చేసి తిరిగి వాటిని ఇచ్చే అలవాటు ఉండేదని సీఐ వెల్లడించారు. కమల ఇంట్లో దొంగతనం అనంతరం గ్రామం విడిచి వెళ్లడంతో అనుమానం బలపడిందని తెలిపారు. ఈ కేసును సమర్థంగా ఛేదించిన రేగిడి ఎస్ఐ బాలకృష్ణతో పాటు క్రైం సిబ్బందిని సీఐ ఉపేంద్రరావు అభినందించారు.
