బంగారం కొనేవారికి అలర్ట్.. ఈ కారణాలతో మళ్లీ భారీగా పెరగనున్న గోల్డ్ ధరలు..
Gold Price: ప్రపంచ రాజకీయ ముఖచిత్రంపై వెనిజులా సంక్షోభం పెను సంచలనం సృష్టిస్తోంది. వెనిజులాపై అమెరికా దాడులతో అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ఈ ప్రభావంతో బంగారం ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరే అవకాశాలు లేకపోలేదు. కేవలం ఒక్క ఏడాదిలోనే 70% లాభాలను పంచిన బంగారం, ఈ ఏడాది మరిన్ని రికార్డులను తిరగరాయనుందా? ధరల పెరుగుదలకు కారణమవుతున్న ఆ 5 కీలక అంశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రపంచ రాజకీయ యవనికపై అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వెనిజులాపై అమెరికా సైనిక దాడుల తర్వాత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఈ అనిశ్చితి మధ్య పెట్టుబడిదారులు మళ్లీ సురక్షిత స్వర్గంగా భావించే బంగారం వైపు పరుగులు తీస్తున్నారు. 2025లో ఏకంగా 70శాతం లాభాలను పంచిన పసిడి, 1979 తర్వాత అత్యుత్తమ వార్షిక పనితీరును కనబరిచింది. ఇప్పుడు 2026 ప్రారంభంలో కూడా అదే జోరు కనిపిస్తోంది. ఈ సోమవారం బంగారం ధరలను ప్రభావితం చేసే 5 ప్రధాన కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వెనిజులాలోని భారీ బంగారు నిల్వలు
దక్షిణ అమెరికాలో వెనిజులా అత్యధిక బంగారు నిల్వలను కలిగి ఉంది. అక్కడ సుమారు 161 మెట్రిక్ టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా.. దీని విలువ దాదాపు 22 బిలియన్ డాలర్లు. ఇప్పుడు అక్కడ యుద్ధ వాతావరణం నెలకొనడంతో సరఫరా గొలుసు దెబ్బతినే అవకాశం ఉంది. ఇది ప్రపంచ మార్కెట్‌లో పసిడి కొరతకు దారితీసి ధరలను పెంచవచ్చు.
ముడి చమురు సెగ.. పెరుగుతున్న అనిశ్చితి
ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 61 డాలర్ల కంటే తక్కువగా ఉన్నప్పటికీ, వెనిజులా సంక్షోభం, OPEC దేశాల్లో నెలకొన్న టెన్షన్లు మార్కెట్‌ను కలవరపెడుతున్నాయి. ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు సహజంగానే ద్రవ్యోల్బణానికి దారితీస్తాయి. ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి పెట్టుబడిదారులు బంగారంపై మొగ్గు చూపుతారు.
బంగారం-వెండి నిష్పత్తి
ప్రస్తుతం బంగారం-వెండి నిష్పత్తి 60కి చేరుకుంది. దీని అర్థం వెండి కొనుగోళ్లు ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరాయని, ఇకపై బంగారం బలపడటానికి ఎక్కువ అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిష్పత్తి ఆధారంగా పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను వెండి నుంచి బంగారం వైపు మళ్లించే అవకాశం ఉంది.
రంగంలోకి డిజిటల్ దిగ్గజాలు
క్రిప్టో దిగ్గజం టెథర్ తన నిల్వల్లో ఏకంగా 100 టన్నులకు పైగా బంగారాన్ని చేర్చుకుంది. ఒక పెద్ద సంస్థ ఇంత భారీ స్థాయిలో బంగారాన్ని కొనుగోలు చేయడం అంటే భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరుగుతాయని వారు అంచనా వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇది మార్కెట్‌లో బుల్లిష్ సెంటిమెంట్‌ను పెంచుతోంది.
బలహీనపడుతున్న రూపాయి
భారతీయ పెట్టుబడిదారులకు రూపాయి విలువ పతనం మరో శాపంగా మారింది. 2025లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 5శాతం క్షీణించింది. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో పాటు రూపాయి బలహీనపడటం వల్ల భారత్‌లో పసిడి ధరలు సామాన్యులకు మరింత భారంగా మారుతున్నాయి. భౌగోళిక ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే, ఈ ఏడాది కూడా బంగారం కొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




