Polavaram project: 2025 జూన్ నాటికి పోలవరం పూర్తి చేయాలి.. కీలక సూచన చేసిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ..
ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును వచ్చే జూన్ నాటికి పూర్తి చేసేందుకు కృషి చేయాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ సూచించింది. పోలవరం ప్రాజెక్టు పనులు, పురోగతిపై ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది.
పోలవరం ప్రాజెక్టుపై భౌతిక, ఆర్థిక పురోగతిపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సమీక్ష నిర్వహించింది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ అధ్యక్షతన ఢిల్లీలోని శ్రమ్ శక్తి భవన్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చర్చించేందుకు ఆరు అంశాలతో అజెండా రూపొందించారు. సవరించిన అంచనాలు, పునరావాసం, నష్టపరిహారంపై ఈ సమావేశం ప్రధానంగా చర్చించింది. ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ సహ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అడహాక్ నిధుల కింద 17414 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి పరిశీలిస్తామని జలశక్తి మంత్రిత్వశాఖ తెలిపింది. ఇటీవల ముఖ్యమంత్రి జగన్ – జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ను కలిసి తర్వాత నిధులకు సంబంధించి నిర్ణయాలు వేగవంతమయ్యాయని ఏపీ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు ఎప్పటి లోపు పూర్తవుతుందనే విషయమై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. 2025 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఏపీ ప్రభుత్వానికి సూచించింది.
ప్రాజెక్టుకు సంబంధించిన మిగిలిపోయిన సివిల్ పనులు, కాఫర్ డ్యామ్ దిద్దుబాటు చర్యలు సహ వివిధ పనులకు సంబంధించి స్పష్టమైన కార్యాచరణ అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ముంపునకు సంబంధించి ఒడిషా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ లేవనెత్తిన అంశాల స్టేటస్‌ను ఈ సమావేశం సమీక్షించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం