Visakhapatnam: ఇంట్లో పనిచేస్తున్నారని ఇంటి తాళాలు ఇస్తే.. ఉన్నదంతా ఊడ్చేసారు.. పోలీసుల ఎంట్రీతో మారిపోయిన సీన్..
ఇంట్లో పని చేస్తున్న వారి పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా తీయ్యగా మాట్లాడుతూ.. నమ్మకంగా ఉండాలని ప్రయత్నించే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి కదలికలపై నిఘా ఉంచాలి. అవసరమైతే...
ఇంట్లో పని చేస్తున్న వారి పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా తీయ్యగా మాట్లాడుతూ.. నమ్మకంగా ఉండాలని ప్రయత్నించే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి కదలికలపై నిఘా ఉంచాలి. అవసరమైతే ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. లేకుండా ఉంటే ఇలాంటి ఘటనలే జరుగుతాయి. విశాఖపట్నానికి చెందిన ఓ మహిళ.. ఆరోగ్యం బాగా లేకపోవడంతో సహాయంగా ఉంటారని ఇద్దరు మహిళలను పనిలో పెట్టుకున్నారు. వారు కూడా ఆమెతో సన్నిహితంగా ఉంటూ నమ్మకాన్ని కలిగించారు. ఎంతగా అంటే.. వారికే ఇంటి తాళాలు ఇచ్చి వెళ్లేంతగా.. దీన్నే అవకాశంగా మలుచుకున్న ఆ కిలేడీలో ఇంట్లోని బీరువాలో ఉన్నదంతా ఊడ్చేశారు. బాధితురాలు వచ్చి చూసే సరికి బీరువాలో నగలు లేవు. దీంతో ఏమీ చేయాలో తెలియక పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు తమదైన స్టైల్ లో విచారణ చేపట్టగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. విశాఖపట్నంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.
నగరంలోని పీఎంపాలెం ఎంవీవీ సిటీ అపార్టెమెంట్స్ లో నివాసముంటున్న పూర్ణిమ.. నగరంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆమెకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. దీంతో ఇంట్లో పనులు చేసేందుకు ఇద్దరు మహిళలను నియమించుకున్నారు. అన్ని వారికే అప్పగించారు. అంతే కాకుండా స్కూల్ కు వెళ్లే సమయంలోనూ ఇంటి తాళాలు వారికే ఇచ్చి వెళ్లేవారు. దీన్ని అవకాశంగా తీసుకున్న చంద్రకళ, జ్యోతి.. బెడ్‌రూంలోని బీరువా లాకర్‌ను తెరిచారు. అనుమానం రాకుండా విడతల వారీగా దాదాపు 94 తులాల బంగారం, రూ.50వేల నగదు కొట్టేశారు. ఈనెల 13న పూర్ణిమ బీరువాలో నగలను పరిశీలించగా ఆమెకు అవి కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఇంట్లో పని చేస్తున్న చంద్రకళ, జ్యోతిలపై అనుమానం వ్యక్తం చేశారు. వారి కదిలికలపై నిఘా ఉంచారు. ఈ క్రమంలో వీరే నగలు దొంగిలించినట్లుగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పూర్ణిమ ఇంట్లో నగలు దొంగతనం చేసిన చంద్రకళ, జ్యోతిలు వేరు వేరు వ్యక్తులకు అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. విజయనగరానికి భాస్కరరావుకు 37 తులాలు, విశాఖ కురుపాం మార్కెట్‌కు చెందిన వెంకటత్రినాథ గుప్తా కు మరో 37 తులాలు, చంద్రకళ, జ్యోతి వద్ద 128 గ్రాముల బంగారం ఉంచుకున్నారు. దీంతో పోలీసులు వెంటనే నలుగురినీ అదుపులోకి తీసుకున్నారు. కేసును ఛేదించిన క్రైమ్ బృందాన్ని సీపీ అభినందించారు. ఇంట్లో పని చేసే వారి పట్ల యజమానులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..