Andhra Pradesh: లెక్చరర్ పై కత్తితో దాడి.. విద్యార్థులు చూస్తుండగానే దారుణం.. అదే కారణమా.. ?
కడ దాకా కలిసి ఉంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భర్తే.. భార్యను కడ తేర్చేందుకు ప్రయత్నించాడు. ఆమెపై కత్తితో దాడి చేశాడు. అనంతపురం నగరంలో దారుణం జరిగింది. ఆర్ట్స్ కళాశాలలో కామర్స్ బోధిస్తున్న..
కడ దాకా కలిసి ఉంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భర్తే.. భార్యను కడ తేర్చేందుకు ప్రయత్నించాడు. ఆమెపై కత్తితో దాడి చేశాడు. అనంతపురం నగరంలో దారుణం జరిగింది. ఆర్ట్స్ కళాశాలలో కామర్స్ బోధిస్తున్న ప్రొఫెసర్ సుమంగళిపై హత్యాయత్నం జరిగింది. ఆమె భర్తే ఈ దాడికి పాల్పడడం గమనార్హం. సుమంగళి కాలేజ్ లో లెక్చర్ ఇస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆమె భర్త క్లాస్ రూమ్ లో దూసుకువచ్చాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో లెక్చరర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన యాజమాన్యం చికిత్స అందించేందుకు సుమంగళిని ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన అనంతపురం ప్రభుత్వాసుపత్రి వైద్యులు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు చెప్పారు. భార్యా భర్తల మధ్య జరుగుతున్న గొడవలు, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యల కారణంగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా.. సుమంగళి ఏడాది క్రితం ఆర్ట్స్ కళాశాలకు బదిలీపై వచ్చారు. 20 ఏళ్లుగా గుంటూరులో లెక్చరర్ గా పనిచేసిన సుమంగళి గతేడాది ట్రాన్స్ఫర్ అయ్యారు. ప్రస్తుతం అనంతపురంలోని శ్రీనివాస్ నగర్ లో నివాసం ఉంటున్నారు. కొన్ని రోజులుగా సుమంగళి తన భర్త తో దూరంగా ఉంటున్నట్లు స్థానికులు, కుటుంబసభ్యులు చెబుతున్నారు. తనపై అనుమానంతోనే భర్త హత్యాయత్నం చేసినట్టు బాధితురాలు సుమంగళి పేర్కొన్నారు. సమాచారం అందుకు పోలీసులు ఆసుపత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. దాడికి పాల్పడిన భర్త కోసం గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే నిందితున్ని పట్టుకుంటామని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కాలేజీలో ఈ ఘటన జరగడంతో విద్యార్థులు భయంతో వణికిపోయారు. కేకలు వేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు పేరేంట్స్.. ఇలాంటి ఘటనలు కాలేజీలో జరగకుండా చూడాలని కోరుతున్నారు. కాలేజీలో ఎవరిని అనుమతించకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే వివాహేతర సంబంధాల నేపథ్యంలోనే ఈ దాడి ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..