AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటికి చేరే లోపే మృత్యు ఒడికి చేరారు.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ఆమె నిండు గర్భిణి. కాన్పు కోసం ఇంటికి తీసుకెళ్లేందుకు అక్క వస్తున్నానని చెప్పడంతో ఆమెలో ఆనందం రెట్టింపైంది. పుట్టింటికి వెళ్తున్నానని సంతోషంలో మునిగిపోయింది. బస్సు దిగిన భార్య సోదరిని..

ఇంటికి చేరే లోపే మృత్యు ఒడికి చేరారు.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
Road Accident
Ganesh Mudavath
|

Updated on: Feb 25, 2022 | 10:00 AM

Share

ఆమె నిండు గర్భిణి. కాన్పు కోసం ఇంటికి తీసుకెళ్లేందుకు అక్క వస్తున్నానని చెప్పడంతో ఆమెలో ఆనందం రెట్టింపైంది. పుట్టింటికి వెళ్తున్నానని సంతోషంలో మునిగిపోయింది. బస్సు దిగిన భార్య సోదరిని తీసుకువస్తానని భర్త బయల్దేరారు. ఇద్దరూ కలిసి బైక్ పై వస్తుండగా ఊహించని రోడ్డు ప్రమాదం వారి ప్రాణాలను బలి తీసుకుంది. వేగంగా వచ్చిన పాఠశాల బస్సు ఢీ కొని ఇద్దరూ మృత్యువాత పడ్డారు. ఘటనాస్థలంలోనే ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ఆస్పత్రికి తరలిస్తూ మార్గమధ్యలో మరొకరు తనువు చాలించారు. గాయాలతో విలవిల్లాడుతున్నా సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో నిండు ప్రాణాలు పోయాయని, స్థానికులు ఆవేదన చెందారు. విషయం తెలుసుకున్న మృతురాలి భర్త, మృతుడి భార్య రోదించిన తీరు కంటతడి పెట్టించింది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న బస్సు డ్రైవర్ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ప్రకాశం జిల్లా పామూరు మండలం బుక్కాపురం వద్ద గురువారం ఉదయం చోటుచేసుకున్న ఈ విషాద ఘటన అందరినీ కలచివేసింది.

నెల్లూరు జిల్లా జలదంకి మండలం అన్నవరం గ్రామానికి చెందిన కంచి విజయభాస్కర్‌రెడ్డి.. కంభంపాడు సమీపంలోని తెల్లరాయి క్రషర్‌ మిల్లులో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగ విధుల నిమిత్తం మిల్లు సమీపంలోని కోవిలంపాడులో నివాసముంటున్నారు. ఆయన భార్య వెంకటలక్ష్మి గర్భవతి కావడంతో ఆమెను కాన్పుకు తీసుకువెళ్లేందుకు విశాఖపట్నం పెదవాల్తేరులో ఉంటున్న వెంకటలక్ష్మి సోదరి వరలక్ష్మి పామూరుకు వచ్చారు. వరలక్ష్మిని తీసుకువచ్చేందుకు విజయభాస్కర్ బైక్ పై వెళ్లాడు. కోవిలంపాడుకు వరలక్ష్మిని తీసుకొస్తుండగా ప్రైవేట్‌ పాఠశాల బస్సు వీరి బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయభాస్కర్‌ అక్కడికక్కడే మృతి చెందారు. వరలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను పామూరు వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

మరోవైపు ప్రమాదంలో తీవ్ర గాయాలతో వరలక్ష్మి నడిరోడ్డుపై దాదాపు గంటపాటు విలవిల్లాడారు. స్థానికులు 108కు ఫోన్‌చేసినా వాహనాలు అందుబాటులో లేవు. ప్రైవేటు వాహనాలను ఆపినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో 22 కి.మీ. దూరంలో ఉన్న వరికుంటపాడు నుంచి 108 వచ్చి ఆమెను పామూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లింది. అప్పటికే ఆమె మృతిచెందింది. కాగా వరలక్ష్మి పెళ్లిరోజు గురువారమే కావడం విషాదం నింపింది. చెల్లెలిని ప్రసవానికి తీసుకొస్తానని వెళ్లిన భార్య.. రోడ్డు ప్రమాదం రూపంలో విగత జీవిగా మారిందని ఆమె భర్త రమణారెడ్డి కన్నీరుమున్నీరయ్యారు. భర్త, అక్క చనిపోవడంతో మృతదేహాలను చూస్తూ వెంకటలక్ష్మి రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.

Also Read

Egg Boiling: కోడిగుడ్లు ఉడకబెడుతున్నారా.. పగలకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Hyderabad crime: పిచ్చి పిచ్చిగా అరుపులు.. తర్వాత విగతజీవిగా.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఘటన

AP Jobs: ఏపీ వైద్య విధాన పరిషత్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 50 వేలకుపైగా జీతం పొందే అవకాశం.. నేడే చివరి తేదీ..