Andhra Pradesh: కుప్పిలి గ్రామదేవతల పండుగలో అపశృతి.. సిరిమాను విరిగి పడి ఇద్దరు దుర్మరణం..!
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలో అమ్మవారి సిరిమానోత్సవంలో అపశృతి దొర్లింది. గ్రామంలో మంగళవారం గ్రామ దేవత శ్రీ అసిరితల్లి, శ్రీబంగారమ్మ తల్లి సిరిమాను ఊరేగింపు జరుగుతుండగా సిరిమాను ఒక్కసారిగా విరిగిపోయింది.

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలో అమ్మవారి సిరిమానోత్సవంలో అపశృతి దొర్లింది. గ్రామంలో మంగళవారం గ్రామ దేవత శ్రీ అసిరితల్లి, శ్రీబంగారమ్మ తల్లి సిరిమాను ఊరేగింపు జరుగుతుండగా సిరిమాను ఒక్కసారిగా విరిగిపోయింది. సిరిమాను చిట్టచివర కూర్చున్న పూజారి దాదాపు 40 అడుగుల ఎత్తు నుండి కింద పడ్డారు. దీంతో కిందనున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులను బుడగట్లపాలేం గ్రామానికి చెందిన సూరాడ అప్పన్న (47), కారి పల్లేటి (50) గా గుర్తించారు పోలీసులు.
ఈ ఘటనలో సిరిమానుపై కూర్చున్న పూజారి తోపాటు మరికొంత మందికి గాయాలయ్యాయి. కాగా వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. జరిగిన ఘటనపై పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వారి మృతదేహాలను పోస్టమార్టం నిమిత్తం శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కి తరలించారు. అప్పన్న, పల్లేటి మృతితో బుడగట్ల పాలెం గ్రామంలో విషాదం నెలకొంది. భక్తులందరూ చూస్తుండగా ఎత్తులో ఉన్న సిరిమాను చివరి భాగం నుంచి పూజారి కిందపడటాన్ని చూసిన భక్తులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. పోలిసులు వెంటనే ఘటనాస్థలంలో గాయపడిన వారిని అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న స్ధానిక ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. జరిగిన సంఘటనను స్ధానిక నాయకులను, పోలీసులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు తమ సానుభూతిని వ్యక్తం చేసిన ఆయన, ప్రభుత్వం తరుపున ఆదుకుంటామన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
