AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD: టీటీడీ సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అనుబంధ ఆలయాల్లో ఉచితంగా అన్న ప్రసాదం

తిరుమల తరహాలో టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల్లో భక్తులకు అన్నప్రసాద వితరణను విస్తరించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 15 ఆలయాల్లో అందిస్తున్న అన్నప్రసాదాన్ని ఈ నెల 31 నుంచి మరో 19 ఆలయాలకు, 2026 ఫిబ్రవరి 28 నుంచి మిగిలిన 26 ఆలయాలకు విస్తరించనుంది.

TTD: టీటీడీ సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అనుబంధ ఆలయాల్లో ఉచితంగా అన్న ప్రసాదం
Tirumala Anna Prasadam
Raju M P R
| Edited By: Ram Naramaneni|

Updated on: Dec 01, 2025 | 8:37 PM

Share

తిరుమల తరహాలో టీటీడీ పరిధిలోని ఇతర ఆలయాల్లో కూడా భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టాలని టీటీడీ నిర్ణయించింది. మరింత రుచికరంగా, శుచిగా, నాణ్యతతో అన్నప్రసాదాలను అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఇటీవల టీటీడీలో జరుగుతున్న అభివృద్ధి పనులను సీఎం చంద్రబాబుకు నివేదించిన టీటీడీ చైర్మన్, ఈవోలకు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఇందులో భాగంగా తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈవో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం టీటీడీకి చెందిన 15 ఆలయాల్లో అన్నప్రసాదం అందిస్తుండగా, ఈ నెల 31 నుంచి మరో 19 ఆలయాల్లో కూడా అన్నప్రసాద వితరణ ప్రారంభించాలని ఆదేశించారు. మిగిలిన 26 ఆలయాల్లో 2026 ఫిబ్రవరి 28 నుంచి అన్నప్రసాదాల పంపిణీ ప్రారంభం కానుంది.

టీటీడీ అంచనా ప్రకారం ఇతర ఆలయాలకు సాధారణ రోజుల్లో రోజుకు 1500–2000 మంది భక్తులు, వారాంతాల్లో 10 వేల వరకు, పర్వదినాల్లో 25 వేల వరకు భక్తులు విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నప్రసాదాల పంపిణీని సమర్థవంతంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. అన్నప్రసాదాలు తయారు చేసే పోటు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఈవో ఆదేశించారు. ఇప్పటి వరకు ఆలయాల్లో పంపిణీ చేస్తున్న అన్నప్రసాదాలపై రోజు వారి నివేదికలు రూపొందించాలని కూడా సూచించారు.

టీటీడీలో ఎవరైనా అన్య మతస్తులు పనిచేస్తున్నారా అనే అంశంపై పూర్తి నివేదిక తయారు చేసి చర్యలు తీసుకోవాలని ఈవో ఆదేశించారు. అలాగే దేశవ్యాప్తంగా టీటీడీ పరిధిలోని చారిత్రక ఆలయాలకు ఎంత మంది అర్చకులు, వేదపారాయణ దారులు అవసరమో సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిధిలోని ప్రతి ఆలయానికి ఒక ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (SOP) రూపొందించి వచ్చే సమావేశానికి అందించాలని సూచించారు. టీటీడీ బోర్డు నిర్ణయం మేరకు పోటు వర్కర్ల పదవీ పేర్లను ‘ముఖ్య పాచిక’, ‘పాచిక’ పేర్లుగా మార్చే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖతో సమన్వయం చేయాలని ఈవో స్పష్టం చేశారు.

ఇక అర్బన్ డెవలప్‌మెంట్ సెల్‌ను బలోపేతం చేయడానికోసం అవసరమైన సిబ్బందితో క్రమబద్ధమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని చీఫ్ ఇంజనీర్‌కి ఆదేశించారు. అలాగే శ్రీనివాస కళ్యాణాలను తరచూ నిర్వహించేందుకు ముందుగానే “క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్” రూపొందించాలన్నారు. దీంతో భక్తులు ముందే సమాచారం తెలుసుకుని ఎక్కువ మంది పాల్గొనే అవకాశం ఉంటుందని అన్నారు.

అమరావతి ఆలయంపై ప్రత్యేక దృష్టి

అమరావతిలోని వెంకటపాలెం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ఆలయ విస్తరణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈవో ఆదేశించారు. 25 ఎకరాల్లో ఉన్న ఆలయంతో పాటు, నిర్మించనున్న కల్యాణకట్ట, అర్చకులు–సిబ్బంది క్వార్టర్స్, ప్రాకారం, గోపురాలు, పుష్కరిణి తదితర నిర్మాణాలపై పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.