Andhra Pradesh: కొత్త బట్టల్లో హీరోలా ఉన్నారని భర్తకు చెప్పింది.. ఆయన ఆఫీసుకు వెళ్లిన కాసేపటికే..
పెళ్లిరోజు ఉదయం అంతా సంతోషంగా ఉన్నా, జండూబామ్ కనిపించలేదని భర్త మందలించడంతో శిరీష తీవ్ర మనస్తాపం చెందింది. భర్త ఆఫీసుకు వెళ్లగానే వంటింట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఎంతకు తలుపులు తీయకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు తెరిచి చూసి షాక్ అయ్యారు..

అన్యోన్యంగా ఉన్న ఓ కుటుంబంలో పెళ్లిరోజు నాడే తీరని విషాదం చోటుచేసుకుంది. భర్త చిన్నపాటి మందలింపుతో మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దయనీయ ఘటన అనపర్తిలో జరిగింది. ధవళేశ్వరంకు చెందిన శిరీష, రాజమహేంద్రవరానికి చెందిన సంతోష్‌కుమార్ ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక బాబు ఉన్నారు. సంతోష్‌కుమార్ ప్రైవేట్ ఉద్యోగి కాగా వీరు గత నాలుగేళ్లుగా అనపర్తిలో ఉంటున్నారు. సంతోష్‌కుమార్ తల్లి కూడా వీరితోనే కొన్ని నెలలుగా నివసిస్తున్నారు.
పెళ్లిరోజు సంబరం.. చిన్నపాటి గొడవ
పెళ్లిరోజు కావడంతో శిరీష ఉదయం నుంచి చాలా సంతోషంగా ఉన్నారు. భర్త స్టేటస్‌కు ప్రేమగా బదులిచ్చారు. ఆఫీసులో ప్రత్యేక కార్యక్రమం ఉందంటే, భర్తకు స్వయంగా కొత్త దుస్తులు ఇస్త్రీ చేసి ఇచ్చి.. హీరోలా ఉన్నారు అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. పిల్లలను బడికి పంపించారు. అంతా సవ్యంగానే ఉంది. అయితే జండూబామ్ కనిపించకపోవడంతో భర్త సంతోష్‌కుమార్ శిరీషను కాస్త మందలించి ఉద్యోగానికి వెళ్లిపోయాడు. ఆ చిన్న మాటకు శిరీష తీవ్ర మనస్తాపం చెందారు.
భర్త వెళ్లిన వెంటనే వంటింట్లోకి వెళ్లి శిరీష తలుపులు వేసుకుంది. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన అత్త.. స్థానికుల సాయంతో తలుపులు తెరిచి చూడగా, శిరీష ఉరికి వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తమ కూతురు ఆత్మహత్యకు భర్త, అత్త, ఆడపడుచుల వేధింపులే కారణమని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముచ్చటైన కుటుంబంలో పెళ్లిరోజు నాడే ఈ విషాదం చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..




