శ్రీవారి దర్శనంలో పెద్ద మార్పు.. సిఫారసు లేఖలకు గుడ్‌బై! టీటీడీ కీలక నిర్ణయాలు
Tirumala Tirupati Devasthanam: తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ పాలకమండలి సమావేశం చైర్మన్ బి.ఆర్. నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో 82 అంశాలపై చర్చించి, వేసవిలో భక్తులకు త్వరిత దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

తిరుమల అన్నమయ్య భవనంలో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పాలకమండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బోర్డు సభ్యులతో పాటు ఈవో ముద్దాడ రవిచంద్ర అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం బోర్డు నిర్ణయాలను వెల్లడించిన టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు.. 82 అంశాలపై చర్చించినట్లు తెలిపారు. వేసవిలో ఏర్పాట్లు, భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తిరుమలలో వీధులకు పేర్లు మార్పు చేస్తామని ఈ మేరకు 51 పేర్లు నిర్ణయించామన్నారు.
తిరుమలలోని ఆళ్వార్ ట్యాంక్ కూడలి నుంచి బాలగంగమ్మ కూడలి వరకు టాయిలెట్సె నిర్మాణానికి రూ 4.54 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు స్పష్టం చేశారు. గోగర్భం డ్యామ్ నుంచి ఫిల్టర్ హౌస్ వరకు రూ 6 కోట్లతో పైప్ లైన్లు, రూ 44.2 కోట్లతో ఏపీకి చెందిన ఆప్కో, తమిళనాడుకు చెందిన కోఆపటెక్స్ సంస్థల నుంచి పట్టువస్త్రాలు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ చెప్పారు.
తిరుమలలో వరాహస్వామి విశ్రాంతి భవనం ఆధునీకరణ కు రూ 3.6 కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలోని శ్రీవారి ఆలయంలో నూతన మండపాల నిర్మాణానికి రూ 36.9 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పష్టం చేశారు. ఖమ్మంలో తెలంగాణ ప్రభుత్వం టీటీడీకి కేటాయించిన 20 ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాం. రాతి రథమండపం పై చర్చించాం త్వరలో నిర్ణయం ప్రకటిస్తామన్నారు టీటీడీ ఛైర్మన్.
టీటీడీ బోర్డు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే…
- పట్టు వస్త్రాలు, శాలువాలు ఏపీ లోని ఆప్కో, తమిళనాడులోని కోఆప్టెక్స్ నుంచి కొనుగోలు.
- అలిపిరి టోల్గేట్‌లో వాహనాల రద్దీని నియంత్రించేందుకు బస్సుల తనిఖీ కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు.
- కోయంబత్తూరులోని G స్క్వయర్ ఇచ్చిన భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడం.
- టీటీడీ ఆస్థాన విధ్వంసరాలుగా శోభారాజ్‌ను నియమించాలని నిర్ణయం.
- తిరుమలలో నూతన పరిపాలన భవనం నిర్ణయానికి ఆమోదం.
- టిటిడిలో పనిచేసే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఐడి కార్డు, దర్శనం, లడ్డు కార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.
- టీటీడీ హెల్త్ స్కీమ్ పరిమితి రూ. 5 లక్షలకు పెంపు.
- టీటీడీ ఉద్యోగులకు ఇచ్చిన ఇంటి స్థలాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు కమిటీ.
- నెలరోజుల్లో కొలిక్కి రానున్న అలిపిరి వద్ద ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణం.
- వేసవిలో తిరుమల కొచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు.
- మే ఒకటి నుంచి జూలై 15 వరకు వీఐపీ సిఫారసు లేఖలను రద్దు చేసిన టీటీడీ.
