Tirumala: ఇకపై మరింత రుచిగా, నాణ్యతగా తిరుమల శ్రీవారి లడ్డూ…

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కర్ణాటక ప్రభుత్వ ‘నందిని’ బ్రాండ్‌ నెయ్యి సరఫరా మళ్లీ ప్రారంభమైంది. ఇటీవల 350 టన్నుల నెయ్యి సరఫరా చేయాలని టీటీడీ కోరడంతో సరఫరాను మళ్లీ ప్రారంభించామని కర్ణాటక పాల సమాఖ్య అధికారులు తెలిపారు. ఈ మేరకు తిరుమల లడ్డూ కోసం నందిని నెయ్యి వాడకాన్ని అధికారికంగా ప్రారంభించింది టీటీడీ.

Tirumala: ఇకపై మరింత రుచిగా, నాణ్యతగా తిరుమల శ్రీవారి లడ్డూ...
Tirumala Laddu
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 04, 2024 | 4:12 PM

తిరుమల శ్రీవారి భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డు మరింత రుచి, వాసన, నాణ్యత పెరగబోతుంది.  తిరుమల శ్రీవారి భక్తులకు ఇచ్చే లడ్డు ప్రసాదంలో నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు టీటీడీ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.  లడ్డు ప్రసాదాల నాణ్యతపై భక్తుల నుంచి వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు శ్రీవారి లడ్డు ప్రసాదాలకు  కర్ణాటక ప్రభుత్వ నందిని నెయ్యి వాడకాన్ని అధికారికంగా ప్రారంభించారు. నిత్యం తిరుమలలో భక్తులకు దాదాపు మూడున్నర లక్షల లడ్డూలను ప్రసాదంగా జారీ చేస్తున్న టిటిడి లడ్డు ప్రసాదంలో నాణ్యతను పరిశీలించి ప్రమాణాలు పెంచాలని ఈ మధ్యనే నిర్ణయించింది. ఈ మేరకు నియమించిన సురేందర్ రెడ్డి కమిటీ ఇచ్చిన నివేదిక చర్యలు చేపట్టింది. లడ్డు ప్రసాదాలలో వినియోగించే నెయ్యిలో నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు శ్రీకారం చుట్టింది. నెయ్యి వాడకంలో నాణ్యత లేదని నివేదిక స్పష్టం చేయడంతో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు చెందిన నందిని నెయ్యిని కొనుగోలుకు టీటీడీ ఒప్పందం చేసుకుంది. ఇటీవల 350 టన్నుల నెయ్యి సరఫరా చేయాలని టిటిడి కోరడంతో సరఫరాను మళ్లీ ప్రారంభించామని కర్ణాటక పాల సమాఖ్య అధికారులు తెలిపారు.

నెయ్యిలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్న సంస్థగా నందిని డెయిరీకి గుర్తింపు ఉండటంతో టిటిడి ఈ నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని మిల్క్ టెస్టింగ్ ల్యాబ్ ద్వారా నందిని సంస్థ తయారు చేస్తున్న నెయ్యిలో నాణ్యతను పరీక్షించిన టిటిడి.. ఆ నెయ్యినే లడ్డు తయారీ చేయాలని నిర్ణయించింది. భవిష్యత్తులో దేశంలోని అన్ని టీటీడీ ఆలయాల్లో లడ్డు ప్రసాదాలను భక్తులకు అందించేలా చర్యలు తీసుకున్న టిటిడి లడ్డు ప్రసాదాల తయారీకి.. అధికారికంగా నందిని నెయ్యిని వినియోగిస్తున్నట్లు ప్రకటించింది.

నెయ్యి సరఫరా ట్యాంకర్‌లను ప్రారంభించిన ఈవో శ్యామల రావు తిరుమలలో ప్రక్షాళనలో భాగంగా లడ్డు తయారీ నాణ్యమైన నెయ్యిని వినియోగించేలా చర్యలు చేపట్టారు. టిటిడిలో నెయ్యిపై వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నెయ్యి సప్లైలో క్వాలిటీ లేకపోవడంతో లడ్డూ నాణ్యత కొరవడినట్లు గుర్తించామన్నారు. టెండర్ దారులను హెచ్చరించినా తీరు మార్చు కోకపోవడంతోనే కొత్త టెండర్లను తీసుకున్నామన్నారు. ల్యాబ్ టెస్టింగ్ చేసి నందిని నెయ్యిని క్వాలీటీ పరీక్షించినట్లు వివరించారు. నాణ్యమైన నెయ్యి వల్ల లడ్డూ నాణ్యత పెరుగుతుందన్నారు ఈఓ. ఇక ఆధార్ కార్డు ద్వారా లడ్డూలు ఇవ్వడం వల్ల ప్రతి భక్తుడికి స్వామి వారి లడ్డూ అందుతుందన్నారు. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని భక్తులకు స్థానిక ఆలయాల్లో లడ్డూ వితరణ చేస్తున్నామన్నారు టిటిడి ఇఓ శ్యామలరావు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..