APSRTC: ఉచిత బస్సుల్లో ప్రయాణిస్తున్నారా..? రెప్పపాటు నిర్లక్ష్యంగా ఉన్నా మీకు నష్టమే..
స్త్రీ శక్తి పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆర్టీసీ బస్సుల్లో కల్పిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది. దీనిని దొంగలు ఆసరాగా తీసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. దీంతో పోలీసులు అలర్ట్ చేశారు.

ఏపీలో ఇప్పుడు బస్సుల్లో ప్రయాణం కిక్కిరిసిన ప్రయాణికులతో సాగుతుంది. ఫ్రీ బస్సు స్కీంను సద్వినియోగం చేసుకుంటున్న మహిళా ప్రయాణికులతో రద్దీ కొనసాగుతోంది. ఇది అదునుగా చేసుకున్న కొందరు మహిళా దొంగలు ప్రయాణికులను టార్గెట్ చేస్తున్నారు. రెచ్చిపోతున్న లేడీ గ్యాంగ్స్ మహిళా ప్రయాణికుల హ్యాండ్ బ్యాగ్స్ చోరీకి పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే జరుగుతున్న చోరీల పట్ల తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులు జర భద్రం అంటోంది. మహిళా ప్రయాణికులను టార్గెట్ చేసిన లేడీ గ్యాంగ్స్ పట్ల అలర్ట్ గా ఉండాలని హెచ్చరిస్తోంది. రద్దీగా ఉండే బస్సుల్లో ప్రయాణికులుగా బస్సులెక్కి చోరీలకు పాల్పడుతున్న లేడీ దొంగల ముఠాలు ఉన్నాయి జాగ్రత్త అంటుంది. వివరాల్లోకెళ్తే..
చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురు మహిళా దొంగల బ్యాచ్ ను అరెస్టు చేసిన పాకాల పోలీసులు బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళా నిందితుల అరెస్టు చేసి రూ.3.5 లక్షల విలువైన 32 గ్రాముల డైమండ్ గోల్డ్ నెక్లెస్ స్వాధీనం చేసుకున్నారు. పాకాలలో ఈ మధ్య కాలంలో ఆర్టీసీ బస్సులలో ప్రయాణికుల బ్యాగులు, హ్యాండ్ బ్యాగుల నుండి బంగారు ఆభరణాలు అపహరిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంపై నిఘా పెట్టిన పోలీసులు లేడీ గ్యాంగ్ ఆగడాలకు చెక్ పెట్టారు. పాకాల పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు దర్యాప్తు ను చేపట్టిన పాకాల సీఐ చిన్న గోవిందు పర్యవేక్షణలోని ప్రత్యేక బృందం నిందితుల కదలికలను గుర్తించింది. శంఖంపల్లి ఫ్లైఓవర్ వద్ద ముగ్గురు మహిళా నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితులు జి.దివ్య (31), బి.రాధిక (38), బి.మేరీ (33)లను అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. లేడీ గ్యాంగ్ నుండి రూ 3.50 లక్షల విలువైన 32 గ్రాముల బరువున్న డైమండ్ నెక్లెస్ గోల్డ్ చైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. మహిళా ప్రయాణికులే టార్గెట్ గా నిందితులు ఆర్టీసీ బస్సుల్లో నేరాలకు పాల్పడుతున్నట్లు తేల్చారు. బస్సుల్లో ప్రయాణించే మహిళలను లక్ష్యంగా చేసుకొని, రద్దీని ఆసరాగా తీసుకుని వారి బ్యాగుల్లోని విలువైన బంగారు ఆభరణాలను అపహరిస్తున్నట్లు లేడీ గ్యాంగ్ ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
