Alipiri tollgate : తిరుమల టోల్‌గేట్ దగ్గర నేటి నుంచి ఫాస్ట్ ట్యాగ్.. పెంచిన టోల్ ధరలు అమల్లోకి..
తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు ఇక మీదట టోల్ గేట్ రూపంలో అదనపు భారం తప్పదు..
Tirumala : తిరుమలకు వెళ్లే అలిపిరి టోల్‌గేట్ వద్ద ఫాస్ట్ ట్యాగ్ తోపాటు, పెంచిన టోల్‌గేట్ ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. ద్విచక్రవాహనాలకు ఉచితం కాగా, కొండపైకి వెళ్లే కార్లకు రూ.50, బస్సులకు రూ.100 చొప్పున తిరుమల తిరుపతి దేవస్థానం వసూలు చేస్తోంది. దీంతో తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు ఇక మీదట టోల్ గేట్ రూపంలో అదనపు భారం తప్పదు. కలియుగ వైకుంఠంగా అలరారుతోన్న తిరుమలను సందర్శించడానికి దేశం నలుమూలల నుంచి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. తిరుమలకు వెళ్లే వాహనాలన్నీ అలిపిరి వద్ద ఉన్న ఈ టోల్‌గేట్ మీదు గానే ప్రయాణించాల్సి ఉంటుంది. మామూలు రోజుల్లో సగటున రోజూ 10 వేలకు పైగా వాహనాలు ఈ టోల్‌గేట్ మీదుగా తిరుమలకు వెళ్తుంటాయి. వారాంతపు రోజులు, పండుగలు ఇతర ప్రత్యేక దినాల్లో ఈ వాహనాల సంఖ్య భారీగా ఉంటుంది. ఆయా వాహనాల నుంచి టోల్ ఛార్జీలను వసూలు చేయడానికి అలిపిరి వద్ద ప్రత్యేక వ్యవస్థను టీటీడీ అధికారులు ఇది వరకే ప్రవేశపెట్టారు.
అయితే, ఇప్పటి వరకూ నామమాత్రంగా వాహనాల ఛార్జీలను వసూలు చేస్తుండేవారు. దశలవారీగా ఆ ఛార్జీలను పెంచుకుంటూ వచ్చారు. ఈ సారి మాత్రం ఒకేసారి భారీగా పెంచారు. ఇప్పటిదాకా కనిష్ఠంగా 15 రూపాయలు, గరిష్ఠంగా 100 రూపాయలను టోల్ ఛార్జీ కింద వసూలు చేసేవారు. ఇప్పుడిది రెట్టింపయింది. కనిష్ఠ ఛార్జీ 50 రూపాయలు, గరిష్ఠ చార్జీ 200 రూపాయలకు పెరిగింది. ఈ టోల్ గేట్.. టీటీడీ సెక్యూరిటీ విభాగం ఆధీనంలో ఉంటుంది.