Andhra Pradesh: అనుమానం పెనుభూతమై.. కూతురికి తన పోలికలు రాలేదని భార్య, బిడ్డ దారుణ హత్య
Tirupati: తిరుపతి సమీపంలోని గురువరాజుపల్లి ఎస్టీ కాలనీలో దారుణం జరిగింది. కూతురికి తన పోలిక రాలేదని.. ఏడాది వయసున్న చిన్నారితో పాటు భార్యను చంపేశాడో దుర్మార్గుడు.
Tirupati: సొంతవారినే కిరాతకంగా చంపిన కర్కశత్వం. కట్టుకున్న భార్యను, కడుపున పుట్టిన కూతురిని కడతేర్చిన మూర్ఖత్వం ఇది. తిరుపతి సమీపంలోని గురువరాజుపల్లి ఎస్టీ కాలనీలో దారుణం జరిగింది. కూతురికి తన పోలిక రాలేదని.. ఏడాది వయసున్న చిన్నారితో పాటు భార్యను చంపేశాడో దుర్మార్గుడు. గురవరాజుపల్లికి చెందిన కుమార్,.. పావనిని రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏడాది క్రితం పాప పుట్టింది. అప్పటి నుంచి కుమార్‌లోని రాక్షసుడు బయటకొచ్చాడు. బిడ్డకు తన పోలికలు రాలేదంటూ భార్యను అనుమానించడం మొదలు పెట్టాడు. గత ఆదివారం చేపలు పట్టుకుందామంటూ ఎయిర్‌పోర్టు సమీపంలోని ఇసుక కాలువ దగ్గరకు కూతుర్ని, భార్యను తీసుకెళ్లాడు. కర్రతో కొట్టి చంపి.. ఇద్దరినీ కాలువలో పడేసి వెళ్లిపోయాడు కుమార్.
కాగా మూడు రోజుల నుంచి పావని, ఏడాది పాప కనిపించకపోవడంతో బంధువులు రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కుమార్‌ను తమదైన శైలిలో విచారించగా.. భార్య, బిడ్డను తానే చంపినట్లు అంగీకరించాడు. ఈమేరకు కాలువలో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు పావని మృతదేహాన్ని వెలికితీశారు. అయితే చిన్నారి మృతదేహం మాత్రం దొరకలేదు. ఈ ఘటనలో పావని భర్త కుమార్‌తో పాటు అత్తమామలపై కేసులు నమోదు చేశారు పోలీసులు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..