- Telugu News Photo Gallery Spiritual photos Annual Srivari Brahmotsavam, know about Lord Venkateswara Swamy vehicle Rides speciality significance and importance of visiting them
Srivari Brahmotsavas: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల విశిష్టత.. వాటిని దర్శించుకుంటే కలిగే ఫలితాలు తెలుసుకోండి..
Bramhotsavalu: కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధిగాంచిన క్షేత్రం తిరుమల తిరుపతి. దాదాపు 2 వేల సంవత్సరాల నుంచి స్వామివారి క్షేత్ర వైభవం అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉంది. శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో ఏడాది పొడవునా అనేక ఉత్సవాలు, పండుగలు జరుగుతూ నిత్యకల్యాణం పచ్చతోరణం అన్న చందంగా ఉంటుంది. తిరుమల క్షేత్రంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత ముఖ్యమైనవి. మొదటిసారిగా సాక్షాత్తూ బ్రహ్మదేవుడే శ్రీ వేంకటేశ్వరునికి ఈ ఉత్సవాలు నిర్వహించాడని.. అందుకే వీటిని బ్రహ్మోత్సవాలంటారని పురాణాల కథనం.
Updated on: Sep 29, 2022 | 12:39 PM

శ్రీవారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమై, ధ్వజావరోహణంతో ముగుస్తుంది. ఒక్కోరోజు ఒక్కోవాహనంలో స్వామి కనిపిస్తారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో మలయప్పస్వామి తన దేవేరులైన శ్రీదేవి, భూదేవిలతో కలిసి ఉత్సవాల్లో పాల్గొంటారు. పలు వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు.

మొదటి రోజు ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి పెద్ద శేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. పెద్ద శేషవాహనాన్ని ఆదిశేషుడికి ప్రతీకగా భావిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు ఉత్సవమూర్తిని ఐదు తలలుండే చిన్న శేషవాహనం మీద ఊరేగిస్తారు. చిన్న శేషవాహనాన్ని"వాసుకి" కి ప్రతీకగా భావిస్తారు. రెండో రోజూ సాయంత్రం వేళలో స్వామివారిని హంస వాహనంమీద వూరేగిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఉదయం శ్రీవారికి సింహ వాహనసేవ చేస్తారు. రాత్రి స్వామివారు తన ఉభయ దేవేరులతో కలిసి.. భోగశ్రీనివాసునిగా తిరుమల వీధుల్లో ముత్యాలపందిరి వాహనంపై ఊరేగుతారు. చల్లదనానికి చిహ్నమైన ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతున్న స్వామివారిని భక్తులు దర్శించుకుంటే.. మనసు నిర్మలమవుతుందని భక్తుల నమ్మకం.

బ్రహ్మోత్సవాల్లో నాలుగోరోజు ఉదయం.. స్వామివారు కల్పవృక్ష వాహనంలో భక్తులకు దర్శనం ఇస్తారు. సాయంత్రం శ్రీవారు ఉభయ దేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై ఊరేగుతారు. ఈ వాహన సేవలో పాల్గొనే భక్తులకు సమాజంలో పేరు ప్రతిష్టలు, గౌరవం కలుగుతాయని నమ్మకం.

బ్రహ్మోత్సవాల్లో అయిదో రోజు ఉదయం మోహినీ అవతారంలో దర్శనమిస్తారు. రాత్రి స్వామివారు వెలకట్టలేనన్ని ఆభరణాలు ధరించి గరుడ వాహనంలోనూ ఊరేగుతూ భక్తులకు దర్శనిమస్తారు. ఈ వాహన సేవల్లో పాల్గొనే భక్తులు శ్రీవారి కృపాకటాక్షాలకు పాత్రులవుతారని నమ్మకం.

బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు ఉదయం స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారు సాయంత్రం శ్రీదేవి, భూదేవిలతో కలిసి మలయప్ప స్వామి స్వర్ణ రథంపై ఊరేగుతారు. ఈ వాహన సేవలో పాల్గొనే భక్తులకు లక్ష్మీ కటాక్షం లభిస్తుందని నమ్మకం.

బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు ఉదయం వెంకన్న సూర్యప్రభవాహనంలో ఊరేగుతారు. సాయంత్రం చంద్రప్రభ వాహనం మీద ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు రథోత్సవం నిర్వహిస్తారు. స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి తిరువీధుల్లో విహరిస్తారు. రాత్రి స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ఈ వాహన సేవలో పాల్గొంటే.. భక్తులకు పునర్జన్మ ఉండదని నమ్మకం.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు అంతిమ ఘట్టం చక్రస్నానం నిర్వహిస్తారు. స్వామివారిని పుష్కరిణిలో స్నానమాచరిస్తారు. సాయంత్రం శ్రీవారి ఆలయ ధ్వజస్తంభం మీద ఆరోహణ చేసిన గరుడ పతాకాన్ని అవరోహణం చేస్తారు. దీంతో బ్రహ్మ్మోత్సవాలకు వేంచేసిన సకల దేవతలకూ వీడ్కోలు పలికినట్లు అని భావిస్తారు.
