Tirumala Darshan: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. వారికి ప్రత్యేక దర్శనాలకు అనుమతి..
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. రెండేళ్ల విరామం అనంతరం తిరుమలలో వృద్దులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనాలు...
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. రెండేళ్ల విరామం అనంతరం తిరుమలలో వృద్దులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనాలు పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించింది. రేపటి(ఏప్రిల్ 7) నుంచి ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో వృద్దులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శన టోకెన్లను విడుదల చేయనుంది. రోజుకు వెయ్యి టోకెన్ల చొప్పున విడుదల చేయనున్నట్లు టీటీడీ(Tirumala Tirupathi Devasthanam) స్పష్టం చేసింది. టోకెన్లు కలిగిన వృద్దులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న భక్తులను ప్రతీరోజూ ఉదయం 10 గంటలకు, శుక్రవారం రోజు మధ్యాహ్నం 3 గంటలకు దర్శనాలకు అనుమతిస్తామని టీటీడీ పేర్కొంది.
కాగా, కరోనా కారణంగా వృద్దులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారి దర్శనాలను టీటీడీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా భక్తుల నుంచి వస్తున్న వినతి మేరకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండేళ్లుగా శ్రీవారి దర్శనం కోసం నిరీక్షిస్తున్న వికలాంగులు, వయోవృద్దుల విషయంలో టీటీడీ తీసుకున్న నిర్ణయంపై పలువురు భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.