Tirumala Srivari Seva: 200 మందితో మొదలై.. 17 లక్షల వరకు.. శ్రీవారి సేవకులకు టీటీడీ ప్రత్యేక శిక్షణ..
శ్రీవారి సేవకుల్లో మరింత సేవా భావం ఉండాలని టీటీడీ భావిస్తోంది. ట్రైన్ ది ట్రైనర్స్ ప్రోగ్రాం పేరుతో శ్రీవారి సేవకులకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్, ఐఐఎం అహ్మదాబాద్ నిపుణులతో శ్రీవారి సేవ గ్రూప్ సూపర్వైజర్లకు విడతల వారీ ట్రైనింగ్ కు శ్రీకారం చుట్టింది. పాతికేళ్ళ క్రితం టీటీడీలో 200 మందితో మొదలైన శ్రీవారి సేవ ఇప్పుడు 17 లక్షల మందికి చేరింది.

శ్రీవారి సేవకుల్లో మరింత సేవా భావం ఉండాలని టీటీడీ భావిస్తోంది. ట్రైన్ ది ట్రైనర్స్ ప్రోగ్రాం పేరుతో శ్రీవారి సేవకులకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్, ఐఐఎం అహ్మదాబాద్ నిపుణులతో శ్రీవారి సేవ గ్రూప్ సూపర్వైజర్లకు విడతల వారీ ట్రైనింగ్ కు శ్రీకారం చుట్టింది. పాతికేళ్ళ క్రితం టీటీడీలో 200 మందితో మొదలైన శ్రీవారి సేవ ఇప్పుడు 17 లక్షల మందికి చేరింది.
భక్తుల సేవే పరమావాదిగా..
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు సేవలు అందించేందుకు ఆసక్తి చూపే భక్తుల సంఖ్య ఈ మధ్యకాలంలో గణనీయంగా పెరిగింది. శ్రీవారి సేవకులుగా శ్రీవారి సేవలో పాల్గొనే భక్తులు సామాన్యునికి సంపన్నులు దాకా ఉంటోంది. ఇలా మానవ సేవే మాధవ సేవలా భక్తులకు సేవ చేయడమే పరమావధిగా 2000 నవంబర్‌లో శ్రీవారి సేవను టీటీడీ ప్రారంభించింది. 200 మంది సేవకులతో మొదలైన ఈ కార్యక్రమంలో 2025 నాటికి దాదాపు 17 లక్షలపైగా దేశ విదేశాల నుండి వచ్చే వాలంటీర్లు శ్రీవారి సేవలో పాల్గొంటున్న పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆదేశాలతో శ్రీవారి సేవను మరింత విస్తరింప చేసే పనిలో టీటీడీ నిమగ్నమైంది. శ్రీవారి సేవ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు సేవకులకు ముందస్తు శిక్షణ ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్, అహ్మదాబాద్ ఐఐఎం నిపుణులు శ్రీవారి సేవకులకు గ్రూప్ సూపర్వైజర్లు ద్వారా శిక్షణ ఇప్పించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ట్రైనింగ్ మాడ్యుల్స్ రూపొందించింది. గత సెప్టంబర్ నెలలో 150 మంది గ్రూప్ సూపర్వైజర్లకు వర్చువల్ గా శిక్షణ పూర్తి చేసిన టిటిడి ఈ నెల 1 నుండి ఫిబ్రవరి 13 వరకు 10 బ్యాచ్ లకు శిక్షణ ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ముందుగా మొదటి రోజు గ్రూప్ సూపర్వైజర్లకు రిజిస్ట్రేషన్, శిక్షణపై అవగాహన కల్పిస్తోంది. 2,3,4, రోజుల్లో తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ లో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్న టీటీడీ 5, 6,7 రోజుల్లో క్షేత్ర పరిశీలన ఉంటుంది. అంటే వారం రోజుల పాటు ఒక్కో బ్యాచ్ కు శిక్షణ ఇస్తోంది. శ్రీవారి సేవను భక్తితో, సమయ పాలనతో చేయడానికి, భక్తుల రద్దీని సమర్థంగా నిర్వహించడానికి, సేవా బాధ్యతల్లో గందరగోళం తగ్గించడానికి, ఆధ్యాత్మికత, నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసం పెంపొందించడానికి ఈ శిక్షణ సహాయపడు తుంది.
ముందస్తుగా శ్రీవారి సేవకు రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకు వారి ప్రాంతాల్లో నిపుణుల వద్ద ప్రత్యేక శిక్షణ పొందిన గ్రూప్ సూపర్వైజర్లు ప్రాథమిక శిక్షణ ఇస్తారు. సేవకుల్లో స్పష్టత, ధైర్యం, క్రమశిక్షణ పెంపొందిస్తారు. భక్తుల అనుభవం మెరుగుపడేలా సేవను మార్గనిర్దేశం చేస్తారు. వినయం, భక్తి, క్రమశిక్షణతో కూడిన సేవను భక్తులకు అందించేలా సేవకులను తీర్చిదిద్దుతారు.
డిసెంబర్ 1 నుంచి గ్రూప్ సూపర్వైజర్లకు మొదటి బ్యాచ్ రిజిస్ట్రేషన్ జరిగింది. 2, 3, 4 తేదీల్లో వీరికి శ్రీవారి ఆలయ ప్రాశస్త్యం, హైందవ సనాతన ధర్మంలోని పౌరాణిక గాథలు, శ్రీవారి సేవా ప్రాధాన్యత, టీటీడీ -ఐటీ సేవలు, వైద్య సేవలు, భద్రతా సేవలతో పాటు కళ్యాణ కట్ట, అన్న ప్రసాదం, లడ్డూ కౌంటర్, రిసెప్షన్, వరహా స్వామి ఆలయం, వైకుంఠ క్యూ కాంప్లెక్స్ -1, 2, శ్రీవారి ఆలయం, కొబ్బరికాయల కౌంటర్ లలో రద్దీ ఎక్కువగా ఉన్న రోజులు, ప్రత్యేక దినాల్లో శ్రీవారి సేవకులు భక్తులకు అందిస్తున్న సేవలు, గుండె పోటు వచ్చిన భక్తులకు సీపీఆర్ చేసే విధానంపై శిక్షణ ఇస్తోంది టిటిడి.
శ్రీవారి సేవకులే హిందూ ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్లు..
ఇక ట్రెయిన్ ది ట్రైనీస్ పేరుతో శిక్షణా కార్యక్రమం ప్రారంభించిన టీటీడీ .. శ్రీవారి సేవకులు హిందూ ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్లుగా పేర్కొంటోంది. శ్రీవారి సేవను మరింత బలోపేతం చేయడంలో భాగంగా వారిలోని నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే శిక్షణా కార్యక్రమం వెనుక ఉన్న ఉద్దేశమంటున్నారు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి. ఆంధ్ర ప్రదేశ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, ఐఐఎం అహ్మదాబాద్ నిపుణులు శిక్షణ మాడ్యూల్‌లను రూపొందించినట్లు చెప్పారు.
శిక్షణలో వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాల పెంపు, కమ్యూనికేషన్, భక్తులతో నడవడిక, నాయకత్వ లక్షణాలు, టీటీడీ చరిత్ర, శ్రీవారి సేవ ప్రాముఖ్యత, పురాణాల పరిజ్ఞానం తదితర అంశాలు ఉంటాయన్నారు. ఆయా అంశాల్లో నిష్ణాతుల ద్వారా శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామంటున్నారు అదనపు ఈవో వెంకయ్య. శిక్షణ పొందిన గ్రూప్ సూపర్వైజర్లు తమ ప్రాంతాల్లో శ్రీవారి సేవకు నమోదు చేసుకున్న శ్రీవారి సేవకులకు సేవకు రాకమునుపే శిక్షణ అందించి వారిని భక్తులకు ఉన్నతమైన సేవలు అందించే విధంగా తీర్చిదిద్దడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని టీటీడీ అడిషనల్ ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు.
హిందూ ధర్మాన్ని విస్తృతంగా జనం లోకి తీసుకెళ్లాలి…
ఇక హిందూ ధర్మ ప్రచారాన్ని శ్రీవారి సేవకులు మరింత విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లాలని టిటిడి కోరుతోంది. త్వరలో టీటీడీ స్థానికాలయాల్లో దశలవారీ శ్రీవారి సేవ ప్రారంభించాలని టిటిడి భావిస్తోంది. శ్రీవారి సేవను మరింత బలోపేతం చేయడంలో భాగంగా గ్రూప్ సూపర్వైజర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తోందని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
