Thief scanners: దొంగ బెడదతో ఊరెళ్లలేకపోతున్నారా..? ఇకపై ఏం భయంలేదు.. అందుబాటులోకి పోలీసుల సరికొత్త అస్త్రం..!
దసరా పండుగకు ఊరెళ్లితే.. మీ ఇంట్లో దొంగలు పడ్డారా..? ఇంటర్ స్టేట్ ముఠాలు విశాఖపై కన్నేశాయా..? ఏటా అంతర్రాష్ట్ర దొంగల బెడద దసరాకు ఉంటుండడంతో పోలీసులు ముందే మేల్కొన్నారు.
Thief scanners: దసరా పండుగకు ఊరెళ్లితే.. మీ ఇంట్లో దొంగలు పడ్డారా..? ఇంటర్ స్టేట్ ముఠాలు విశాఖపై కన్నేశాయా..? ఏటా అంతర్రాష్ట్ర దొంగల బెడద దసరాకు ఉంటుండడంతో పోలీసులు ముందే మేల్కొన్నారు. సరికొత్త అస్త్రంతో నేరగాళ్లను ట్రాక్ చేసే పనిలో పడ్డారు. అధునాతన టెక్నాలజీని వినియోగించుకుని దొంగల పై నిఘా పెంచారు. ఇంతకీ ఆ సరికొత్త అస్త్రమేంటి..?
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో అదే స్థాయిలో నెలలు కూడా పెరిగిపోతున్నాయి. దొంగతనాలు దోపిడీలు రికార్డ్ స్థాయిలో చోటుచేసుకుంటున్నాయి. పోలీస్ స్టేషన్లలో కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సెలవు దినాలు వస్తే చాలు పోలీసుల పని పెరుగుతోంది. పండక్కి ఊరెళ్ళి వారి గృహాల టార్గెట్ చేసుకునే దొంగలు తమ చేతికి పని చెబుతుంటారు. ఇళ్లను గుల్ల చేసి సొత్తును ఎత్తుకుపోతారు.
ఎప్పుడు పండగ సెలవులు వచ్చిన ఇతర రాష్ట్రాల నుంచి దొంగలు విశాఖలో వాలిపోతారు. సాధారణ రోజులతో పోలిస్తే సంక్రాంతి, దసరాకు దొంగతనాలు సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈసారి కూడా ఇంటర్ స్టేట్ ముఠాలతో పాటు స్థానిక దొంగలు కూడా రెచ్చిపోయే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు ముందస్తుగా అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ నిఘా పెంచుతూనే నైట్ బీట్ ముమ్మరం చేశారు. అంతేకాకుండా కొత్త అత్యాధునిక లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంను అందుబాటులోకి తీసుకువచ్చారు విశాఖపట్నం పోలీసులు. పండక్కి ఊరు వెళ్లిన వారి గృహాలపై నిఘా పెంచారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. ఏదైనా దారుణం జరగకముందే నేరస్థులను ట్రాక్ చేయాలన్నది పోలీసుల ఆలోచన. అందుకే విశాఖ నగర పరిధిలో ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టడంతో పాటు… అనుమానితుల వివరాలను సేకరించి ఆరా తీస్తున్నారు. అయినా, ఒక్కోసారి నేరస్థులు ఖాకీల కన్నుగప్పి తప్పించుకుంటారు. అందుకే ఈసారి పోలీసులు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ అధునాతన టెక్నాలజీని వినియోగిస్తున్నారు. అనుమానితులను ఆన్ ది స్పాట్ లోనే గుర్తించే విధంగా సెటప్ ను సిద్ధం చేసుకున్నారు విశాఖ పోలీసు విభాగం.
విశాఖ నగరంలో జరిగే దొంగల ఆట పట్టించేందుకు పోలీసులు ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు. వాహనాల తనిఖీలు చేస్తూ అనుమానితులను ప్రశ్నిస్తూనే.. దొంగలను గుర్తించేందుకు స్కానర్లను రంగంలోకి దింపారు. మొబైల్‌లో నేరస్థుల డేటా కు ఆన్‌లైన్‌లో లింక్ అప్ చేసి.. దానిని సింగర్ స్కానర్‌కు అనుసంధానం చేశారు. అనుమానితుడు కనిపించగానే ప్రశ్నిస్తున్న పోలీసులు.. పొంతన లేని సమాధానాలు చెప్పేవారికి ఫింగర్ ప్రింట్ స్కానర్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగా అతను దొంగ అయితే ఫింగర్ స్కాన్ ద్వారా అతనిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. ఒక్కసారి ఫింగర్ పెట్టగానే అతని నేరచరిత్ర అంతా ఆ మొబైల్‌లో దర్శనమిస్తోంది. దీంతో ఈజీగా నేరస్తుల ఆడ పట్టించేలా పోలీసులకు ఈ స్కానర్ ఉపయోగపడుతోంది.
ఈ టెక్నాలజీ పాతదే అయినా.. రోడ్లపై ఆన్ ది స్పాట్ లో నేరస్తులను గుర్తించడం అనేది ఇప్పుడు పోలీసులకు ఉపయోగకరంగా మారింది. ఫింగర్ స్కానర్ సాయంతో పోలీసులు సిటీ పరిధిలో ఎక్కడికక్కడ నిఘా పెట్టి నేరగాళ్ల ఆటను పట్టించి దొంగతనాల బారినుంచి నగరాన్ని కాపాడేలా పోలీసులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. నేరగాళ్లను గుర్తించేందుకు పోలీసులు వినియోగిస్తున్న సరికొత్త అస్త్రం పై విశాఖ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.