Theft at Mallikharjuna Temple: ఆంధ్రప్రదేశ్‌లో మనుషులకే కాదు ఆలయాల్లోని దేవుళ్లకు సైతం భద్రత లేకుండా పోయింది. గుంటూరు జిల్లాలో ఉన్న మల్లిఖార్జున స్వామి ఆలయంలో చోరీకి తెగబడ్డారు కొంతమంది దుండగులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా ఈపూరు మండలంలోని ముప్పాళ్ల గ్రామంలోని మల్లిఖార్జున స్వామి ఆలయంలో అర్చకులు రోజువారీగా పూజలు నిర్వహించి ఆలయ తలుపులు మూసేసి వెళ్లిపోయారు.
అయితే అర్ధరాత్రి గేట్లు, తలుపులకు ఉన్న తాళాలు పగులగొట్టి దొంగలు లోపలికి ప్రవేశించారు. మల్లిఖార్జున స్వామికి ఇరువైపుల ఆసీనులైన భద్రకాళి, భ్రమరాంబికాదేవి మెడలో ఉన్న తాళి బొట్లు, ముక్కు పుడకలను అపహరించారు. ఉదయం అర్చకులు వచ్చే సరికి తలుపులు తెరిచి ఉన్నాయి. చోరి జరిగినట్లు గుర్తించిన పూజారి పోలీసులకు సమాచారం అందించారు. ఆలయాన్ని సందర్శించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.