కనుమ పర్వదినాన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గోపూజ మహోత్సవం, నరసరావుపేట పూజా కార్యక్రమంలో వైఎస్ సీఎం జగన్, లైవ్ అప్డేట్స్
కనుమ పర్వదినాన ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ మహోత్సవం నిర్వహిస్తున్నారు. టీటీడీ, దేవాదాయశాఖ, హిందూ ధర్మ..

కనుమ పర్వదినాన ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ మహోత్సవం నిర్వహిస్తున్నారు. టీటీడీ, దేవాదాయశాఖ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 2,679 ఆలయాల్లో గోపూజ కార్యక్రమం జరుపుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అధారిటీ స్డేడియంలో నిర్వహించే గోపూజ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గోపూజా మహోత్సవ లైవ్ అప్డేట్స్ ఈ దిగువున..
LIVE NEWS & UPDATES
-
రాష్ట్రప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన సీఎం జగన్
గోమాతకు పూజా కార్యక్రమం అనంతరం మైక్ తీసుకుని మాట్లాడారు సీఎం జగన్. ఈ సందర్భంగా రాష్ట్రప్రజలు చిన్నా, పెద్దా, అక్కలు, చెల్లెమ్మలు, అవ్వలు, స్నేహితులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని జగన్ తెలిపారు. శుభాకాంక్షలు మాత్రమే చెప్పి జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.
-
కామధేనువు కొమ్ములకి పూల అలంకరణ, పట్టువస్త్రాలతో ముస్తాబు
పూజలందుకుంటోన్న కామదేనువు కొమ్ములను పూలతో అలంకరించి, గోమాతపై పట్టు వస్త్రాలు ఉంచి అందంగా అలంకరించి పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాగా, వేదిక దగ్గర గోమాత, గో ఉత్పత్తుల గొప్పతనంపై భక్తులకు తెలియజేస్తూ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాట్లు చేశారు. ఒక గోవులో 33 కోట్ల దేవతలుంటారనేది ప్రతీతని, గోవును పూజిస్తే ఆ దేవతల కరుణా కటాక్షాలూ లభిస్తాయని బ్యానర్లలో లిఖించారు.
-
-
సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికిన మంత్రులు, టీటీడీ ఛైర్మన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు
గోపూజా మహోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రికి మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మేకతోటి సుచరిత, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పలువురు ఎంపీలు, స్థానిక శాసనసభ్యులు విడదల రజనీ తదితరులు ఘన స్వాగతం పలికారు.
-
నరసరావుపేట మైదనంలో పండుగ శోభ, రంగురంగుల ముగ్గులు, స్టాళ్లతో జగన్ కు ఘన స్వాగతం
గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో తలపెట్టిన గోపూజ మహోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చిన తరుణంలో మైదాన ప్రాంతం కొత్త శోభను సంతరించుకుంది. రంగురంగుల ముగ్గులతో ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ప్రత్యేక స్టాళ్లను కూడా ఏర్పాటు చేశారు. సీఎం ఈ స్టాళ్లను పరిశీలించి నిర్వాహకులతో ముచ్చటించారు.
-
పండితుల వేద మంత్రాల మధ్య జరుగుతోన్న గోపూజ కార్యక్రమంలో సీఎం జగన్
గోపూజ మహోత్సవ కార్యక్రమం నరసరావుపేటలో అంగరంగవైభవంగా, భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తున్నారు. పండితుల వేద మంత్రాల మధ్య జరుగుతోన్న కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటున్నారు.ఈ సందర్భంగా జగన్ గోపూజ సంకల్పం తీసుకున్నారు. అంతకుముందు టీటీడీ అధికారులు సీఎం జగన్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
-
-
నరసరావుపేట చేరుకున్న సీఎం జగన్
ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉదయం 11.25 గంటలకు నరసరావుపేట చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కు స్థానిక వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మున్సిపల్ స్టేడియంలో వివిధ స్టాళ్లను సీఎం పరిశీలిస్తున్నారు. అనంతరం గోపూజ మహోత్సవంలో సీఎం పాల్గొంటారు. తిరిగి మధ్యాహ్నం 1.10 గంటలకు తిరిగి సీఎం జగన్ తాడేపల్లి చేరుకోనున్నారు.