Farmers Protest: కేంద్రం, రైతుల మధ్య ముగిసిన తొమ్మిదో దఫా చర్చలు.. మరోసారి అసంతృప్తి.. ఈ నెల 19న నెక్స్ట్ సమావేశం…

Ravi Kiran

|

Updated on: Jan 15, 2021 | 6:17 PM

రైతుల ఉద్యమం నేటితో 51వ రోజుకు చేరుకుంది. ఇదిలా ఉంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య 9వ విడత చర్చలు జరుగుతున్నాయి.... మరి ఇవాళ అయినా పరిష్కారం..

Farmers Protest: కేంద్రం, రైతుల మధ్య ముగిసిన తొమ్మిదో దఫా చర్చలు.. మరోసారి అసంతృప్తి.. ఈ నెల 19న నెక్స్ట్ సమావేశం...

Farmers Protest: న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్రం, రైతు సంఘాల మధ్య తొమ్మిదో విడత చర్చలు ముగిశాయి. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ఈ సమావేశం జరుగుతుండటంతో.. సమస్యకు పరిష్కారం లభిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఈ దఫా చర్చలు కూడా ఎలాంటి క్లారిటీ లేకుండానే ముగిశాయి.

ఒకవైపు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేస్తుండగా.. చట్టాలను ఉపసంహరించుకునే వరకు మా పోరాటం ఆగదని రైతులు వెల్లడించారు. ఈ సమావేశం కనీస మద్దతు ధర, నిత్యావసర వస్తువుల చట్టం, కొన్ని రాష్ట్రాల్లో పోలీసులు పెడుతున్న ఇబ్బందులు వంటి కీలకాంశాలపై చర్చించుకున్నారు. సుప్రీంకోర్టు కమిటీతో తమకు సంబంధం లేదని.. కేంద్రంతోనే చర్చలు జరుపుతామని రైతు సంఘాల నాయకులు చెప్పినట్లు తెలుస్తోంది. ముందుగా ఖరారైన విధంగానే అన్ని రకాల కార్యక్రమాలు కొనసాగుతాయని రైతులు తెలిపారు. ఈ నెల 19వ తేదీన 12 గంటలకు మరోసారి చర్చలకు హాజరుకావాలని కేంద్రం, రైతులు నిర్ణయించారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 15 Jan 2021 05:09 PM (IST)

    అసంపూర్ణంగానే కేంద్రం, రైతు సంఘాల మధ్య ముగిసిన చర్చలు..

    మూడు వ్యవసాయ చట్టాలపై రైతులు, కేంద్రం మధ్య జరిగిన తొమ్మిదో దఫా చర్చలు ముగిశాయి. ఈ సమావేశంలో కూడా పరిష్కారం లభించలేదు. మరోసారి జనవరి 19వ తేదీన సమావేశం కావాలని నిర్ణయించారు. కనీస మద్దతు ధర, నిత్యావసరాల చట్టంపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించారు. ఇరు పక్షాలూ కూడా తమ పట్టును విడవట్లేదు.

  • 15 Jan 2021 04:57 PM (IST)

    సుప్రీం కోర్టు కమిటీ ముందు కేంద్రం వెర్షన్‌ను చెబుతాం: కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్

    రైతుల ఉద్యమానికి సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం స్వాగతిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. ప్రభుత్వం తమ అభిప్రాయాలను సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ముందు ఉంచుతుంది. అయితే ఈలోపే సమస్యను చర్చలు ద్వారా పరిష్కరించాలని ప్రయత్నిస్తున్నాం అని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు.

  • 15 Jan 2021 04:48 PM (IST)

    కనీస మద్దతు ధరపై చర్చిస్తున్నాం: కిసాన్ యూనియన్ అధ్యక్షుడు రాకేశ్ టికైట్

    కేంద్రంతో జరుగుతున్న తొమ్మిదో దఫా చర్చల్లో కనీస మద్దతు ధరతో పాటు మూడు వ్యవసాయ చట్టాలపై కూడా చర్చలు జరుపుతున్నామని కిసాన్ యూనియన్ అధ్యక్షుడు రాకేశ్ టికైట్ తెలిపారు. ఈరోజు జరుగుతున్న చర్చలు సఫలం అయ్యే దిశగా సాగుతున్నాయని అన్నారు.

  • 15 Jan 2021 04:20 PM (IST)

    కేంద్రం వర్సెస్ రైతు సంఘాలు.. వాడీవేడీగా కొనసాగుతున్న చర్చలు..

    రైతులు, కేంద్రం మధ్య తొమ్మిదో విడత చర్చలు వాడీవేడీగా సాగుతున్నాయి. ఒకవైపు చట్టాలను రద్దు చేసే ప్రసక్తి లేదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేస్తుండగా.. చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు పట్టుబడుతున్నాయి.

  • 15 Jan 2021 04:05 PM (IST)

    వ్యవసాయ చట్టాల లొల్లి.. పంజాబ్ రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత..

    పంజాబ్ రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాజ్ భవన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నాడు. వారిపై వాటర్ కెనాన్ల ప్రయోగం చేశారు. దీనితో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

  • 15 Jan 2021 04:03 PM (IST)

    కేంద్రం, రైతు సంఘాల నాయకుల మధ్య మళ్లీ మొదలైన చర్చలు

    లంచ్ విరామం అనంతరం కేంద్రం, రైతు సంఘాల నాయకుల మధ్య మళ్లీ చర్చలు మొదలయ్యాయి.

  • 15 Jan 2021 03:10 PM (IST)

    చర్చల మధ్యలో విరామ సమయం.. ఆహారం తీసుకుంటున్న అన్నదాతలు..

    కేంద్రంతో జరుగుతున్న తొమ్మిదో విడత చర్చల విరామ సమయంలో అన్నదాతలు ఆహారాన్ని తీసుకుంటున్నారు.

  • 15 Jan 2021 03:02 PM (IST)

    మూడు చట్టాలు రైతులను నష్ట పరుస్తాయి.. రాహుల్ గాంధీ

    ఈ మూడు చట్టాలు రైతులను నష్ట పరుస్తాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. అంబానీ-అదాని కాదు.. ఈ దేశానికీ రైతులు స్వేచ్చను ఇచ్చారు.

  • 15 Jan 2021 02:55 PM (IST)

    జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ

    వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తమ కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.

  • 15 Jan 2021 02:54 PM (IST)

    ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూను అరెస్ట్ చేసిన పోలీసులు..

    ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ, కార్యకర్తలు మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. రాజ్ భవన్‌ను చుట్టుముట్టే ప్రయత్నం చేయగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

  • 15 Jan 2021 01:47 PM (IST)

    మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ర్యాలీ..

    కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఢిల్లీలోని రాజ్ నివాస్ వరకు ర్యాలీ నిర్వహించారు.

  • 15 Jan 2021 01:42 PM (IST)

    చట్టాల రద్దు డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదు: రైతులు

    చట్టాల రద్దు డిమాండ్‌పై తాము వెనక్కి తగ్గేది లేదని రైతులు చెబుతున్నారు. మూడు చట్టాలను ఉపసంహరించుకుని.. తాజాగా జరగబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కొత్త చట్టాలను, కొత్త సంస్కరణలను అందరితో సంప్రదింపులు జరిపిన అనంతరం అమలులోకి తీసుకురావాలని అంటున్నారు. అలాగే కనీస మద్దతు ధరను కూడా చట్టబద్దతలోకి తీసుకురావాలని చెబుతున్నారు.

  • 15 Jan 2021 01:36 PM (IST)

    చట్టాలు రద్దు, మద్దతు ధర చట్టబద్దత చేయడమే.. తొమ్మిదో విడత చర్చల్లో కీలకాంశాలు..

    రైతు సంఘాలతో కేంద్రం చర్చలు కొనసాగుతున్నాయి. 41 రైతు సంఘాల ప్రతినిధులు సమావేశానికి హాజరు కాగా.. కొత్త వ్యవసాయ చట్టాల రద్దు, మద్దతు ధర చట్టబద్దత వంటి అంశాలపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు.

  • 15 Jan 2021 12:34 PM (IST)

    కేంద్రం, రైతుల మధ్య మొదలైన 9వ రౌండ్ చర్చలు..

    ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో రైతు సంఘాల నాయకులు, కేంద్ర ప్రభుత్వం మధ్య 9వ రౌండ్ చర్చలు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర మంత్రి పియూష్ గోయల్, సోంప్రాకాష్ హాజరయ్యారు.

  • 15 Jan 2021 12:30 PM (IST)

    విజ్ఞాన్ భవన్ చేరుకున్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్

    ఢిల్లీలో రైతులతో జరగబోయే 9వ విడత చర్చల నిమిత్తం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విజ్ఞాన్ భవన్ చేరుకున్నారు.

  • 15 Jan 2021 12:28 PM (IST)

    మూడు వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం..

    మూడు వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం స్వాగతిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ముందు ప్రభుత్వం చట్టాలపై నిర్ణయం తీసుకున్న అంశాలను ఉంచుతాం. ఇవాళ మరోసారి రైతులతో చర్చిస్తాం. ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు.

  • 15 Jan 2021 12:25 PM (IST)

    వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాల్సిందే: రాకేశ్ టికైట్

    కేంద్రంతో 9వ విడత చర్చలకు ముందు భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ ప్రతినిధి రాకేశ్ టికైట్ మాట్లాడుతూ.. మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని.. MSP చట్టాలను అమలులోకి తీసుకురావాలని అన్నారు.

  • 15 Jan 2021 12:25 PM (IST)

    ”సుప్రీం కోర్టు తీర్పు తర్వాత కూడా రైతులు మొండిగా వ్యవహరిస్తున్నారు”..

    కోర్టు చట్టాలను సస్పెన్షన్ విధిస్తూ.. సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. అయినా, దేశవ్యాప్తంగా రైతు సంఘం నాయకుల ఆందోళన కొనసాగిస్తున్నారు. కేంద్ర మంత్రులు వరుసగా ఎనిమిది సార్లు చర్చలు జరిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ఏకంగా దేశ ప్రధాని కూడా హామీ ఇచ్చారు. రైతులు మొండిగా వ్యవహరిస్తున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కైలాష్ చౌదరి అన్నారు. రైతు సమస్యల కోసం సుప్రీంకోర్టు ఓ కమిటీని కూడా నియమించదని గుర్తు చేసిన మంత్రి.. రైతులు వెంటనే తమ దీక్షను విరమించాలని ఆయన కోరారు.

  • 15 Jan 2021 12:12 PM (IST)

    విజ్ఞాన్ భవన్ చేరుకున్న రైతు సంఘాల నాయకులు..

    కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల నాయకుల మధ్య విజ్ఞాన్ భవన్‌లో తొమ్మిదో విడత చర్చలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే రైతు సంఘాల నాయకులు విజ్ఞాన్ భవన్ చేరుకున్నారు.

  • 15 Jan 2021 12:07 PM (IST)

    టిక్కర్ సరిహద్దులో రైతుల నిరసన కొనసాగుతోంది…

    వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సరిహద్దులో రైతులు తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. నేటితో వారి ఉద్యమం 51వ రోజుకు చేరింది.

Published On - Jan 15,2021 5:09 PM

Follow us