Andhra Pradesh: ఐదు నెలలుగా ఆచూకీ దొరకని దొంగ.. ఇజ్జత్ కా సవాల్ గా మారిన చోరీ..

అచ్చం సిసీ ఫక్కీలో జరిగిందా చోరీ. పట్టపగలు.. మిట్ట మధ్యాహ్నం.. ఒక బ్యాంకులో చోరీ చేసిన దొంగ ఆచూకీ ఇప్పటి వరకూ కనిపెట్టలేక పోయారు.

Andhra Pradesh: ఐదు నెలలుగా ఆచూకీ దొరకని దొంగ.. ఇజ్జత్ కా సవాల్ గా మారిన చోరీ..
Anakapalle Bank Robbery
Follow us

|

Updated on: Sep 28, 2022 | 11:49 AM

అచ్చం సిసీ ఫక్కీలో జరిగిందా చోరీ. పట్టపగలు.. మిట్ట మధ్యాహ్నం.. ఒక బ్యాంకులో చోరీ చేసిన దొంగ ఆచూకీ ఇప్పటి వరకూ కనిపెట్టలేక పోయారు. ఘటన జరిగి నెలలు గడుస్తున్నా.. చిన్న క్లూ కూడా దొరకడం లేదు. ఈ దొంగ ఎందుకు చిక్కడం లేదు. లోపం ఎక్కడ? ఇది ఆ దొంగ చేతి వాటమా? లేక పోలీసుల చేతగాని తనమా? ఇజ్జత్ కా సవాల్ గా మారిన అనకాపల్లి బ్యాంకు చోరీ గురించి ప్రత్యేక కథనం మీకోసం..

సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది అనకాపల్లి బ్యాంకు దోపిడీ కేసు. తుపాకీ చూపి రూ. 3. 31 లక్షలు చోరీ చేశాడు దొంగ. ఐదు నెలలు గడుస్తున్నా.. మిస్టరీ వీడలేదు. ఇప్పటి వరకూ దొంగ ఆచూకీ దొరకలేదు. దొంగ వచ్చిన బైక్‌ను సైతం ట్రేజ్ చేయలేకపోయారు.

ఏప్రిల్ 30, 2022. అనకాపల్లి జిల్లా, కసింకోట మండలం, నరసింగపల్లి. మధ్యాహ్నం 2. 07 గంటల సమయం. గ్రామీణ వికాస్ బ్యాంకు సిబ్బంది భోజన విరామంలో ఉన్నారు. ఈలోగా ఎంట్రీ ఇచ్చాడు ముసుగు దొంగ. ఐదు అడుగుల మూడు అంగుళాల పొడవు.. ఒంటికి నేవీ బ్లూ కలర్ జాకెట్, చేతికి గ్లౌజ్, నెత్తికి బ్లాక్ హెల్మెట్.. భుజానికో బ్యాగు.. జీన్స్ ఫ్యాంట్, షూస్.. అన్నిటికన్నా మించి చేతిలో తుపాకీ.. ఆ టైంలో దాదాపు బ్యాంకు ఖాళీగా ఉంటుందని ముందే గ్రహించాడో.. ఏమో తెలీదు కానీ.. అందరూ లంచ్‌లో ఉండగా.. కేవలం క్యాషియర్ మాత్రమే అక్కడున్నాడు. ఇదే అదనుగా భావించిన ఈ చిచోరాగాడు గన్ క్యాషియర్ కి గురిపెట్టి అదరగొట్టాడు. ఎప్పుడైతే ఆ అగంతకుడి చేతిలో తుపాకీ చూశాడో.. ఆ బ్యాంకు ఎంప్లాయి కూడా హడలి పోయాడు.

ఇవి కూడా చదవండి

‘సేఫ్ కోలో, చాబి కిదర్ హై’.. ఇదే అతడు మాట్లాడిన తూటా లాంటి మాట. సేఫ్ కి రెండు తాళాలుంటాయనీ.. అదంత తేలిగ్గా తెరుచుకోదని చెప్పాడు క్యాషియర్. మరి నీ క్యాష్ బాక్స్‌లో ఎంతుంది అనగానే.. అతడు అడిగినట్టు చూపించాడు. అయితే బ్యాగ్ లో సర్దు అనగానే.. తుపాకీ భయానికి అతడు చెప్పినట్టు చేశాడు. అన్ని డ్రాలు ఓపెన్ చేసి చూపాడు. ఇంకా క్యాష్ ఎక్కడైనా ఉందా అన్న సెర్చింగ్ చేశాడా ఘరానా దొంగ. అన్నిటికీ సహకరించాడా క్యాషియర్. ఈ ఘటన నాడు సంచలనం సృష్టించింది. చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ విచారణ ఇప్పటికీ కొనసాగుతోంది.

ఠీవీగా వచ్చి బ్యాంకులో డబ్బు దోచుకెళ్లిన దొంగను అప్పటి నుంచి ఇప్పటి వరకూ పట్టుకోలేకపోయారు పోలీసులు. ఆ గజదొంగ జాడను ఇంకా పట్టుకోలేకపోతున్నారు పోలీసులు. ఘటన జరిగిన తర్వాత క్లూస్ టీం, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీములు అలర్ట్ అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా నాకాబందీ నిర్వహించారు. మెయిన్ సెంటర్లలో తనిఖీలు కూడా చేశారు. ఘటన జరిగి నెలలు గడుస్తున్నాయి.. కానీ ఆ దొంగ మాత్రం ఎంతకీ చిక్కడం లేదు. అప్పటికీ 13 బృందాలుగా విడిపోయి.. దొంగ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఫేస్ ను రికగ్నైజ్ చేయడంలో పూర్తి వైఫల్యం చెందారు. ఎంతకీ అతడి మొహాన్ని పసిగట్టలేక పోతున్నారు. ఇక రెండో క్లూ.. ఫింగర్ ప్రింట్స్.. చేతులకు గ్లౌజులు వేసుకుని రావడంతో ఆ ఛాన్సే లేకుండా పోయింది.

మిగిలిన ఒకే ఒక ట్రేసింగ్ ఛాన్స్.. అతడొచ్చిన బైక్.. దాని నెంబర్ ఇతర వివరాలు. బ్యాంకుకు దూరంగా బజాజ్ విక్రాంత్ బైక్ పార్క్ చేసి వచ్చినట్టు గుర్తించారు. ఆ బండి నెంబర్ కూడా పసిగట్ట లేక పోతున్నారు పోలీసులు. ఇవన్నీ అలా ఉంచితే.. బ్యాంకు నుంచి బయటకొచ్చాక. దొంగ వెళ్లిన దారైతే కనిపించింది.. కానీ ఆ తర్వాత ఎక్కడికెళ్లాడు? ఎటెళ్లాడన్నది? మాత్రం ఇప్పటికీ సస్పెన్సే.

ఇక మిగిలిన ఏకైక క్లూ.. అతడు మాట్లాడిన ఒకే ఒక్క హిందీ మాట. అంటే ఇక్కడి వాడు కాడు. నార్త్ నుంచి వచ్చి.. ఇక్కడ ఈ తరహా చోరీలు చేయడం.. తన సొంతూరు చెక్కేయడం.. ఈ దొంగ ఫార్ములా కావచ్చన్నది ఒక అంచనా. సరిగ్గా ఇదే ప్యాట్రన్‌లో ఇలాంటి బ్యాంకు చోరీలు ఏమైనా జరిగాయా అని చూస్తే అదీ కనిపించడం లేదు. ఇక బండి నెంబర్ ద్వారా ఏదైనా ఆచూకీ దొరుకుతుందా? అంటే అందుకూ రెండు రూట్లలో ట్రై చేశారు. ఒకటి దొంగ వాడిన బండి బజాజ్ విక్రాంత్ ఎంత మందికి ఉంది. వాటి వివరాలేంటి? ఇక రెండోది.. ఈ తరహా బండ్లు ఎవరైనా పోగొట్టుకున్నారా? ఆ దిశగా.. ఏమైనా కేసులు నమోదయ్యాయా? అని చూశారు. బజాజ్ విక్రాంత్ బండ్లు మొత్తం 13 వేల మందికి ఉన్నాయని తేలింది. కానీ అంతకన్నా మించి మరెలాంటి సమాచారం సాధించలేక పోయారు పోలీసులు.

ఇక పోతే.. చూచాయగా కనిపించిన బండి నెంబర్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా.. అక్కడా ఆశించినంత ఫలితం రాబట్ట లేకపోయారు. దీంతో ఈ దొంగ ఎవరు? అతడు ప్రొఫెషనలా? లేక క్రేజ్ కొద్దీ ఎవరైనా ఈ ట్రైల్ వేశారా? ఎంతకీ తేలడం లేదు. జిల్లా ఏర్పడ్డ తొలినాళ్లలో పోలీసులకు తగిలిన గట్టి దెబ్బ ఈ బ్యాంకు చోరీ కేసు. ఇప్పుడున్న టెక్నాలజీతో ఎంత పెద్ద కేసైనా ఇట్టే సాల్వ్ చేస్తుంటే.. ఈ ఒక్క కేసు మాత్రం ఇప్పటి వరకూ ట్రేజవుట్ కావడం లేదు. టెక్నాలజీ ఇంత విస్తృతంగా ఉన్న పరిస్థితుల్లో కూడా ఒక దొంగ తలుచుకుంటే ఇంత చాకచక్యంగా చోరీ చేయగలడా? ఇది సాధ్యమేనా? కనీసం క్లూ దొరక్కుండా జాగ్రత్త పడ్డం ఎలా వీలయ్యింది? అని ఆలోచించే కొద్దీ జిల్లా పోలీసు యంత్రాంగం బుర్ర తిరిగి పోతోంది. అదే సమయంలో ఇది ఆ దొంగ చాకచక్యమా? లేక పోలీసుల చేతగానితనమా? అనేది బ్యాంకు, పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..