AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆరు కోట్ల విలువైన భవనాన్ని ప్రభుత్వానికి రాసిచ్చిన మహిళలు..!

యాభై ఏళ్ల చరిత్ర కలిగిన భవనం అది.. దుర్గాభాయి దేశ్‌ముఖ్ చేతుల మీదుగా ప్రారంభం చేసుకున్న భవనం. ఎన్నో మహిళా ఉద్యమాలకు కేంద్రంగా నిలిచింది. స్త్రీ విద్య, స్వావలంబన, ఆర్ధిక పురోగతి వంటి అంశాలను అక్కడ పెద్ద ఎత్తున చర్చించేవారు.

Andhra Pradesh: ఆరు కోట్ల విలువైన భవనాన్ని ప్రభుత్వానికి రాసిచ్చిన మహిళలు..!
Tenali Mahila Mandali
T Nagaraju
| Edited By: Balaraju Goud|

Updated on: Sep 26, 2024 | 2:53 PM

Share

యాభై ఏళ్ల చరిత్ర కలిగిన భవనం అది.. దుర్గాభాయి దేశ్‌ముఖ్ చేతుల మీదుగా ప్రారంభం చేసుకున్న భవనం. ఎన్నో మహిళా ఉద్యమాలకు కేంద్రంగా నిలిచింది. స్త్రీ విద్య, స్వావలంబన, ఆర్ధిక పురోగతి వంటి అంశాలను అక్కడ పెద్ద ఎత్తున చర్చించేవారు. అయితే కాలక్రమంలో ఆ వెలుగులు తగ్గిపోయాయి. మారుతున్న కాలంతో పాటు మహిళల ఆలోచనలో మార్పు వచ్చింది. దీంతో ఎంతో ఇష్టంగా నిర్మించుకుని, నిర్వహించిన భవనం తన ప్రాభవాన్ని కోల్పోకుండా ఉంచేందుకు వారంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆరు కోట్ల విలువ చేసే ఆస్తిని ప్రభుత్వానికి రాసిచ్చారు.

1967లో గుంటూ జిల్లా తెనాలి పట్టణానికి చెందిన 100 మంది మహిళలు కలిసి తెనాలి మహిళా మండలిని ఏర్పాటు చేశారు. అంతా కలిసి విరాళాలు పోగు చేశారు. వారి మహిళా మండలి కోసం కొత్తపేటలో 514 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. అక్కడ భవనాన్ని నిర్మించి 1969లో దేశ్‌ముఖ్ చేతులుగా మీదుగా ప్రారంభించుకున్నారు. అప్పటి నుండి మహిళాభ్యుదయానికి ఈ భవనం కేంద్రంగా మారింది. చలసాని ఝాన్సీ వాణి, బోయపాటి సుభద్రాదేవి అధ్యక్ష, కార్యదర్శులుగా ప్రారంభమైన మహిళా మండలి గత నలభై ఏళ్లుగా అనేక కార్యక్రమాలు చేసింది. ప్రారంభ సభ్యురాలిగా ఉన్న కస్తూరిభాయి ఇరవై ఏళ్ల క్రితం అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. దంత వైద్యురాలిగా ఉన్న ఆమె మహిళాభుద్యుయం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. కుట్టు మిషన్లపై శిక్షణ, వైద్య శిబిరాలు, శాస్త్రీయ, సంగీత శిక్షణ వంటి కార్యక్రమాలు చేపట్టారు.

అయితే గత కొంతకాలంగా మహిళా మండలి సభ్యుల సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. కొంతమంది చనిపోతే మరికొంతమంది ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. ఈ క్రమంలోనే మహిళా మండలి నిర్వహణ కష్టంగా మారింది. అయితే మహిళా మండలి కింద ఉన్న భవనం స్థలంతో కలుపుకుని ఆరు కోట్ల రూపాయల విలువ చేస్తోంది. దాన్ని సంరక్షించుకునేందుకు ప్రభుత్వానికి అప్పగించాలన్న ఆలోచన సభ్యుల్లో వచ్చింది. వెంటనే తెనాలి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ కు విషయాన్ని చెప్పి, తాము ప్రభుత్వానికి భవనాన్ని రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. మంత్రి అందుకు సంతోషంగా అన్ని ఏర్పాట్లు చేశారు. మహిళా మండలి ఏ ఉద్దేశంతోనే ఏర్పడిందో ఆ లక్ష్యాలకు అనుగుణంగా భవనాన్ని నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో సభ్యులందరూ ఒప్పుకుని భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించారు.

మహిళా మండలి సభ్యులు విలువైన స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించడంపై పట్టణంలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం కూడా మహిళాభ్యుదయానికే భవనాన్ని ఉపయోగించాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..