Law Admissions: ‘ఇకపై లా కోర్సులు చదవాలంటే క్రిమినల్ బ్యాగ్‌గ్రౌండ్ తనిఖీ తప్పనిసరి..’ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) తాజాగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. న్యాయవాద వృత్తిలో పారదర్శకత, నైతిక ప్రమాణాలను పెంపొందించాలనే లక్ష్యంతో అనేక కొత్త నియంత్రణ చర్యలను తీసుకొచ్చింది. న్యాయ కళాశాలలు, విశ్వవిద్యాలయాలతో సహా అన్ని లీగల్ ఎడ్యుకేషన్ కేంద్రాలకు (CLEs) వర్తిస్తాయని ప్రకటించింది. న్యాయ విద్య, ఉద్యోగాల్లో చేరే వారికి తప్పనిసరిగా..
హైదరాబాద్, సెప్టెంబర్ 26: బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) తాజాగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. న్యాయవాద వృత్తిలో పారదర్శకత, నైతిక ప్రమాణాలను పెంపొందించాలనే లక్ష్యంతో అనేక కొత్త నియంత్రణ చర్యలను తీసుకొచ్చింది. న్యాయ కళాశాలలు, విశ్వవిద్యాలయాలతో సహా అన్ని లీగల్ ఎడ్యుకేషన్ కేంద్రాలకు (CLEs) వర్తిస్తాయని ప్రకటించింది. న్యాయ విద్య, ఉద్యోగాల్లో చేరే వారికి తప్పనిసరిగా క్రిమినల్ బ్యాగ్ గ్రౌండ్ చెక్ చేయాలని బీసీఐ స్పష్టం చేసింది. న్యాయవిద్య కోర్సుల్లో అభ్యర్థులకు మార్కుల మెమో, పట్టా ఇచ్చేముందు వారి పూర్వాపరాలను పరిశీలించాలని, నేరచరిత్ర ఉంటే తమ అనుమతి పొందిన తర్వాతే పట్టా ఇవ్వాలనే కఠిన నిబంధన విధించింది. ఈ మేరకు దేశంలో న్యాయవిద్య అందించే విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు ఆదేశాలు జారీచేసింది.
లా కోర్సులు అభ్యసించే విద్యార్థులకు నేరచరిత్ర ఉండరాదని, అందుకే క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ చెక్‌సిస్టమ్ (సీబీసీఎస్)ను అమలు చేస్తున్నట్లు పేర్కొంది. మార్కుల ధ్రువపత్రాలు, డిగ్రీ పట్టాలు జారీచేసే ముందు విద్యార్థుల నేరచరిత్రను తప్పని సరిగా పరిగణనలోకి తీసుకోవాలని, ప్రస్తుత ఎఫ్‌ఐఆర్, నేరంపై కేసు, శిక్ష తదితర వివరాలను వెల్లడించాలని స్పష్టం చేసింది. ఒకవేళ నేరచరిత్ర ఉంటే వివరాలను బీసీఐకి పంపించి, వారి నుంచి అనుమతి వచ్చాకే విద్యార్థులకు పట్టాలు అందించాలని పేర్కొంది. ఆయా నిబంధనలపై విద్యార్థులంతా హామీపత్రం కూడా సమర్పించాలంది. న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించే వ్యక్తులు క్లీన్ క్రిమినల్ రికార్డును కలిగి ఉండేలనే లక్ష్యంతో ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు పేర్కొంది.
బీసీఐ జారీ చేసిన కీలక ఆదేశాలు ఇవే..
- విద్యార్థుల హాజరును పర్యవేక్షించేందుకు ప్రతి లా కాలేజీ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలి. తరగతి గదులు, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి.
- లీగల్ ఎడ్యుకేషన్-2008 నిబంధనల ప్రకారం… ఎల్‌ఎల్‌బీలో చేరేముందు విద్యార్థులు తప్పనిసరిగా ఇతర రెగ్యులర్ కోర్సులు చదవడం లేదని హామీపత్రం ఇవ్వాలి. ఈ నిబంధన ప్రకారం ఏకకాలంలో మరొక డిగ్రీని అభ్యసించడం నేరం. అంతేకాకుండా విద్యార్థులు అభ్యసిస్తున్న ఎల్‌ఎల్‌బి కోర్సుపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించడానికి దోహదపడుతుంది. ఒకవేళ ఎవరైనా ఏక కాలంలో మరో కోర్సు చదువుతున్నట్లు తేలితే వారి డిగ్రీ రద్దు అవుతుంది.
- తమ యాజమాన్యాల నుంచి నిరభ్యంతర ధ్రువపత్రం (ఎన్‌వోసీ) ఇస్తే మినహా.. ఎల్‌ఎల్‌బీ విద్యార్థులు తాము ప్రస్తుతం ఉద్యోగం చేయడం లేదని వెల్లడించాలి.
- అలాగే ఎల్ఎల్‌బీ విద్యార్ధులు తమ ఉద్యోగ స్థితిని కూడా తెలియజేయాలి. LLB ప్రోగ్రామ్‌లో ఎటువంటి హోదాలో ఉద్యోగం చేయకూడదు.