Darshi TDP win: ఫలించిన టీడీపీ వ్యుహం.. దర్శి నగర పంచాయతీలో విజయ దుందుభి.. కారణం అదేనా!
తొలిసారి దర్శి నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో టీడీపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
Darshi nagara panchayat TDP Win: అనుకున్నట్టే జరిగింది. ప్రకాశంజిల్లా దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ విజయ దుందుభి మోగించింది. దర్శి వైసీపీలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు ఆ పార్టీ కొంపముంచింది. దర్శి వైసిపిలో లుకలుకలను టీడీపీ క్యాష్ చేసుకుంది. దర్శిలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు తమ్ముడు పిచ్చయ్యను వ్యూహాత్మకంగా పోటీ చేయించి విజయం సొంతం చేసుకుంది.
తొలిసారి దర్శి నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో టీడీపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర మొత్తం అధికార పార్టీ ఫ్యాన్ గాలి వీస్తుంటే దర్శిలో అనుహ్యంగా టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. దర్శి నగర పంచాయతీలో మొత్త 20 వార్డుల గానూ టీడీపీ 13 వార్డులు గెలుపొందగా, 7 స్థానాలు వైసీపీకి దక్కాయి. మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తల సంబరాలు చేసుకున్నారు.
దర్శిలో టీడీపీ వ్యూహం ఫలించింది. మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు తమ్ముడు పిచ్చయ్యను ఛైర్మన్ అభ్యర్ధిగా ప్రకటించి 11వ వార్డు నుంచి పోటీ చేయించడంతో ఈ గెలుపు సాధ్యమైంది. అంతేకాకుండా టీడీపీకి చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామిలు దర్శిలోనే మకాం వేసి టీడీపీ అభ్యర్ధుల విజయానికి కృషి చేశారు. టీడీపీ ఎమ్మెల్యేల టీమ్ వర్క్ దర్శి నగర పంచాయతీపై పసుపు జెండా ఎగిరేలా చేసింది. రాష్ట్రంలో జరిగిన ఎనిమిది మున్పిపాలిటీ ఎన్నికల్లో ఏడు చోట్ల వైసీపీ విజయం సాధించగా ఒక్క దర్శిలోనే టీడీపీ విజయం సాధించడం ఆపార్టీకి ఊరట కలిగించే అంశం. దర్శి నగర పంచాయతీ ఛైర్మన్ అభ్యర్దిగా ముందుగానే 11వ వార్డులో పోటీచేసిన నారపుశెట్టి పిచ్చయ్యను అధిష్టానం ప్రకటించడంతో పిచ్చయ్య తొలి నగర పంచాయతీ ఛైర్మన్‌గా ఎన్నిక కానున్నారు.