Andhra News: బయటనుంచి చూస్తే రేకుల షెడ్డు.. లోపలికెళ్తే మైండ్ బ్లాక్.. అసలు మ్యాటర్ తెలిస్తే..
గుంటూరు జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పక్కా సమాచారంతో ఓ రేకుల షెడ్డు నివాసంలో సోదాలు జరిపిన పోలీసులకు ఏకంగా కోటిన్నర రూపాయలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు దొరికాయి. చూస్తే రేకుల షెడ్డు.. మరి ఇంత బంగారం, వారికెలా వచ్చిందని స్థానికులంతా షాకవుతున్నారు. ఇంతకు వారి దగ్గరకు ఆ బంగారం, వెండి ఎలా వచ్చిందో తెలుసుకుందాం పదండి.

రేకుల షెడ్డు ఇంట్లో రూ.1.5 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు దొరకడం తెనాలి బాలాజీ రావుపేటలోని తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. మహేంద్ర కాలనీలోని ఒక రేకుల ఇంట్లో గురవమ్మ అనే మహిళ తన కుటుంబంతో నివసిస్తుంది. గురవమ్మ భర్త పొట్టు బండి తోలుతుంటాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత కొన్నేళ్ల క్రితం పెద్ద కుమార్తెను విజయవాడకు చెందిన గురనాథం అనే వ్యక్తి ఇచ్చి వివాహం చేశారు. అయితే సడెన్‌గా నిన్న సాయంత్రం గురవమ్మ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున పోలీసులు వచ్చారు. ఇంటిలో సోదాలు నిర్వహించారు.
అయితే పోలీసుల తనిఖీల తర్వాత షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఈ తనిఖీల్లో గురువమ్మ ఇంట్లో ఏకంగా 800గ్రాముల బంగారు ఆభరణాలు, 15 కేజీల వెండి ఆభరణాలు దొరికాయి. వీటి విలువ 1.5కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. రేకుల ఇంట్లో ఇంత పెద్ద ఎత్తున బంగారం, వెండి దొరకటంతో స్థానికులంతా నోరెళ్లబెడుతున్నారు.
అయితే ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అవి ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై దర్యాప్తు చేపట్టగా.. గురువమ్మ అవి తన అల్లుడైన గురనాథంకు చెందినవని చెప్పింది. గురునాథం విజయవాడలోని చాక్లెట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే తను కూడా బంగారం, వెండి తనదేనని పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత అతను కనిపించకుండా పోయాడు. దీంతో అతనిపై నేర చరిత్ర పోలీసులు పరిశీలించారు. కానీ ఇప్పటి వరకు గురునాథంపై ఎటువంటి కేసులు నమోదు కానట్టు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారం, వెండిని ఇన్ కంట్యాక్స్ అధికారులకు అప్పగించనున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
