AP Politics: విశాఖలో టీడీపీ జోన్ వన్ మీటింగ్.. రుషికొండను బోడికొండను చేశారని చంద్రబాబు ఆగ్రహం
క్యాపిటల్ పేరు చెప్పి విశాఖను ఇష్టానుసారం దోచేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై విచారణ చేయిస్తామని ఆయన హెచ్చరించారు. తిరుగుబాటు.. రాజకీయ చైతన్యం ఉత్తరాంధ్ర నుంచే మొదలు కావాలని ఆయన ఆకాంక్షించారు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అది రుజువైందన్నారు చంద్రబాబు.
టీడీపీ జోన్ వన్ ప్రాంతీయ సదస్సుకు తెలుగు తమ్ముళ్ల రాకతో విశాఖపట్నం సందడిగా మారింది. మూడు జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. మాజీ మంత్రులు, సీనియర్ నేతలు సమావేశానికి తరలి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ 160 సీట్లలో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జోస్యం చెబితే.. రాష్ట్ర ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత మొదలైందని నాయకులు తమ ప్రసంగాల్లో అభిప్రాయ పడ్డారు. వైసీపీ వ్యతిరేక ఓటర్లను తొలగించడం.. దొంగ ఓట్లను చేర్చే ప్రక్రియ జోరుగా సాగుతోందని.. వీటిపై అప్రమత్తంగా ఉండాలని తెలుగు తమ్ముళ్లను హెచ్చరించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఉత్తరాంధ్రలో టీడీపీ బలోపేతానికి.. వచ్చే ఎన్నికల్లో మరింత పుంజుకోవడానికి చేయాల్సిన అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు.
అభివృద్ధి పేరుతో విశాఖపట్నాన్ని వైసీపీ ప్రభుత్వం సర్వ నాశనం చేసిందని మండిపడ్డారు చంద్రబాబు. టీడీపీ అధికారంలోకి రాగానే సిట్ వేసి ఎవరి ఆస్తులు వాళ్లకు ఇస్తామని ఆయన చెప్పారు. విశాఖలో వైఎస్ అనీల్ రెడ్డి చేస్తోన్న భూదందాలలో ఎవరి వాటా ఎంతో తేలాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. రుషికొండను బోడికొండను చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. టీడీపీ పవర్ చేపట్టగానే బాధ్యులను కఠినంగా శిక్షిస్తుందని.. తప్పు చేసిన వాళ్లు తప్పించుకోలేరని హెచ్చరించారు టీడీపీ అధినేత.
టీడీపీలో గ్రూపులు కడితే ఎవరికీ పదవులు రావని పార్టీ నేతలకు చురకల వేశారు చంద్రబాబు. అందరి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నానని.. టీడీపీ కోసం త్యాగాలు చేసిన వారికే ప్రాధాన్యం ఉంటుందని తేల్చేశారు పార్టీ చీఫ్. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన జోష్.. సమావేశానికి హాజరైన టీడీపీ నేతల్లో కనిపించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.