Chandrababu Letter to DGP: అక్రమ కేసులతో వేధింపులు ఆపండి.. ఏపీ డీజీపీకి లేఖ రాసిన టీడీపీ అధినేత చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు టీడీపీ నేతలపై అక్రమ కేసు నమోదు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Chandrababu Letter to DGP: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు టీడీపీ నేతలపై అక్రమ కేసు నమోదు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కర్నూలు జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి, ఆయన అనుచరులను అక్రమంగా అరెస్టు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఇప్పటికైనా ఇటువంటి తప్పుడు కేసులు మోపడం ఆపాలని ఆయన రాష్ట్ర డీజీపీని కోరారు. ‘తన ఇంటిపైకి దాడికి ప్రయత్నించిన వారిని మాజీ ఎమ్మెల్యే అడ్డుకున్నారు. కానీ వారిచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయ న్ను, ఆయన అనుచరులను అరెస్టు చేయడం దారుణమని డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఆదివారం అర్ధరాత్రి సమాచారం లేకుండా జనార్థన్ రెడ్డి ఇంటిపై పోలీసులు దాడి చేసి, మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేశారు. కానీ జనార్దన్‌రెడ్డితో పాటు మరో ఇద్దరిని మాత్రమే మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మరో ఆరుగురి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో రాసినా వారిని మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టలేదు. వారిని బెదిరించి జనార్దన్‌రెడ్డికి వ్యతిరేకంగా అంగీకార పత్రాలు తీసుకోవడానికే పోలీసులు అక్రమంగా నిర్బంధించినట్లు చంద్రబాబు ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇదే లేఖను కర్నూలు జిల్లా ఎస్పీకీ పంపారు.
ఇదే అంశానికి సంబంధించి ఏపీ టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అక్రమ కేసులతో వేధించడమే వైసీపీ పనిగా మారిందని విమర్శించారు. పోలీసులు ఉన్నది దొంగలకు రక్షణ కల్పించడానికా? అని నిలదీశారు. జనార్దన్ రెడ్డి విషయంలో అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతామని చెప్పారు.