TDP Polit Bureau Meet: టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయాలు.. త్వరలో ఏపీలో జన్మభూమి-2
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. గురువారం(ఆగస్ట్ 8) మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఈ సమావేశం జరిగింది.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. గురువారం(ఆగస్ట్ 8) మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్ర మంత్రులు, పాలిట్‌బ్యూరో సభ్యులకు అధినేత చంద్రబాబు పలు కీలక సూచనలు చేశారు. రెండున్నర గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో నామినేటెడ్ పదవులపై ప్రధానంగా చర్చించారు. అలాగే త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది.
పొలిట్ బ్యూరో సమవేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి అచ్చెన్నాయుడు మీడియాకు వివరించారు. తెలంగాణాలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు దృష్టి సారించాలని నిర్ణయించామన్నారు అచ్చెన్నాయుడు. దక్షిణ భారతదేశంలో జనాభా నిష్పత్తి రోజురోజుకూ తగ్గుతూ వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు సైతం తగ్గుతాయన్నారు. టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించామన్నారు. సభ్యత్వ రుసుం రూ.100 లతో ప్రారంభిస్తామన్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ప్రమాద బీమా ద్వారా వారి కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం అందేలా బీమా కల్పిస్తామన్నారు.
పొలిట్ బ్యూర్ భేటీలో ప్రధానంగా పేదరిక నిర్మూలనపై చర్చ జరిగిందన్నారు. పేదరిక నిర్మూలనకు త్వరలో విధివిధానాలు రూపొందిస్తామన్నారు అచ్చెన్నాయుడు. విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని పేదరిక నిర్మూలన కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని నిర్ణయించామన్నారు. జన్మభుమి కార్యక్రమాలు తిరిగి ప్రారంభించేందుకు రాష్ట్ర సర్కార్ రెఢి అయ్యిందన్న అచ్చెన్నాయుడు.. జన్మభూమి2 గా నామకరణం చేశామన్నారు. దేశంలోనే తొలిసారిగా ఏపీలో నైపుణ్య గణన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..