TDP MLC: విజేతగా ప్రకటించారు.. డిక్లరేషన్‌ ఇవ్వడం మరిచారు.. కౌంటింగ్‌ కేంద్రం దగ్గర రాత్రంతా హై టెన్షన్..

పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఫలితంపై వివాదం నెలకొంది. టీడీపీ అభ్యర్ధి రామగోపాల్‌రెడ్డి గెలిచినా.. ఆర్వో డిక్లరేషన్‌ ఇవ్వకపోవడంతో పెద్ద చర్చ జరిగింది. టీడీపీ ఆందోళనతో కౌంటింగ్‌ కేంద్రం దగ్గర రాత్రంతా హైడ్రామా నడిచింది. కలెక్టర్‌ నాగలక్ష్మి వాహనాన్ని అడ్డుకుని నానా హంగామా చేశారు టీడీపీ నాయకులు.

TDP MLC: విజేతగా ప్రకటించారు.. డిక్లరేషన్‌ ఇవ్వడం మరిచారు.. కౌంటింగ్‌ కేంద్రం దగ్గర రాత్రంతా హై టెన్షన్..
TDP
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 19, 2023 | 7:19 AM

మూడు రోజుల పాటు అధికార, ప్రతిపక్ష పార్టీలకు ముచ్చెమటలు పట్టించిన.. పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో విజయం టీడీపీని వరించింది. రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డిపై 7543 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే, విజేతగా ప్రకటించినా.. డిక్లరేషన్‌ ఇవ్వడంలో జాప్యం జరిగింది. దీంతో టీడీపీ ఆందోళనతో కౌంటింగ్‌ కేంద్రం దగ్గర రాత్రంతా హైడ్రామా నడిచింది. శనివారం రాత్రి 8 గంటలకు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించినా, అర్ధరాత్రి 12 గంటల వరకూ ధ్రువీకరణపత్రం అందించలేదు.

దీనిపై ఆగ్రహించిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి, శ్రీసత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్థసారథి, కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరాం, కళ్యాణదుర్గం నియోజకవర్గ బాధ్యుడు ఉమామహేశ్వరనాయుడు తదితరులు జేఎన్‌టీయూ గేటు ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు.

కలెక్టర్‌ నాగలక్ష్మి వాహనాన్ని అడ్డుకుని నానా హంగామా చేశారు టీడీపీ నాయకులు. దీంతో వారిని అరెస్టు చేసి, మూడో పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. దీనిపై ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. స్టేషన్‌ వద్ద కూడా నిరసన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి 1.30 వరకూ నేతలను పోలీసు స్టేషన్‌లోనే ఉంచారు.

టీడీపీ ఆందోళనకు కారణం ఇదే..

అధికారికంగా ఎన్నికల కమిషన్ అనుమతి పొందిన తర్వాతే.. రామగోపాల్ రెడ్డి గెలుపుని ప్రకటిస్తామని రిటర్నింగ్ అధికారి చెప్పడంతో.. వివాదం మొదలైంది. గెలిచినవారికి వెంటనే డిక్లరేషన్‌ ఇవ్వాలంటూ టీడీపీ ఆందోళన చేపట్టింది. డిక్లరేషన్ ఇవ్వకపోవడం వెనక మతలబేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు టీడీపీ నేతలు.

గెలుపుపై బాలయ్య ఇలా స్పందించారు..

ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో… జోష్‌ మీదుంది ప్రతిపక్ష టీడీపీ. ఉత్తరాంధ్రతో పాటు, రాయలసీమ జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థుల విజయంపై… ట్విట్టర్‌ వేదికంగా సంతోషం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఇది ప్రజా విజయమనీ… మార్పునకు శ్రీకారమనీ అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి శుభసూచకమన్నారు చంద్రబాబు. ఈ రిజల్ట్స్‌పై ఎమ్మెల్యే బాలకృష్ణ సైతం తనదైన స్టయిల్‌లో స్పందించారు. ఈ ఎన్నికల్లో యువతరం… వైసీపీని తొక్కిపట్టి నారతీశారంటూ సెటైర్లు వేశారు. వైనాట్‌ 175 అంటూ జగన్‌ ఇప్పుడంటే వినాలని ఉందంటూ ఎద్దేవా చేశారు బాలయ్య.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం