Chandrababu Naidu: యువతకు చంద్రబాబు బంపర్ ఆఫర్.. ఆవిర్భావ వేడుకల్లో టీడీపీ అధినేత కీలక ప్రకటన..
TDP Chief Chandrababu Naidu: వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఆవిర్భావం దినోత్సవం రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 83 ఫార్ములాను తెరపైకి తెచ్చారు.
TDP Chief Chandrababu Naidu: వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఆవిర్భావం దినోత్సవం రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 83 ఫార్ములాను తెరపైకి తెచ్చారు. వచ్చే ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యంపై టీడీపీ చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. 1983లో వచ్చినట్లు మళ్ళీ యువత క్రీయాశీల రాజకీయాల్లోకి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీకి మరో 40 ఏళ్లకు సరిపోయే నాయకత్వం ఇస్తామని తెలుగుదేశం 40వ (TDP Formation Day) ఆవిర్భావ వేడుకల్లో చంద్రబాబు స్పష్టంచేశారు. దీనిలో భాగంగా వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే ఇస్తానని.. న్యాయం కోసం పోరాడాలంటూ చంద్రబాబు సూచించారు. సీనియర్లను గౌరవించడంతోపాటు యువతకు పార్టీలో ప్రాధాన్యం కల్పిస్తానని తెలిపారు. టీడీపీ గెలుపు చారిత్రక అవసరం అని యువత గుర్తించాలని చంద్రబాబు కోరారు. పేదరికం పోవాలన్నా, సామాన్య ప్రజల కష్టాలు తీరాలన్నా తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి రావాలని చంద్రబాబు పేర్కొన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఏర్పాటు చేసిన తెలుగుదేశం 40వ ఆవిర్భావ వేడుకల్లో పార్టీ అధినేత చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీని బలపరచాల్సిన బాధ్యత రెండు తెలుగు రాష్ట్రాలపైనా ఉందన్నారు. రాజకీయాల్లో గాడ్ ఫాదర్ లేడని భయపడొద్దని.. సమాజహితం, రాజకీయాల్లో మార్పు తేవాలనుకుంటున్న వారు రాజకీయాల్లోకి రావాలని.. ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు.
40 ఏళ్లుగా ప్రజాసేవకు అంకితమయ్యామన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. తాము సాధించిన విజయాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. తెలుగువారి గుండెచప్పుడు టీడీపీ అని.. తెలుగువారిలో నరనరాన ఇమిడిపోయిందన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజాపక్షామే అని స్పష్టం చేశారు. దూరదృష్టితో జీనోమ్ వ్యాలీ పెట్టిన కారణంగా అక్కడి నుంచి కరోనా వ్యాక్సిన్ రావడం టీడీపీ ఘనత అని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 40 దేశాల్లో 200 నగరాల్లో టీడీపీ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయని.. ఒక రాజకీయ పార్టీ 41సంవత్సరంలోకి అడుగుపెట్టడం అరుదైన అవకాశం అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
కాగా.. హైదరాబాద్‌లో ఎన్టీఆర్ పార్టీ ప్రకటించిన ఆదర్శ్ నగర్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు ముందుగా సందర్శించారు. అక్కడ జెండా ఎగురవేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ఘాట్ సందర్శించి నివాళి అర్పించారు. అక్కడి నుంచి ఎన్టీఆర్ భవన్‌కు చేరుకొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. మొదటి నుంచి పార్టీతో మమేకమై, 40 ఏళ్లుగా సేవలందించిన నాయకులకు సన్మానం చేశారు.
Also Read: