Andhra Pradesh: మద్యం షాపుల్లో పనిచేస్తున్న సిబ్బంది కొలువులు ఉంటాయా.. ఊడుతాయా

వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం.. కీలక సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది. వైసీపీ ప్రభుత్వ విధానాలను ఒక్కొక్కటిగా పక్కన పెడుతోంది. అయితే మారిన ప్రభుత్వ విధానాలతో ఇప్పటికే టెన్షన్‌ పడుతున్న వాలంటీర్లకు..మద్యం షాపుల్లో పనిచేస్తున్న సిబ్బందికి కూడా తోడయ్యారు. కొలువులు ఉంటాయా..ఊడుతాయా అని టెన్షన్‌ పడుతున్నారు.

Andhra Pradesh: మద్యం షాపుల్లో పనిచేస్తున్న సిబ్బంది కొలువులు ఉంటాయా.. ఊడుతాయా
Liquor Shop
Follow us

|

Updated on: Sep 25, 2024 | 9:38 AM

ఐదేళ్లలో మద్యపాన నిషేదాన్ని అమలు చేస్తామన్న గత జగన్‌ ప్రభుత్వం.. అందులో భాగంగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం షాపులను ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించి మద్యం విక్రయాలు జరిపారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం..మళ్లీ పాత మద్యం విధానాన్నే అమల్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు త్వరలోనే నోటిఫికేషన్‌ కూడా విడుదల కానుంది. అయితే కొత్త మద్యం పాలసీ అమల్లోకి వస్తే..తాము ఉపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..ప్రస్తుతం ఆయా మద్యం షాపుల్లో పనిచేస్తున్న సిబ్బంది.

మద్యం షాపులను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించినా తమకు అభ్యంతరం లేదని అయితే ఆ షాపుల్లో తమకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు..సిబ్బంది. ఈ మేరకు విశాఖ జిల్లా జెర్రిపోతులపాలెం మద్యం డిపో ముందు ఆందోళన చేసిన ఉద్యోగులు..డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందించారు.

గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 ఆగ‌స్టు 15న వాలంటీర్ల వ్యవ‌స్థను తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షలకు పైగా వాలంటీర్లతో గ్రామ‌, వార్డు వాలంటీర్ వ్యవ‌స్థను అమ‌లు చేసింది. వాలంటీర్‌కు ప్రతి నెలా రూ.5 వేల వేత‌నం ఇచ్చేది..గత ప్రభుత్వం. వాలంటీర్‌ వ్యవస్థను కొనసాగిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు..వారి వేతనం కూడా పదివేలకు పెంచుతామని ప్రకటించారు. అయితే వంద రోజుల పాలన పూర్తయినా కూడా.. వాలంటీర్ల వ్యవస్థపై ఇంకా ఎటూ తేల్చలేదు కూటమి ప్రభుత్వం. అలాగే కొత్త ప్రభుత్వం అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన‌ప్పటి నుండి వారికి గౌర‌వ వేత‌నం కూడా అంద‌డం లేదు. దీంతో ఆందోళన బాట పట్టారు..వాలంటీర్లు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు త‌మ‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాల‌ని.. పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. మరి మద్యం షాపుల్లో పనిచేస్తున్న సిబ్బందితో పాటు..వాలంటీర్లకు ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇస్తుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..