Village Lockdown: ఆ గ్రామంలో అకస్మాత్తుగా మరణాలు.. దుష్ట శక్తుల వల్లనే మరణిస్తున్నారంటూ ఊరు చుట్టూ కంచె.. తాంత్రిక పూజలు

Village Lockdown: ఆ గ్రామంలో అనుకోకుండా ఒక్కసారిగా అలజడి రేగింది. సమీప కాలంలోనే వరుసగా గ్రామ పెద్దలు కొంతమంది చనిపోయారు. ఎక్కువ మంది ఎలాంటి అనారోగ్యం లేకుండా, హాస్పిటల్ కు వెళ్లేంత..

Village Lockdown: ఆ గ్రామంలో అకస్మాత్తుగా మరణాలు.. దుష్ట శక్తుల వల్లనే మరణిస్తున్నారంటూ ఊరు చుట్టూ కంచె.. తాంత్రిక పూజలు
Lockdown In Vennela Valasa
Follow us

|

Updated on: Apr 22, 2022 | 6:21 AM

Village Lockdown: ఆ గ్రామంలో అనుకోకుండా ఒక్కసారిగా అలజడి రేగింది. సమీప కాలంలోనే వరుసగా గ్రామ పెద్దలు కొంతమంది చనిపోయారు. ఎక్కువ మంది ఎలాంటి అనారోగ్యం లేకుండా, హాస్పిటల్ కు వెళ్లేంత సమయం కూడా లేకుండానే. దీంతో ఆ ఊరి ప్రజలు భయపడిపోయారు, ఊరికి పిశాచులు వచ్చాయని, దుష్ట శక్తుల(Black Magic) ప్రభావం వల్లే చనిపోతున్నారని నిర్ధారణకు వచ్చారు. గ్రామ దేవత ని నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పాపం అని భావించారు. వెంటనే విజయనగరం లో పిశాచుల పూజలు చేసే వాళ్ళను పిలిపించారు. అందులో భాగంగా ఊరి చుట్టూ వలయం లా ముళ్ల కంచె వేశారు. వారం పాటు ఊరి జనం బయటకు వెళ్లకుండా, బయట వాళ్ళు ఊరికి రాకుండా నిరోధించాలని కట్టుబాటు విధించుకున్నారు. అందరూ కలిసికట్టుగా పూజలు చేస్తున్నారు. ఇలా ఒక బలమైన నమ్మకం మూఢ నమ్మకంగా మారింది. కరోనా లేకుండానే లాక్ డౌన్ తనకు తానే స్వయంగా విధించుకుంది ఆ గ్రామం.

వెన్నెల వలస… శ్రీకాకుళం పట్టణానికి 24 కిలోమీటర్ల దూరంలో సరబుజ్జిలి మండల కేంద్రానికి సమీపంలో ఉన్న ఒక గిరిజన గ్రామం. కేవలం 35 కుటుంబాలు నివసించే ఈ గ్రామంలో 175 మంది నివాసముంటారు. గ్రామంలో ఉన్నవాళ్ళందరు బంధువులే. వ్యవసాయం వీరి ప్రధాన వృత్తి. గిరిజన గ్రామమే అయినా మైదాన ప్రాంతం కావడంతో కొండ ప్రాంత గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు తక్కువగానే పాటించేవారు. ఊర్లో అంగన్వాడీ పాఠశాల, ప్రాధమిక పాఠశాల, సమీపంలోనే జవహర్ నవోదయ విద్యాలయం లాంటివి ఉండడంతో గ్రామంలో యువత దాదాపు అందరూ ప్రాధమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. సామాజిక సమస్యలపై అవగాహన ఉంది. తక్కువ కుటుంబాలు, దాదాపు అందరికీ పొలం ఉండడంతో పెద్దగా ఆదాయం రాకపోయినా దైనందిన అవసరాలకు ఇబ్బంది లేకుండా సాఫీగా సాగిపోతున్న పరిస్థితి ఆ గ్రామంలో ఉండేది.

అలా సాఫీగా సాగుతోన్న వాళ్ళ జీవితాల్లో ఆకస్మికంగా ఒక అలజడి రేగింది. 5 నెలల కాలంలో గ్రామంలో పెద్ద మనుషులుగా చలామణి అయ్యే ముగ్గురు వ్యక్తులు హఠాన్మరణం చెందారు. మొదటగా ఆనందయ్య మృతి చెందారు, ఆయన మృతి చెందే అంత అనారోగ్య పరిస్తితులేమీ లేవు, ఆయన వయసు 50 సంవత్సరాలు. వంట్లో నలతగా ఉండడంతో హాస్పిటల్ కి తీసుకెళ్లారు, పరీక్షల అనంతరం ఏమీ అనారోగ్య కారకాలు లేవని ఇంటికి పంపించేసారు వైద్యులు. ఇంటికి వచ్చిన వెంటనే ఆయన చనిపోయారు. ఆనందయ్య మరణం ఆ గ్రామ ప్రజలకు జీర్ణం కాలేదు కానీ విధిరాత గా భావించారు. ఆయన మరణాన్ని మర్చిపోతున్న క్రమంలో ఈ మార్చి లో 48 ఏళ్ల మరో పెద్ద మనిషి బొడ్డిక పున్నయ్య ఆకస్మికంగా మృతిచెందారు. ఆయనకు ఎలాంటి అనారోగ్యం లేదు. ఆరోగ్యంగానే ఉన్నాడు. దవడ నొప్పిగా ఉందంటూ చెప్పాడు, అరగంట లోపే ప్రాణాలు వదిలాడు, కనీసం హాస్పిటల్ కి తీసుకెళ్లమని కూడా అడగలేదు, అంత అవసరం ఉందని కూడా ఎవరూ గుర్తించలేదు. ఆరోగ్యంగా ఉంటూ, అందరితో అప్పటివరకు కలివిడిగా తిరిగిన వ్యక్తి ఆకస్మికంగా మరణించడం ఆగ్రామాన్ని షాక్ కు గురిచేసింది. తక్కువ సమయంలో రెండో పెద్దమనిషి చనిపోవడం తో గ్రామంలో కొంత భయం నెలకొంది.

ఆ షాక్ నుంచి తెరుకోక మునుపే బోడ్డిక పున్నయ్య సోదరుడు బొడిక బంగారయ్య కూడా విచిత్రంగా అదే దవడ నొప్పి అని చెబుతూ 15 నిమిషాల్లోనే మరణించారు. అప్పటికే అదే దవడ నొప్పితో బాధపడుతున్నట్టు చెప్పి పున్నయ్య ఆకస్మికంగా మరణించడం, బంగారయ్య కూడా అవే లక్షణాలు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 108 కి ఫోన్ చేశారు. అంబులెన్స్ ఉరిలోకి వచ్చేలోపే బంగారయ్య చనిపోయాడు. బంగారయ్య గ్రామ పెద్ద. ఎప్పుడూ వైట్ అండ్ వైట్ డ్రెస్ లో ఉంటూ ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా ఉత్సాహంగా తిరుగుతూ అందరికి సహాయం చేసే బంగారయ్య కాలాతీత మరణంతో ఊరంతా వనికిపోయింది.

అప్పటికే భయం లో ఉన్న గ్రామస్తులు బంగారయ్య మరణంతో ఇవి సహజ మరణాలు కావన్న అభిప్రాయానికి వచ్చారు. ఏదో దుష్ట శక్తి నో, పిశాచమో, దెయ్యమో తమ గ్రామాన్ని పట్టి పీడిస్తోందన్న భావానికి వచ్చారు. లేదంటే ఇలా వరుస మరణాలు జరగవని భావించడం మొదలు పెట్టారు. గ్రామస్తులంతా గ్రామదేవత గుడి వద్ద సమావేశమయ్యారు. గ్రామ దేవత అనుగ్రహం లేకపోవడం వల్లే ఇలా జరుగుతుందని, గిరిజన ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు పాటించడం మానేసినందువల్లే ఇలా జరుగుతోందని వెంటనే గ్రామ దేవతకు శాంతి పూజలు తో పాటు గ్రామానికి పట్టిన పిశాచాన్ని వదిలేంచేందుకు తాంత్రిక పూజలు చేయాలని, లేదంటే ఇంకా మరణాలు సంభవిస్తాయని నిర్ణయించారు.

వెంటనే వారి తెగ లోనే తాంత్రిక పూజలు చేసే విజయనగరం, ఒడిశా లకు చెందిన తాంత్రిక పూజలు చేసే యజ్ఞులను సంప్రదించారు. గ్రామానికి పట్టిన పిశాచాన్ని వదిలించాలంటే ఊరు ఊరంతా వారం రోజులపాటు పూజలు చేయాలని, ఆ సమయంలో గ్రామస్తులు బయటకు వెళ్లకుండా, బయటవాళ్ళు లోనికి రాకుండా గ్రామాన్ని అష్టదిగ్బంధనం చేయాలని సూచించారు. పూజకు అవసరమైన మొత్తాన్ని గ్రామం అంతా పంచుకుని వసూలు చేశారు. ఒక్కో కుటుంబానికి 1200 వరకు వసూళ్లు చేశారు. అందరికీ ఒకే చోట భోజనాలు వండుతూ తాంత్రిక పూజలు ప్రారంభించారు.

అదే క్రమంలో తమ గ్రామంలో ఉన్న పాఠశాల కు టీచర్ ని ఒక వారం పాటు పంపవద్దంటూ ఎం ఈ ఓ కి కూడా సమాచారమిచ్చామని చెబుతున్నారు గ్రామస్తులు. అంగన్వాడీ స్కూల్ ని కూడా మూసివేశారు. పూజలు ప్రారంభించి గ్రామ శివార్లలో ప్రత్యేక కట్టుబడులను నిర్మించారు. అది దాటుకుని పిశాచులు రాలేవని గ్రామస్తులను నమ్మించారు. పిశాచులు ఉన్నాయా, ఉంటే వాటిని ఇవి అడ్డుకోగలవా అంటే, దేవుడు ఉంటే పిశాచాలు ఉన్నట్టే అని గట్టిగా నమ్ముతున్నారు గ్రామస్తులు, నమ్మడమే కాదు తిరిగి ప్రశ్నిస్తున్నారు కూడా, పిశాచాలు మీకు ఎప్పుడైనా కనిపించాయా అంటే దేవుడు మీకు ఎప్పుడైనా కనిపించారా? దేవుడు ఉన్నారని నమ్మితే పిశాచాలు ఉన్నట్టే అంటూ ఎదురు చెప్తూ, మనల్ని కూడా ఒప్పించేంత ప్రయత్నం చేస్తున్నారు ఆ గ్రామస్తులు.

ఆ నోటా, ఈ నోటా ఈ విషయం తెలిసి స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ అక్కడకు పోలీసులను అక్కడకు పంపారు. ఆ ముళ్ల కంచెను తొలగించి వాళ్ళల్లో చైతన్యాన్ని కలిగించే ప్రయత్నం చేసమంటున్నారు ఆముదాల వలస సీఐ. గ్రామంలో అందరిని కూర్చోబెట్టి మూఢనమ్మకాలపై చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏమాత్రం కన్విన్స్ అవడం లేదు. వచ్చే సోమవారం దాకా మా కట్టుబాట్లు కొనసాగుతాయని, ఆ తర్వాత మాట్లాడదామని చెబుతున్నారని ఎంపీడీవో తెలిపారు. శాస్త్రీయత ను ప్రచారం చేయాల్సిన ప్రభుత్వాలే పూజలు, మతాల పేరుతో రాజకీయాలు చేస్తుంటే అమాయక గిరిజనులు ఎలా మారుతారంటూ ప్రశ్నిస్తూనే శాస్త్రీయ అవగాహన పెంపొందించేందుకు అందరం కృషి చేయాల్సిన అవసరం ఉందని మానవ హక్కుల నేత జగన్నదరావు చెప్పారు.

గ్రామస్తులకు ఎవరైనా కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా వాళ్లపై తిరగబడి ఉక్కిరిబిక్కిరి చేసే ప్రశ్నలు సంధిస్తు అక్కడనుంచి వారిని వెళ్లాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తుల్లో చైతన్యాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, జనవిజ్ఞాన వేదిక లాంటి సంస్థల తో పాటు అందరిలోనూ ఉంది.

Reporter: Eswar, TV9 Telugu

Also Read : Free RTC Bus: పదో తరగతి విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. ఆరోజు నుంచి బస్సుల్లో ఉచిత ప్రయాణం..