Kurnool Diamonds: పంట పొలాల్లో వజ్రాల వాన.. కర్నూలు జిల్లా వజ్రాల అన్వేషణపై ప్రత్యేక కథనం..
Kurnool Diamonds: అక్కడ తొలకరి చినుకు పడిందంటే అందరి చూపు అటువైపే పడుతుంది. ఈసారైనా అదృష్టం వరించకపోతుందా.? అని వేలాది మంది ఆశతో పత్తికొండ బాట పడుతారు...

Kurnool Diamonds: అక్కడ తొలకరి చినుకు పడిందంటే అందరి చూపు అటువైపే పడుతుంది. ఈసారైనా అదృష్టం వరించకపోతుందా.? అని వేలాది మంది ఆశతో పత్తికొండ బాట పడుతారు. వజ్రాల వేటలో తలమునకలు అవుతారు. ప్రతీ ఏటా మొదలైన ఈసారి కూడా వజ్రాల వేట మొదలైంది. తొలకరి చినుకులు రావడంతో పత్తికొండ పొలాల్లో అన్వేషణ మొదలుపెట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరుగుతున్న వజ్రాల అన్వేషణ ప్రత్యేక కథనం మీకోసం..
అసలీ వజ్రాలు ఎక్కడివి..
రాయలసీమ జిల్లాల్లో కృష్ణదేవరాయల కాలంలో రత్నాలు వజ్రాలు బంగారు ఆభరణాలు రాసులుగా పోసి అమ్మేవారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎడ్ల బండ్లలో తరలించే వారు. ఆ సమయంలో అక్కడక్కడా పడిపోయినవే నేడు బయటకు వస్తున్న వజ్రాలు అని కొందరు భావిస్తారు. అలాగే భూమి పొరలలో అనేక మార్పులు జరుగుతూ భయంకరమైన వేడికి భూమి లోపల నుంచి వచ్చిన వజ్రాలు, వర్షాలకు బయట పడుతున్నాయని మరి కొందరి వాదన. వాస్తవం ఏదైనా పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలం జొన్నగిరి పగిడిరాయి, ఎర్రగుడి, బసినేపల్లి, కొత్తూరు, చెన్నంపల్లి చెరువు తండ తదితర గ్రామాలలో వజ్రాల అన్వేషణ పెద్ద ఎత్తున జరుగుతోంది. గతంలో ఒక క్యారెట్ నుంచి ముప్పై క్యారెట్ల వజ్రాలు చాలా మందికి దొరికాయి. కూలీలు సైతం రాత్రికి రాత్రే లక్షాధికారులుగా మారిపోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఈ ప్రాంతాలలో పొలాల లోని చిన్న చిన్న రాళ్లు మెరుస్తూ ఉండటం వజ్రాలను పోలి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆ రాళ్ల నుంచి కొన్ని నిజమైన వజ్రాలు వర్షాలకు ఉబికి వస్తున్నాయి. దీంతో వర్షం వచ్చినప్పుడల్లా వజ్రాల అన్వేషణ కోసం వేలాదిమంది ఈ గ్రామాలలో వచ్చి వాలుతుంటారు.
ఈ అన్వేషణలో చిన్నపాటి రంగురాళ్ల నుంచి వజ్రాల వరకు కొనేందుకు పెరవలి గుత్తి మద్దికేర తదితర ప్రాంతాలలో వజ్రాల వ్యాపారులు స్థావరం ఏర్పాటు చేశారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వజ్రాల వ్యాపారులు తమకు ఏజెంట్లను కూడా నియమించుకున్నారు. పలానా వారికి వజ్రం దొరికింది అని ప్రచారం జరిగితే చాలు వ్యాపారుల ఏజెంట్లు అక్కడికి వెళ్లి వాలి పోతారు. గత ఏడాది చిన్న జొన్నగిరి కి చెందిన ఓ వ్యక్తికి 30 క్యారెట్ల వజ్రం లభ్యమైంది దీనిని స్థానిక వ్యాపారులు రూ. 1.25 కోట్లకు కొనుగోలు చేశారు. అయితే బహిరంగ మార్కెట్లో దీని విలువ రూ. మూడు కోట్లకు పైగా ఉంటుందని భావిస్తున్నారు. ఇలా దొరికినప్పుడల్లా పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం చూసి ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి సైతం వజ్రాల అన్వేషణకు ఆశావహులు తరలివస్తున్నారు. గుత్తి, పత్తికొండ ప్రధాన రహదారి చూస్తే ఇరువైపులా పొలాల్లో వేల మంది వజ్రాల అన్వేషణ కనిపిస్తారు. బైకులు కార్లు ఆటోలు లో తరలివస్తుంటారు. ఉదయం ఏడు గంటల నుంచే సాయంత్రం పొద్దుపోయేదాకా అన్వేషణ కొనసాగిస్తారు మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే చేస్తారు. మహిళలు అయితే చంటి పిల్లలను తీసుకొని అన్వేషణ కోసం వస్తుంటారు.
భగ్గుమంటున్న రైతులు..
ప్రతి ఏటా జరిగే అన్వేషణకు ఈసారి భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. బాధిత రైతులు ఒక్కసారిగా భగ్గుమంటున్నారు. తమ పొలాలలో వజ్రాల కోసం వచ్చే వారి పై దాడికి దిగుతున్నారు. బైకులు ధ్వంసం చేస్తున్నారు. పొలాలు పంటలు నాశనం చేస్తున్నారంటూ వాపోతున్నారు. వర్షం వచ్చినప్పుడల్లా తమ పొలాల వద్ద కర్రలతో కాపలాగా ఉంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు దారి పొడవునా హెచ్చరిక బోర్డులు రైతులే స్వయంగా సంఘంగా ఏర్పడి ఏర్పాటు చేసుకున్నారు. వజ్రాల వేట పేరుతో తమ పొలాల్లోకి దిగితే శిక్ష తప్పదు అని బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. వజ్రాల అన్వేషణకు వస్తున్న వారికి, రైతులకు మధ్య జరుగుతున్న ఘర్షణ పోలీసుల దృష్టికి కూడా వెళ్లింది. గతంలో కూడా పోలీసులకు రైతులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించలేదు. ఈసారి ఘర్షణ వాతావరణం నెలకొనడంతో తప్పకుండా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులే స్వయంగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసుకున్న విషయం వాస్తవమేనని తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..