AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: వీడు చేసేది సాఫ్ట్‌వేర్ జాబ్.. సైడ్ బిజినెస్ దొంగచాటు యవ్వారం..

చదివింది ఇంజనీరింగ్. ఉద్యోగం సాఫ్ట్‌వేర్. అయితే జల్సాల వ్యసనం జీవితాన్ని మార్చేసింది. ఈజీ మనీ కోసం సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదులుకునేలా చేసింది. శ్రీవారి దర్శనం టికెట్ల దళారీని చేసింది. నకిలీ దర్శనం టికెట్ల దందాతో దొంగ దారిలో దర్జాగా బతకాలనుకొని ఎట్టకేలకు కటకటాల పాలు కావాల్సి వచ్చింది.

AP News: వీడు చేసేది సాఫ్ట్‌వేర్ జాబ్.. సైడ్ బిజినెస్ దొంగచాటు యవ్వారం..
Tirupati
Raju M P R
| Edited By: Ravi Kiran|

Updated on: Feb 22, 2025 | 6:54 PM

Share

పంజా రమణ ప్రసాద్. 29 ఏళ్ల రమణ ప్రసాద్ పశ్చిమ గోదావరి జిల్లా పంచవరం గ్రామానికి చెందిన యువకుడు. చదివింది బీటెక్. 2015 వరకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. ఆ తర్వాతే ఈజీ మనీ కోసం దొంగదారి వెతికాడు. వడ్డీకాసుల వాడి దర్శనానికి వచ్చే భక్తులను టార్గెట్ చేశాడు. తిరుమల శ్రీవారి దర్శనం ఆర్థిక సేవా టికెట్ల పేర ఘరానా మోసానికి తెర తీశాడు. ఏకంగా రూ కోటి మేర కొట్టేసి అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. బీటెక్ చదివి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ విలాసాలకు అలవాటుపడ్డ రమణ ప్రసాద్ అక్రమ సంపాదన కోసం తిరుమలలో దళారీ అవతారం ఎత్తాడు. 2016లో తిరుమలకొచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూను బ్లాక్‌లో విక్రయిస్తూ పరిచయాలు పెంచుకున్నాడు. లడ్డూలు కావాలనుకున్న భక్తులు సంప్రదిస్తే అధిక ధరలకు లడ్డూలను సమకూరుస్తూ వచ్చిన రమణ ప్రసాద్ శ్రీవారి దర్శనం సేవా టికెట్లను సైతం ఇప్పిస్తానంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆన్‌లైన్‌లో టికెట్లను సమకూర్చి ఒక్కో టికెట్‌కు రూ. 1000 దాకా అదనంగా తీసుకోవడం అలవాటు చేసుకున్న రమణ ప్రసాద్ భక్తుల అవసరాలను గుర్తించి ముగ్గులో దింపాడు.

ఇలా రమణ ప్రసాద్ తనను నమ్మిన కొందరు భక్తులు వెంకన్న ఆర్జిత సేవల దర్శనం టికెట్ల కోసం సంప్రదించేలా చేసుకున్నాడు. భక్తులను నమ్మించే ప్రయత్నంలో ఎవరు ఫోన్‌ చేసినా ట్రూ-కాలర్ టీటీడీ జేఈఓ ఆఫీస్ అని వచ్చేలా ఖతర్నాక్ ఐడియా ప్రదర్శించాడు. తనకున్న సాఫ్ట్‌వేర్ టెక్నాలజీతో రమణ ప్రసాద్ నకిలీ టికెట్లను పంపుతూ దోచుకోవడం ప్రారంభించాడు. వాట్సాప్ గ్రూపులు కూడా క్రియేట్ చేసి ఫేక్ టికెట్స్ దందా కొనసాగించాడు. తన పేరుతో కుటుంబ సభ్యుల పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిచి డిజిటల్ మనీ ట్రాన్సాక్షన్స్ కొనసాగించాడు. ఇలా శ్రీవారి భక్తులను నిలువు దోపిడీ చేసి మోసానికి పాల్పడ్డ రమణ ప్రసాద్ కొందరు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో అడ్డంగా బుక్కయ్యాడు.

ఇక రమణ ప్రసాద్‌ను అరెస్టు చేసిన తిరుమల టూ-టౌన్ పోలీసులు.. అతడి బ్యాంక్ ఖాతాలను పరిశీలించడంతో దిమ్మతిరిగే వాస్తవాలను గుర్తించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో రమణ ప్రసాద్ బాధితులు ఉన్నట్లు గుర్తించారు. రమణ ప్రసాద్ 9 బ్యాంక్ ఖాతాల ద్వారా దాదాపు రూ 1.33 కోటికిపైగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన పోలీసులు. తిరుమల వన్ టౌన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్లలోనే కాకుండా విజయనగరం, కాకినాడలోనూ దాదాపు 14 కేసులు నమోదైనట్లు గుర్తించారు. ఏడాది పాటు జైలు శిక్ష కూడా అనుభవించినట్లు గుర్తించిన పోలీసులకు రమణ ప్రసాద్ నేరాల చిట్టా దిమ్మతిరిగేలా చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి