Shirdi Sai Baba: తొమ్మిది రోజుల్లో షిర్డీ సాయనాథుడి హుండీ ఆదాయం ఎంతో తెలుసా..?
నిండుగా హుండీలు...! న్యూఇయర్ సందర్భంగా ప్రధాన ఆలయాల్లోని హుండీలన్నీ నిండాయి...! తిరుమల నుంచి షిర్డీ వరకు... కనకదుర్గమ్మ నుంచి కాణిపాకం దాకా... అన్ని ఆలయాల హుండీ ఆదాయం అమాంతం పెరిగింది. కొత్త సంవత్సరం వేళ ఇష్ట దైవాలకు భక్తులు రికార్డు స్థాయిలో కానుకల సమర్పించారు.

కొత్త సంవత్సరం ఆలయాలకు కానుకల వర్షం కురిపించింది. మహారాష్ట్రలోని షిర్డీ సాయినాథుడికి భక్తులు రికార్డు స్థాయిలో విరాళాలు సమర్పించారు, డిసెంబర్ 25 నుంచి నుంచి జనవరి 2 వరకు అంటే… కేవలం తొమ్మిది రోజుల్లోనే… 23 కోట్ల 29 లక్షల 24వేల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది. దానం కౌంటర్ల ద్వారా 3 కోట్ల 22 లక్షల 43 వేల రూపాయలు… పీఆర్ టోల్ పాస్ ద్వారా 2 కోట్ల 42 లక్షల 60 వేలు… డెబిట్, క్రెడిట్, ఆన్‌లైన్, మనీ ఆర్డర్ల ద్వారా 10 కోట్ల 18 లక్షల 87 వేలు… ప్రపంచంలోని 26 దేశాల నుంచి వచ్చిన కరెన్సీతో 16 లక్షల 84 వేల రూపాయలు…ఇలా మొత్తం కలిసి 23 కోట్ల 29 లక్షల 24వేల రూపాయలు వచ్చినట్లు షిర్డీ ఆలయ అధికారులు వెల్లడించారు.
విరాళాలతో పాటు బంగారం, వెండి రూపంలోనూ తమ భక్తిని చాటుకున్నారు భక్తులు. 36 లక్షల 39 వేల రూపాయల విలువచేసే 294 గ్రాముల బంగారం, 9 లక్షల 50 వేల రూపాయలు విలువచేసే 5 కిలోల 983 గ్రాముల వెండిని కానుకగా సమర్పించారు భక్తులు. ఈ భారీ విరాళాలు షిర్డీ సాయినాథుడిపై భక్తులకున్న అపారమైన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయన్నారు ఆలయ అధికారులు.
ఏపీలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయం ఈ సారి రికార్డు క్రియేట్ చేసింది. గత 16 రోజుల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 3 కోట్ల 6 లక్షల 65 వేల 288 రూపాయల హుండీ ఆదాయం సమకూరింది. నగదుతో పాటు భక్తులు తమ మొక్కుల రూపంలో 341 గ్రాముల బంగారం, 3.586 కిలోల వెండి వస్తువులను అమ్మవారికి సమర్పించుకున్నారు. ఇటీవల ముగిసిన భవానీ దీక్షల విరమణ, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో భక్తుల రద్దీ భారీగా పెరగడంతో ఆదాయం కూడా గణనీయంగా పెరిగిందని ఆలయ అధికారులు వెల్లడించారు.
మరీ ముఖ్యంగా ఈసారి అమ్మవారి హుండీలో విదేశీ కరెన్సీ విపరీతంగా లభించడం విశేషం. అమెరికా డాలర్లు, యూరోలు, సింగపూర్ డాలర్లతో పాటు పలు దేశాలకు చెందిన నోట్లను భక్తులు అమ్మవారికి కానుకలుగా సమర్పించారు. ఇటు శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళం అందించాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ PMS ప్రసాద్ 3 కోట్ల రూపాయల చెక్‌ను టీటీడీ ఈవోకు అందజేశారు. మొత్తంగా… ఈ కొత్త సంవత్సరం హుండీలను కానుకలతో నింపింది. హుండీ ఈ సారి అద్భుతమండీ అనేలా చేసింది.
