Andhra Pradesh: జిల్లా కలెక్టర్ చొరవతో తెంచుకున్న బానిస సంకెళ్లు.. 33 మందికి విముక్తి..!
వారంతా రోజువారీ కూలీలు. వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఉపాధి కల్పిస్తామని ఆశ చూపి వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. వారి అమాయకత్వాన్ని అదునుగా చేసుకొని బానిసత్వంలో బంధించారు. అయినవారికి, ఉన్న ఊరికి దూరంగా దీనస్థితిలో కాలం వెళ్లదీస్తున్న ఏడు కుటుంబాలకు ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా చొరవతో విముక్తి లభించింది.

వారంతా రోజువారీ కూలీలు. వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఉపాధి కల్పిస్తామని ఆశ చూపి వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. వారి అమాయకత్వాన్ని అదునుగా చేసుకొని బానిసత్వంలో బంధించారు. అయినవారికి, ఉన్న ఊరికి దూరంగా దీనస్థితిలో కాలం వెళ్లదీస్తున్న ఏడు కుటుంబాలకు ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా చొరవతో విముక్తి లభించింది. వెట్టిచాకిరీ నుంచి విముక్తి లభించిన ఆ కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ భరోసా ఇచ్చారు. బాధితులకు రిలీఫ్ సర్టిఫికెట్లు, నిత్యావసర వస్తువులు అందించారు.
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలోని ఆలూరు, ఈతముక్కల గ్రామాలకు చెందిన నిరుపేద ఏడు కుటుంబాలు చిలకలూరిపేట సమీపంలో జామాయిల్ తోటల్లో పనికి వెళ్లారు. వారి అమాయకత్వాన్ని, అవసరాన్ని, పేదరికాన్ని అవకాశంగా చేసుకున్న యజమాని వారితో వెట్టిచాకిరి చేయిస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. గర్భిణి, బాలింతలతోనూ బలవంతంగా పని చేయిస్తున్నట్లు యానాది సంఘాల మహా కూటమి, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా దృష్టికి తీసుకు వెళ్ళారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ, ఇతర సంబంధిత శాఖల అధికారులు రంగంలోకి దిగారు. ఈ ఏడు కుటుంబాల్లోని మొత్తం 33 మందికి విముక్తి కల్పించి ఒంగోలు తీసుకువచ్చారు. జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా చేతుల మీదుగా రిలీఫ్ సర్టిఫికెట్లతో పాటు స్వీట్లు, దుస్తులు, ఇతర వంట సరుకులను అందించారు. చట్ట ప్రకారం ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించడంతో పాటు జీవనోపాధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. బాధితుల్లోని ఆసక్తి, అర్హతను బట్టి తగిన ఉపాధి శిక్షణ కూడా ఇప్పించాలని నిర్దేశించారు. అమానవీయ స్థితిలో ఉన్న తమకు స్వేచ్ఛ కల్పించిన జిల్లా కలెక్టర్ అన్సారియాకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..