Nallamala Ghat: నల్లమల ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రేకులు పడక ఆర్టీసీ బస్సు బోల్తా
ప్రకాశం జిల్లాలోని నల్లమల ఘాట్ రోడ్డులో(Nallamala Ghat Road) ఘోర ప్రమాదం జరిగింది. పెద్దదోర్నాల - శ్రీశైలం రహదారిలోని చింతల సమీపంలో ఆర్టీసీ బస్సు(RTC Bus), బొలెరో వాహనం ఢీ కొన్నాయి. బస్సు బ్రేక్ పడక ముందు వెళుతున్న బొలెరో వాహనాన్ని...
ప్రకాశం జిల్లాలోని నల్లమల ఘాట్ రోడ్డులో(Nallamala Ghat Road) ఘోర ప్రమాదం జరిగింది. పెద్దదోర్నాల – శ్రీశైలం రహదారిలోని చింతల సమీపంలో ఆర్టీసీ బస్సు(RTC Bus), బొలెరో వాహనం ఢీ కొన్నాయి. బస్సు బ్రేక్ పడక ముందు వెళుతున్న బొలెరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో రెండు వాహనాలు బోల్తా పడ్డాయి. లోయలోకి పడిపోకుండా మరోవైపు వాహనాలు బోల్తా పడటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 20 మంది స్వల్పంగా గాయపడ్డారు. కర్నూలు జిల్లా బనగానపల్లె(Banaganapalle) ఆర్టీసీ డిపోనకు చెందిన బస్సు.. 55 మంది ప్రయాణికులతో శ్రీశైలం నుంచి పెద్దదోర్నాల వైపు వస్తోంది. మార్గమధ్యంలోని చింతల సమీపంలోకి చేరుకోగానే బస్సు డ్రైవర్ బ్రేక్ వేశాడు. బ్రేక్ పడకపోవడంతో ముందు వెళ్తున్న బొలేరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్ కాలికి తీవ్రగాయమైంది. బస్సులో ప్రయాణిస్తున్న బెంగళూరుకు చెందిన దానమ్మ, కల్యాణంలకు తీవ్రగాయాలయ్యాయి. బొలెరో వాహనంలో ఉన్న పుల్లలచెరువు మండలం నాయుడుపాలేనికి చెందిన కోటమ్మ తీవ్రంగా గాయపడ్డారు.
రెండు వాహనాల్లో మొత్తం 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పెద్దదోర్నాల, పెద్దారవీడు, సున్నిపెంట 108 వాహనాలు ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పెద్దదోర్నాల సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆర్టీసీ బస్సు రహదారికి అడ్డంగా బోల్తా పడటంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.
Also Read
Viral Video: అరే ఏంటి బాయ్ నీ లొల్లి.. సముద్ర సింహాన్నే కొట్టిన పిల్లి.. షాకింగ్ వీడియో
Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ వ్యాన్.. 11 మంది మృతి..