Online Stock Trading Scam: వాట్సాప్‌తో రూ.100 కోట్లు కాజేసిన చైనా కుర్రోడు.. భారతీయులే టార్గెట్!
చైనాకు చెందిన ఓ యువకుడు వాట్సప్ తో చాకచక్యంగా భారతీయులను మోసం చేశాడు. ఇలా ఒకటి కాదు రెండుకాదు ఏకంగా రూ.100 కోట్లు దోచుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ తోపాటు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన వారిని సునాయాసంగా మోసం చేశాడు. తాజాగా ఇతగాడిని ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు ఓ కేసులో అరెస్ట్ చేసి విచారించగా.. మొత్తం బండారం బయటపడింది.
అమరావతి, నవంబర్ 19: ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా స్టాక్ ట్రేడింగ్ యాప్ పేరుతో కోట్ల రూపాయల మోసాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ తరహా మోసాలపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇదే రీతిలో ఢిల్లీలో ఉన్న శారద సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లోనూ ఓ కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు.. చైనీస్ యువకుడు ఫాంగ్ చెంజిన్ రొల్ ను చేధించారు.
ఒక ఫిర్యాదులో 43.5 లక్షల రూపాయల సైబర్ క్రైమ్ కేసులో చేంజిన్ నిందితుడుగా ఉన్నాడు. ఈ కేసులో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా అతని చరిత్ర మొత్తం బయటపడింది. దేశవ్యాప్తంగా సుమారు 100 కోట్లకు పైబడి సైబర్ మోసాలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెళ్లడయింది. వాట్సాప్ లో స్టాక్ ట్రేడింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఇన్వెస్ట్ చేసేలా చేస్తూ డిపాజిటర్లను ప్రేరేపిస్తున్నాడు. జూలైలో సురేష్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ సెషన్స్ పేరుతో డబ్బులు ఇన్వెస్ట్ చేయించాడు. బాధితుడు నుండి సేకరించిన 43.5 లక్షల రూపాయలను తన ఖాతా నుండి మరికొన్ని ఖాతాలకు బదిలీ చేశాడు. బదిలీ చేసిన బ్యాంకు ఖాతాలు అన్నీ కూడా నిందితుడే ఆపరేట్ చేస్తున్నాడు.
చైనీస్ యువకుడు చేంజిన్.. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌లోనూ పలుకేసుల్లో నిందితుడుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీటితోపాటు సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఇతనిపై మొత్తం 17 కేసులు ఉన్నట్లు గుర్తించారు . అన్ని ఫిర్యాదులకు కామన్‌గా fincare బ్యాంక్ ఖాతాతో అనుసంధానమై ఉన్నాయి. ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారానే నిందితుడిని పోలీసులు ట్రేస్ చేయగలిగారు. ఢిల్లీలో ఉన్న మహాలక్ష్మి ట్రేడర్స్ పేరుతో ఈ బ్యాంకు ఖాతా రిజిస్టర్ అయ్యింది. టెక్నికల్ ఆధారాలతో పాటు కాల్ డేటా రికార్డింగ్స్ అన్నిటిని పరిశీలించిన తర్వాత ఇతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చైనీస్ యువకుడి నుండి కీలక ఆధారాలు పోలీసులు సేకరించారు. ఇతడు వినియోగిస్తున్న మొబైల్ ఫోన్స్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతడి ఫోన్లో లభించిన వాట్స్అప్ చాట్ లను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.