AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: వేసి 3 నెలలు కూడా కాలేదు.. రోడ్డు పరిస్థితి చూస్తే ఫ్యూజులు ఔట్

అడ్డగోలు దోపిడీకి అలవాటుపడ్డ కాంట్రాక్టర్లూ.. మామూళ్లకోసం చేతులు చాసే అధికారులూ జోడీ కట్టడంతో... రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత అటకెక్కుతోంది. ఫలితంగా.. ప్రజలకు ఏళ్ళపాటు సేవాలందించాల్సిన రహదారులు రోజులుగడవకుండా ముక్కలౌతున్నాయి.

Andhra Pradesh: వేసి 3 నెలలు కూడా కాలేదు.. రోడ్డు పరిస్థితి చూస్తే ఫ్యూజులు ఔట్
Damaged Road
Ram Naramaneni
|

Updated on: Mar 09, 2022 | 4:33 PM

Share

East Godavari: అడ్డగోలు దోపిడీకి అలవాటుపడ్డ కాంట్రాక్టర్లూ.. మామూళ్లకోసం చేతులు చాసే అధికారులూ జోడీ కట్టడంతో… రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత అటకెక్కుతోంది. ఫలితంగా.. ప్రజలకు ఏళ్ళపాటు సేవాలందించాల్సిన రహదారులు రోజులుగడవకుండా ముక్కలౌతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం(Rampachodavaram ) నియోజకవర్గంలోని ఆర్ అండ్ బి రహదారిని చూస్తే… ఎవ్వరైనా ముక్కున వేలేసుకుంటారు. లక్షలు పోసి నిర్మించిన ఈ రోడ్డు. నెలరోజులు గడిచేసరికే గుంతలతో వెక్కిరిస్తోంది. రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలోని ప్రధానమైన ఆర్ అండ్ బి రోడ్ ని ఇటీవలే అభివృద్ధి చేశారు. గోకవరం నుండి పోతవరం గ్రామం వరకు వేసిన ఈ రహదారికోసం సుమారు 13కోట్లు నిధులు వెచ్చించారు. అత్యంత నాణ్యతా ప్రమాణాలతో నిర్మించేలా కాగితాల్లో లెక్కలు చూపినప్పటికీ… ఆచరణలో మాత్రం నాణ్యత పూర్తిగా పలచబడిపోయింది. లక్షల రూపాయిలు పర్శంటేజీల రూపంలో పక్కదారి పట్టడం వల్లే.. ఈ నిర్మాణంలో నాణ్యత లోపించిందన్న విమర్శలు అధికంగా వినిపిస్తున్నాయి. రోడ్ వేసి మూడునెలల కూడా కాకుండానే.. చాలాచోట్ల రోడ్డు పైకి లేచిపోయింది. అధికార పర్యవేక్షణ, క్వాలిటీ కంట్రోల్ లోపాలే ఈ రహదారికి శాపాలుగా మారాయన్న ఆరోపణలు తలెత్తుతున్నాయి. తారు రోడ్డు నాణ్యత పక్కన పెడితే… నిబంధనల ప్రకారం కనీసం రోడ్ ఇరువైపులా ఎర్త్ వర్క్ కూడా సక్రమంగా చేసిన పరిస్థితి ఇక్కడ లేదు. అక్కడికక్కడే మట్టిని జేసీబీతో తవ్వి బెర్మ్ లు మొక్కుబడిగా పూర్తిచేసి చేతులు దులుపుకొన్నారు. అదికూడా కొన్ని చోట్ల మాత్రమే వేశామా లేదా అన్నట్లు వేశారు.

దీంతో.. ఈ రహదారిలో ప్రమాదకర మలుపులు ఉన్న చోట్ల వాహనదారులు జారిపడుతున్నారు. భారీ వాహనాలు, ట్రాక్టర్ల రాకపోకలతో రహదారి గుంతలు మరింతగా పెరిగిపోతున్నాయి. దీంతో… రోడ్డు వేశారన్న ఆనందం మూడునెలలైనా లేకుండానే…. ఈ రహదారి చెంతన గల గ్రామాల ప్రజలు ప్రమాదాల భయంతో వణికిపోతున్నారు. దీనికితోడు.. కనీసం హెచ్చరికల బోర్డులు గాని, ఆయా ప్రాంతాల్లో గల గ్రామాలపేర్లతో కూడిన బోర్డ్ లను గాని పెట్టలేదు. దీనివల్ల ఇతర ప్రాంతాల ప్రజలు ఆయా గ్రామాలకు ఎటు వెళ్ళాలో తెలియక అయోమయానికి గురౌతున్నారు. దీనిపై ఆర్ అండ్ బి అధికారులను వివరణ కోరగా…. రోడ్డు పాడైనట్టు మా దృష్టికి రాలేదే.. చూస్తాంలే అంటూ సమాధానం చెబుతున్నారు. లక్షలు వెచ్చించి నిర్మించిన రోడ్డు నెలలు కాకుండానే పాడయిపోవడంతో  ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Also Read: అప్పుల పాలైతే ఊరందరికీ భోజనం పెడుతున్న రైతులు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు

 ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్.. అధికారులకు కీలక ఆదేశాలు