Andhra Pradesh: గుంటూరు తొక్కిసలాటపై విచారణ షురూ.. అధికారులతో సమావేశమైన రిటైర్డ్ జడ్జి..
కొత్త ఏడాది తొలి రోజున గుంటూరులో చీరల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ ప్రారంభమైంది. రిటైర్డ్ జడ్జి శేషశయనా రెడ్డి ఆధ్వర్యంలో వేసిన కమిటీ విచారణ జరిపింది.
కొత్త ఏడాది తొలి రోజున గుంటూరులో చీరల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ ప్రారంభమైంది. రిటైర్డ్ జడ్జి శేషశయనా రెడ్డి ఆధ్వర్యంలో వేసిన కమిటీ విచారణ జరిపింది. తొక్కిసలాట జరిగిన గ్రౌండ్స్‌కు వెళ్లి విచారణ జరిపారు. ఆ రోజు ఏర్పాట్లు ఏం చేశారు? తొక్కిసలాటకు కారణాలు ఏంటన్న దానిపై ఆరా తీశారు. కొందరు బాధితులను కూడా విచారించారు.
ఆ తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీస్‌లోనూ విచారణ చేశారు కమిటీ చైర్మన్. ఆ రోజు చీరల పంపిణీకి హాజరైన వారు, తొక్కిసలాట సమయంలో అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఆ రోజు ఏం జరిగిందనేది వివరించేందుకు పెద్దఎత్తున మహిళలు కమటీ ముందు హాజరయ్యారు.
ఉయ్యూరు ఫౌండేషన్ సభ నిర్వహించిన మైదానం ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉంది? సభకు ఎంత మంది మహిళలు వచ్చారు? ఎన్ని వాహనాల్లో కానుకలు తీసుకొచ్చారో కూడా రిటైర్డ్ జడ్జి ఆరా తీశారు. ఆరోజు భద్రతా ఏర్పాట్లు చూసిన డీఎస్పీతోనూ మాట్లాడారు. ఘటనా స్థలంలోనే జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్, డిఎస్పీలు సీతారామయ్య, జేసీ ప్రశాంతితో ఆయన మాట్లాడారు.
గ్రౌండ్ విస్తీర్ణం ఎంతో తేల్చేందుకు కొలతలు కూడా తీసుకున్నారు. అలాగే స్థానిక నేతలతోనూ రిటైర్డ్ జడ్జ్ మాట్లాడారు. సరుకులు తీసుకోవాలనే తొందర్లో తొక్కిసలాట జరగడం దురదృష్టకరమని స్థానిక టీడీపీ కార్పొరేటర్ చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..