Andhra Pradesh: అనాథ మృతదేహాలకు అన్నీతానై అంత్యక్రియలు.. ఓ ప్రభుత్వ ఉద్యోగి మంచి మనసు
సొంతవారికి దహన సంస్కారాలు చేయడానికి నామోషీగా ఫీల్ అవ్వటం, వారిని పట్టించుకోకపోవడం లాంటివి జరుగుతున్న ఈ రోజులలో.. అనాధ శవాలను, మూగజీవాలను హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం అంత్యక్రియలు చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఎక్కడా.. ఎవరూ.. అనాధలుగా పోకూడదని సంకల్పంతో తనకు చేతనైన సాయం చేస్తూ అంత్యక్రియలు..
కడప, సెప్టెంబర్ 16: సొంతవారికి దహన సంస్కారాలు చేయడానికి నామోషీగా ఫీల్ అవ్వటం, వారిని పట్టించుకోకపోవడం లాంటివి జరుగుతున్న ఈ రోజులలో.. అనాధ శవాలను, మూగజీవాలను హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం అంత్యక్రియలు చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఎక్కడా.. ఎవరూ.. అనాధలుగా పోకూడదని సంకల్పంతో తనకు చేతనైన సాయం చేస్తూ అంత్యక్రియలు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు.
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న మల్లికార్జున అనాధ శవాల పాలిట ఆపద్బాంధవుడులా మారాడు. అంతేకాకుండా చనిపోయిన మూగజీవాలకు కూడా దహన సంస్కారాలు చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. ఈ మధ్యకాలంలో ఒక వృషభం చనిపోతే ఎవరూ పట్టించుకోలేదు. మల్లికార్జున ముందుకొచ్చి దానికి దహన సంస్కారాలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నాడు. అంతేకాకుండా రాయచోటి పట్టణ పరిధిలో అనాధలుగా ఎవరు చనిపోయిన స్వయంగా వెళ్లి వారికి హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం దాన సంస్కారాలను నిర్వహిస్తూ ఉంటాడు.
ఇందులో భాగంగా ఆంజనేయస్వామికి ప్రతిరూపంగా భావించే కోతి శనివారం చనిపోగా ఈ విషయాన్ని స్థానికులు మల్లికార్జునకు చేరవేశారు. దీంతో మల్లికార్జున హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఆ వానరానికి దహన సంస్కారాలు నిర్వహించారు. స్థానిక ప్రజలంతా అనాధ శవాలకు, శరణార్థులకు ఆత్మబంధువుగా మల్లికార్జున మారాడని అంటున్నారు. ఇదే విషయంపై ఆయనను అడగగా.. ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తానని అన్నాడు. మొదటి నుంచి ఇలా చేయడం తనకు అలవాటుగా మారిందని చెప్పాడు.